హృదయ సామ్రాజ్ఞి | Dr Sivaramakrishna Iyer Padmavati, India is first woman cardiologist | Sakshi
Sakshi News home page

హృదయ సామ్రాజ్ఞి

Sep 29 2026 3:32 AM | Updated on Sep 29 2026 3:32 AM

Dr Sivaramakrishna Iyer Padmavati, India is first woman cardiologist

అడుగు జాడలు

నేడు వరల్డ్‌ హార్ట్‌ డే

మహిళలు కాలేజీ మెట్లెక్కడం ఊహకందని రోజుల్లోనే మెడిసిన్‌ చేశారు ఎస్‌.ఐ. పద్మావతి. సంప్రదాయవాదుల మూతివిరుపులను పట్టించుకోకుండా కుటుంబం ఆమెకు అండగా నిలిచింది. భారతదేశంలో తొలి మహిళా హృద్రోగ నిపుణురాలిగా చరిత్ర పుటల్లో నిలిచారు శివరామకృష్ణ అయ్యర్‌ పద్మావతి. 

మన దేశంలో మొట్టమొదటి కార్డియాలజీ క్లినిక్, కార్డియాక్‌ కాథెటరైజేషన్‌ ల్యాబ్‌ వ్యవస్థాపకురాలిగా తన ప్రత్యేకత నిలుపుకున్న పద్మావతి... గుండె ఆరోగ్యానికి సంబంధించి నిర్మాణాత్మకమైన విధానాలకు దారి వేసి ‘గ్రాండ్‌ మదర్‌ ఆఫ్‌ కార్డియాలజీ’గా పేరు తెచ్చుకున్నారు. పేదప్రజల గుండెచికిత్స కోసం తన సోదరితో కలిసి ట్రస్ట్‌  ప్రారంభించారు....

ఎస్‌.ఐ. పద్మావతి బర్మాలో జన్మించారు. తండ్రి బారిస్టర్‌. ఆమెకు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీ మణులు. రంగూన్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీయస్‌ చేసిన పద్మావతి లండన్‌లోని ‘రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌’ నుంచి ‘ఎఫ్‌ఆర్‌సీపీయి’ పూర్తి చేసిన తరువాత మూడు నెలల పాటు స్వీడన్‌లో ఉన్నారు. అక్కడి సదర్‌ హాస్పిటల్స్‌లో కార్డియాలజీ కోర్సు చేశాక అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ హాస్పిటల్‌ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ప్రముఖ కార్డియాలజిస్ట్‌ హెలెన్‌ టౌసిగ్‌తో కలిసి  జాన్స్‌ హాప్కిన్స్‌లో చదువుకున్న కాలం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. 

పేదల కోసం...  1952లో హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌లో చేరిన పద్మావతి మోడ్రన్‌ కార్డియాలజీలో మార్గదర్శకుడైన పాల్‌ డడ్లీ వైట్‌ దగ్గర చదువుకున్నారు. యూకేలో ఉన్న కాలంలో నేషనల్‌ హార్ట్‌ హాస్పిటల్‌లో పనిచేశారు. ఆమె ముందు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన వృత్తి అవకాశాలు ఉన్నప్పటికీ ప్రజలకు సేవ చేయడానికి భారతదేశానికి రావాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మన దేశానికి వచ్చిన తరువాత 1953లో దిల్లీలోని లేడి హార్డింగ్‌ మెడికల్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేరారు. 

ఆ తరువాత దేశంలోనే తొలి కార్డియాలజీ క్లినిక్‌ను  ప్రారంభించారు. తన నైపుణ్యంతో అసాధారణ వైద్యురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఎంతోమంది యువ వైద్యులకు స్ఫూర్తినిచ్చారు. నిరుపేదలకు వైద్యసేవలు అందించడానికి 1962లో వైద్యుల బృందం, పారిశ్రామికవేత్త అశోక్‌ జైన్‌తో కలిసి ఆల్‌ ఇండియా హార్డ్‌ ఫౌండేషన్‌(ఏఐహెచ్‌ఎఫ్‌) స్థాపించారు. గుండె ఆరోగ్యాన్ని జాతీయ  ప్రాధాన్యత అంశంగా మార్చాలనే లక్ష్యంతో అడుగులు వేశారు. 1967లో మౌలాన మెడికల్‌ కాలేజీలో కార్డియాలజీ ప్రొఫెసర్‌గా చేరారు. ఆమె కీర్తి దేశ నలుమూలలా విస్తరించింది. అదే సంవత్సరం ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్‌ అందుకున్నారు.

తొంభై ఏళ్ల వయసులోనూ... ఏకకాలంలో మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలైన మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీ, లోక్‌ నాయక్‌ హాస్పిటల్, జీబి పంత్‌ హాస్పిటల్‌లకు చీఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేశారు పద్మావతి. మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజీ డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన తరువాత మరో ప్రతిష్ఠాత్మకమైన  ప్రాజెక్ట్‌ను చేపట్టారు. 

1981లో నేషనల్‌ హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌(ఎన్‌హెచ్‌ఐ) స్థాపించారు. గుండె జబ్బుల నివారణ, గుండె సంరక్షణకు సంబంధించి ‘ఎన్‌హెచ్‌ఐ’ దేశంలో ప్రముఖ కేంద్రంగా ఎదిగింది. తొంభై ఏళ్లు దాటిన తరువాత కూడా ‘ఎన్‌హెచ్‌ఐ’లో ఆమె అవిశ్రాంతంగా పనిచేశారు. రోజుకు పన్నెండు గంటలు పనిచేశారు. తొంభై సంవత్సరాల వయసులో యూరోపియన్‌ సొసైటీ ఆఫ్‌ కార్డియాలజీ (ఇఎస్‌సీ)లో ఫెలో అయ్యారు. తద్వారా ఆమె ఇఎస్‌సీలో అత్యంత సీనియర్‌ ఫెలోగా నిలిచారు.

అందుకే... కార్డియాలజీ! ‘నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో మహిళలకు అందుబాటులో ఉన్న కోర్సులు తక్కువగా ఉండేవి. అందుకే నేను కార్డియాలజీని ఎంచుకున్నాను’ అని చెప్పేవారు పద్మావతి. మన దేశంలో గుండెజబ్బుల వ్యాప్తి గురించి ఆమె స్పందన ఇది...‘గతంలో పరిస్థితులు వేరుగా ఉండేవి. ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ జీవనశైలిలో భాగంగా ఉండేవి. ఇప్పుడు అలా కాదు’ 

ఏడు దశాబ్దాల వృత్తి జీవితంలో హృద్రోగ రంగంలో గణనీయమైన కృషి చేశారు పద్మావతి. ఇతరులు తన అడుగు జాడల్లో నడవడానికి మార్గం సుగమం చేశారు. వైద్యవిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో, నిరుపేదలకు సేవ చేయడంలో భారతదేశ వైద్యచరిత్రలో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఎస్‌.ఐ. పద్మావతి.
 

103 ఏళ్ల వయసులో... 
దేశం గర్వించే వైద్యురాలిగా పద్మావతి పేరు తెచ్చుకోవడం ఒక కోణం అయితే, తన జీవితాన్ని నిరుపేదలకు అంకితం చేయడం మరో కోణం. తన సోదరి జానకి (న్యూరాలజిస్ట్‌)తో కలిసి జానకి–పద్మావతి ట్రస్ట్‌ స్థాపించారు. దీని ద్వారా తమ సంపాదనను పేదరోగుల గుండె చికిత్సల కోసం విరాళంగా ఇచ్చారు. 95 ఏళ్ల వయసు వచ్చే వరకు చురుకుగా పనిచేశారు. కోవిడ్‌ బారిన పడిన పద్మావతి 103 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆమె మరణం భారతీయ కార్డియాలజీ రంగంలో ఒక అద్భుతమైన శకానికి ముగింపు పలికింది. అయితే ఆమె వారసత్వం దేశవిదేశాల్లో ఎంతోమంది వైద్యులకు స్ఫూర్తినిస్తూనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement