ప్రాణాలను సరఫరా చేసే ప్రధాన రక్తనాళమైన అయోర్టాలో ఏర్పడిన అత్యంత ప్రమాదకరమైన చీలిక (అక్యూట్ అయోర్టా డిసెక్షన్)కు కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్ వైద్యులు అరుదైన, అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్, మినిమల్లీ ఇన్వేసివ్ & రోబోటిక్ సర్జన్ డాక్టర్ నిసర్గ.
మెదక్ జిల్లాకు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి పదేళ్లుగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళకు సెప్టెంబర్ 17 తెల్లవారుజామున అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతినొప్పి వచ్చింది. నొప్పి వీపు వరకు వ్యాపించడంతో పాటు చెమటలు, వాంతులు వచ్చాయి. తొలుత స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందినా నొప్పి తగ్గకపోవడంతో కొంపల్లికి మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన గుండె వైద్య నిపుణులు సీటీ స్కాన్ ద్వారా అయోర్టాలో తీవ్రమైన చీలిక ఉన్నట్లు గుర్తించారు. చీలిక గుండె నుంచి బయలుదేరే అయోర్టా నుంచి దాని ప్రధాన శాఖా రక్తనాళాలకు కూడా విస్తరించినట్లు నిర్ధారించారు.
పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో వెంటనే ఆమెను కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్‌కు తరలించారు. చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవి కుమార్ అలూరి, చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్, మినిమల్లీ ఇన్వేసివ్ & రోబోటిక్ సర్జన్ డాక్టర్ నిసర్గ నేతృత్వంలోని వైద్య బృందం పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసి అత్యవసర శస్త్రచికిత్సకు సిద్ధం చేశామన్నారు.
ఈ సర్జ మొత్తం సుమారు 10 గంటల పాటు కొనసాగిందన్నారు. అయోర్టా ఆర్చ్‌ను పునర్నిర్మించే కీలక దశలో తల చుట్టూ ఐస్ ప్యాకులు అమర్చి మెదడుకు మరింత భధ్రత కల్పిస్తూ...శరీర ఉష్ణోగ్రతను 18 డిగ్రీల సెంటీగ్రెడ్‌కు తగ్గించాము. దీనివల్ల కణాల జీవక్రియ వేగం చాలా వరకు మందగిస్తుంది. అనంతరం గుండెను అరగంట పాటు ఆపి, బైపాస్ యంత్రాన్ని నిలిపివేసి సుమారు 30 నిమిషాల పాటు శరీరంలో పల్స్, రక్తపోటు, సాధారణ రక్తప్రసరణ లేకుండా నియంత్రిత పరిస్థితుల్లో అయోర్టా ఆర్చ్ పునర్నిర్మాణాన్ని పూర్తి చేశారు. శస్త్రచికిత్స పూర్తైన అనంతరం రక్తప్రసరణను క్రమంగా పునరుద్ధరించి, శరీర ఉష్ణోగ్రతను మెల్లగా సాధారణ స్థాయికి తీసుకువచ్చామని తెలిపారు. దీంతో గుండె తిరిగి పనిచేయడం ప్రారంభించింది. శస్త్రచికిత్స అనంతరం రోగిని ఐసీయూకు తరలించినట్లు తెలిపారు. ఆ మరుసటి రోజే ఆమె స్పష్టంగా మాట్లాడగలిగారని తెలిపారు.
“అయోర్టా ఆర్చ్ శస్త్రచికిత్సల్లో అత్యంత కీలకమైన దశలో రక్తప్రసరణను తాత్కాలికంగా నిలిపివేయాల్సి ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం ద్వారా మెదడు, ఇతర అవయవాల జీవక్రియను తగ్గిస్తాం. ఆ సమయంలో అయోర్టా దెబ్బతిన్న భాగాన్ని తొలగించి, ఆర్చ్‌ను పునర్నిర్మించాలి. శస్త్రచికిత్స పూర్తయ్యాక రక్తప్రసరణను పునరుద్ధరించి, గుండెను తిరిగి పనిచేయిస్తాం. ప్రతి క్షణం ఎంతో కీలకం” అని తెలిపారు. అకస్మాత్తుగా వచ్చే తీవ్రమైన ఛాతి లేదా వీపు నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలని వైద్యులు సూచించారు.
అయితే ఇలాంటి అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స ఒక్కరి కృషితో సాధ్యం కాదు. కార్డియాక్ అనస్థీషియాలజిస్టులు, పెర్ఫ్యూషనిస్టులు, సర్జికల్ నర్సులు, ఐసీయూ సిబ్బంది సమన్వయంతోనే ఇది విజయవంతమైంది. మొత్తం బృందం అత్యంత ఖచ్చితత్వంతో పనిచేసిందని డాక్టర్ నిసర్గ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Tapeworm Diet: బరువు తగ్గడం కోసం అలానా..! ఏకంగా టేప్ వార్మ్ గుడ్లను..)


