వామికకు ఐస్‌క్రీం అంటే పిచ్చి.. నచ్చినంత తినమని చెప్పా.. కానీ! | Virat Kohli Fitness Mantra After Century In IND Vs WI, Anushka Sharma Reveals How They Are Raising Vamika And Akaay With Healthy Habits | Sakshi
Sakshi News home page

Anushka Sharma: వామికకు ఐస్‌క్రీం అంటే పిచ్చి.. నచ్చినంత తినమని చెప్పా.. కానీ!

Sep 28 2026 1:06 PM | Updated on Sep 28 2026 1:36 PM

Anushka once let Vamika eat as much ice cream as she wanted happened next

PC: Anushka Sharma Instagram

‘‘మన మనసు, మెదడు స్వేచ్ఛగా నచ్చిన పని చేయాలంటే ముందుగా మన శరీరం ఫిట్‌గా ఉండాలి. లేదంటే అనుకున్నది ఏదీ సాధించలేము. నేను శారీరకంగా ఫిట్‌గా ఉంటేనే ఏవిధంగా బ్యాటింగ్‌ చేయగలనో ముందే ఊహించుకోగలుగుతాను.

తద్వారా మ్యాచ్‌ సమయంలో అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేయగలుగుతాను. ఈరోజు మాదిరే అత్యుత్తమంగా రాణించగలుగుతాను’’... వెస్టిండీస్‌తో తొలి వన్డేలో విజయం తర్వాత టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి చేసిన వ్యాఖ్యలు ఇవి.

తిరువనంతపురం వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో 37 ఏళ్ల కోహ్లి.. 88 బంతుల్లో పది ఫోర్లు, తొమ్మిది సిక్సర్ల సాయంతో 139 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సిక్సర్‌తో అర్ధ శతకం, శతకం పూర్తి చేసుకున్న కింగ్‌.. సిక్సర్‌తోనే టీమిండియా విజయాన్ని ఖరారు చేశాడు.

ఈ క్రమంలో కోహ్లి మరోసారి ఫిట్‌నెస్‌ ప్రాధాన్యం గురించి చాటిచెప్పాడు. అయితే, కేవలం ఆట వరకు కాకుండా.. తన కుటుంబాన్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాడు కింగ్‌.

భార్య కూడా అంతే
ఫిట్‌నెస్‌కు మారుపేరు కింగ్‌ కోహ్లి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే, కోహ్లి మాదిరే అతడి సతీమణి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ కూడా ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌. వీరిద్దరు ఎల్లప్పుడూ చలాకీగా, ఆరోగ్యంగా ఉండటానికి కారణం వారి జీవన శైలే.

అయితే, పిల్లలు వామికా, అకాయ్‌లకు విరుష్క జోడీ ఇప్పటి నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు చేస్తున్నారట. ఈ విషయం గురించి అనుష్క శర్మ స్వయంగా గతంలో ఓ ఈవెంట్లో రివీల్‌ చేశారు.

కొన్నాళ్ల తర్వాత ఇదే అలవాటుగా మారిపోయింది
‘‘మా కూతురు చాలా తొందరగా రాత్రి భోజనం కానిచ్చేస్తుంది. సాయంత్రం ఐదున్నర గంటల వరకే దాదాపుగా తన డిన్నర్‌ అయిపోతుంది. ఆ సమయంలో మేమిద్దరం మాత్రమే ఎక్కువగా కలిసి గడుపుతాము.

అప్పుడు మాకు వీలైనంత ఎక్కువగా నిద్రపోయే సమయం దొరుకుతుంది. అకాయ్‌ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ముందుగా సౌకర్యం కోసం మేము ఇలా చేసేవాళ్లం. కానీ కొన్నాళ్ల తర్వాత ఇదే అలవాటుగా మారిపోయింది. నేను కూడా నా పిల్లలతో పాటే ఐదున్నరకే భోజనం ముగించేస్తున్నాను.

ఈ విషయంలో నేను చాలా స్పష్టతతో ఉంటాను. మా కుటుంబం తరచూ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అలా మా పిల్లలకు వివిధ రకాల అనుభవాలు దొరుకుతాయి. ఇది వాళ్ల జీవితంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎక్కడున్నా ఒకే రకమైన జీవనశైలి అలవరచుకునేలా ప్రణాళిక రూపొందించుకున్నాము.

ఎక్కడున్నా సమయానికి తిని, పడుకోవాల్సిందే
మేము ఎక్కడున్నా సరే సమయానికి భోజనం ముగించాల్సిందే. సరైన సమయానికి నిద్రపోవాల్సిందే. ఇందులో ఎలాంటి మార్పూ ఉండదు. విరాట్‌ కూడా ఒక్కోసారి పిల్లల కోసం స్వయంగా భోజనం వండుతాడు.

మన సంప్రదాయ రుచులను పిల్లలకు కూడా పరిచయం చేయాలంటాడు. పాతతరం రుచులను కూడా వాళ్లు ఆస్వాదించాలనేది అతడి ఉద్దేశం’’ అనుష్క శర్మ ఓ ఈవెంట్లో తమ పిల్లల గురించి తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వివరించింది.

అదే విధంగా తానైనా, విరాట్‌ అయినా బలవంతంగా పిల్లలపై ఎలాంటి అలవాట్లు రుద్దమని.. ప్రతీ విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పి నచ్చిన మార్గం ఎంచుకోమని చెప్తామని గతంలో ఓ ఈవెంట్లో పేర్కొంది. ఇందుకు ఉదాహరణగా..

నా కూతురికి ఐస్‌క్రీం అంటే పిచ్చి
‘‘ఓరోజు నేను వామికను ఐస్‌క్రీం మ్యూజియంకు తీసుకువెళ్లాను. నిజానికి వామికకు ఐస్‌క్రీం అంటే చాలా ఇష్టం. ఒకరకంగా పిచ్చి అని కూడా చెప్పవచ్చు (నవ్వుతూ). ఆరోజు షాప్‌నకు వెళ్లిన తర్వాత వామికతో ఓ మాట చెప్పాను.

‘నీకు నచ్చినంత ఐస్‌క్రీం తినేసెయ్‌’ అని చెప్పాను. అందుకు తను ఎంతో సంతోషించింది. కానీ రెండు లేదా మూడు కంటే ఎక్కువ ఐస్‌క్రీములు తినలేకపోయింది. నాకింక చాలు అమ్మా అనేసింది. ఇష్టం ఉన్నంత మాత్రాన ఆరోజు నా కూతురు పది ఐస్‌క్రీములు తినలేదు కదా!

అన్నీ వివరంగా చెప్తాను
పిల్లల అలవాట్లు మార్చే క్రమంలో కఠినంగా ఉండకుండా.. వారికి ఏది మంచో తెలియజేసేందుకు ఒక్కోసారి ఇలాంటివి చేయకతప్పదు. మనం నేరుగా వద్దని చెప్పామంటే పిల్లలు దానిని సానుకూలంగా తీసుకోలేరు. వాళ్లంతట వాళ్లే కొన్ని విషయాలు తెలుసుకునే ఆస్కారం ఇవ్వాలి.

నేను తనకి వివిధ రకాల ఆహారాలను పరిచయం చేస్తూ వాటి వల్ల మనకు కలిగే మేలు, చెడు గురించి చెప్తాను. కొన్ని మనకు తక్షణ శక్తిని ఇస్తే.. మరికొన్ని హాని చేస్తాయని.. ఇంకొన్ని రోజంతా ఆడుకునేంత శక్తిని ఇస్తాయని చెప్పాను. ఒక్కోసారి తనకు ఇవన్నీ అర్థమయ్యేలా చెప్పేందుకు నాలోని నటిని బయటకు తీయాల్సి వస్తుంది (నవ్వుతూ)’’ అంటూ అనుష్క శర్మ పేరెంటింగ్‌ గురించి చెప్పుకొచ్చింది.

చదవండి: ఓల్డేజ్‌ హోంలో వినోద్‌ కాంబ్లీ.. చెడు అలవాట్ల వల్ల జీవితం నాశనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement