టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ ముంబైకర్ ప్రస్తుతం వృద్ధాశ్రమంలో చేరినట్లు తెలుస్తోంది.
వీడియో వైరల్
థానెలోని ఓ పెద్దల కేర్ సెంటర్‌లో ఉన్న వినోద్ కాంబ్లీ అక్కడి నుంచి తన అభిమానులతో మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఓ వీడియో వైరల్‌గా మారింది. కాగా టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్‌కు చిన్ననాటి స్నేహితుడైన వినోద్ కాంబ్లీ.. ముంబై తరఫున దేశీ క్రికెట్ ఆడాడు.
ఈ క్రమంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసి 17 టెస్టులు, 104 వన్డేలు ఆడిన కాంబ్లీ.. టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా అంటే కేవలం 14 ఇన్నింగ్స్‌లోనే వెయ్యి పరుగుల మార్కు అందుకున్న ఆటగాడిగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.
మాజీ క్రికెటర్ల ఆర్థిక సాయం
అయితే, వ్యక్తిగత దురలవాట్ల వల్ల వినోద్ కాంబ్లీ కెరీర్ నాశనం కావడంతో పాటు.. గత కొంతకాలంగా ఆరోగ్యం కూడా క్షీణిస్తోంది. ఈ క్రమంలో గతేడాది అతడు మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో పుణెలోని ఆస్పత్రిలో చేరగా.. మాజీ క్రికెటర్లు ఆర్థికంగా సాయం అందించారు. దీంతో మెరుగైన చికిత్స పొందిన కాంబ్లీ.. కోలుకున్న తర్వాత తాను మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లు మానుకున్నట్లు తెలిపాడు.
అయితే, ఇప్పటికీ యూరిన్ సమస్య ఉందని.. మూత్ర విసర్జనపై అదుపు ఉండటం లేదని కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో కాంబ్లీ తెలిపాడు. ఈ క్రమంలోనే అతడు థానెలోని ఓ ఎల్డర్లీ కేర్ సెంటర్‌లో ఉన్నట్లు వీడియో బయటకు రావడంతో అభిమానులు మరింతగా ఆందోళన చెందుతున్నారు.
ఇక్కడ నాకు బాగుంది
ఇందులో 52 ఏళ్ల వినోద్ కాంబ్లీ మాట్లాడుతూ.. ‘‘నేను వినోద్ కాంబ్లీ.. ఇప్పుడు నేను నిదాన్‌లో ఉన్నాను. ఇక్కడ నాకు మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. శుభ్రత విషయంలో ఎలాంటి రాజీ లేదు. ఫస్ట్‌క్లాస్ ట్రీట్‌మెంట్.
ఇంటికి దూరంగా ఉన్నానన్న భావన లేదు
ఇంటికి దూరంగా ఉన్నానన్న భావన ఏమాత్రం కలగడం లేదు. ఇక్కడ చాలా మంది నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. ఇక్కడ నాతో పాటు చాలా మంది ఉన్నారు’’ అని చెప్పుకొచ్చాడు.
ఈ నేపథ్యంలో కొన్నాళ్లపాటు ఈ కేర్ సెంటర్‌లో ఉండటానికి వెళ్లాడా? లేదంటే అతడి కుటుంబం శాశ్వతంగా అక్కడే ఉంచబోతుందా? అంటూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరేమో పూర్తిగా కోలుకునేంత వరకే కాంబ్లీ అక్కడ ఉంటాడని.. ఆలోపే సదరు కేర్ సెంటర్ ఈ వీడియో ద్వారా ప్రమోషన్ చేసుకుంటోందని విమర్శిస్తున్నారు. కాగా వినోద్ కాంబ్లీకి భార్య ఆండ్రియా హెవిట్, కుమారుడు జీసన్ క్రిస్టియానో కాంబ్లీ, కుమార్తె జొహానా ఉన్నారు.
చదవండి: సచిన్‌తో అతడికి పోలికేంటి?: సెహ్వాగ్
ఇదీ చదవండి: విడాకులకు సిద్ధమైన వినోద్ కాంబ్లీ భార్య.. ‘తల్లి’ మనసు కరిగి.. ఇలా...
Vinod Kambli’s latest video, he is presently at an elderly care centre in Thane.
Praying for his recovery soon. pic.twitter.com/6k1plg1aCl— Abhishek ✨ (@ImAbhishek7_) September 25, 2026


