అర్జున్ టెండుల్కర్- వీరేందర్ సెహ్వాగ్ (PC: Instagram)
తల్లిదండ్రుల కీర్తిప్రఖ్యాతులు వారసులపై ఒక్కోసారి ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా అమ్మ లేదా నాన్న ఏదేని రంగంలో నిష్ణాతులు, దిగ్గజాలుగా పేరొందితే.. వారి పిల్లలు కూడా అదే స్థాయిలో రాణించాలని అభిమానులు కోరుకుంటారు.
క్రికెట్, సినీ రంగాల్లో ఇలాంటి అంచనాలు మరింత భారీగా ఉంటాయి. అయితే, ఇవి సదరు వారసులపై ఒత్తిడి పెంచుతాయే తప్ప ఎందుకూ పనికిరావు అంటున్నాడు టీమిండియా విధ్వంసకర ఓపెనింగ్ బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్.
సెహ్వాగ్ తనయుడి అరంగేట్రం
కాగా సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఇటీవలే భారత అండర్-19 జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో యూత్ వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లలో కలిపి 109 పరుగులు సాధించాడు.
తండ్రి మాదిరే ఓపెనర్, కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఆర్యవీర్ దూకుడుగా ఆడి ఫోర్ల వర్షం కురిపించాడు. ఈ నేపథ్యంలో తండ్రికి తగ్గ తనయుడు అంటూ అప్పుడే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫుట్‌వర్క్ విషయంలో పోలికలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో సెహ్వాగ్.. ఆర్యవీర్, దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ కుమారుడు అర్జున్ టెండుల్కర్ గురించి స్పందించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
మేము చాలా బాగా క్రికెట్ ఆడాము
ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. ‘‘కచ్చితంగా ఇలాంటి పోలికలు ఉంటాయని తెలుసు. మేము చాలా బాగా క్రికెట్ ఆడాము. ఎన్నో రికార్డులు సాధించాము. ఇప్పుడు మా పిల్లలు క్రికెట్‌లోకి దిగారు. కాబట్టి ఈ పోలికలు సహజమే.
అయితే, తండ్రుల ఆట తీరుతో పిల్లల ఆట తీరును పోల్చడం సరికాదు. అలా కాకుండా ఇప్పుడు వారికి పోటీగా ఉన్న, సమకాలీకులతో పోలిస్తే కాస్త బాగుంటుంది. అంతేతప్ప తండ్రులు ఎంతో సాధించారు.. కాబట్టి పిల్లలు కూడా అలాగే ఉండాలి అనే అంచనాలు, పోలికలు సరికాదు.
వాడిని నాతో పోల్చడం అన్యాయం
ఇలాంటి పోలికల వల్ల పిల్లలు నిరాశ చెందుతారు. మీడియా, ప్రజలు అదే పనిగా ఆట గురించి రంధ్రాన్వేషణ చేస్తే వారు కుంగిపోయే పరిస్థితులు కూడా రావొచ్చు. ఆర్యవీర్‌కు ఇప్పుడు కేవలం పద్దెనిమిదేళ్లు.
నేను నా జట్టు కోసం ఎంతో చేశాను. అయితే, ఆర్యవీర్ ఇప్పుడే తన ప్రయాణం మొదలుపెట్టాడు. కాబట్టి వాడిని నాతో పోల్చడం అన్యాయమే అవుతుంది. చాలా మంది సచిన్ టెండుల్కర్‌తో అతడి కుమారుడు అర్జున్‌ను పోలుస్తారు కూడా!
అర్జున్‌కు సచిన్‌తో పోలికేంటి?
అది కూడా అస్సలు సరికాదు. అర్జున్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్. తన నైపుణ్యాలకు తగినట్లు ఆడుతున్నాడు. రంజీ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు ఐదు వికెట్లు కూడా కూల్చాడు. అది అతడి సత్తా. అయినా సరే దిగ్గజ బ్యాటర్ అయిన సచిన్‌తో అర్జున్‌ను పోలుస్తారు.
ఇది తప్పు. అర్జున్ తనకంటూ సొంత గుర్తింపు దక్కించుకుంటున్నాడు. తండ్రి బాటలో అతడు నడవలేదు. బ్యాటర్‌గా కాకుండా తనకు నచ్చినట్లుగా ఆల్‌రౌండర్‌గా ముందుకు సాగుతున్నాడు.
మా పిల్లల్ని స్వేచ్ఛగా ఆడనివ్వండి
మా పిల్లల్ని స్వేచ్ఛగా ఆడనివ్వండి. వారు ఏదైనా సాధించే వరకు వేచి చూడండి. అప్పుడు పోలికలు మొదలుపెడితే కాస్త పద్ధతిగా ఉంటుంది’’ అని వీరేందర్ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
కాగా సెహ్వాగ్ టీమిండియా తరఫున 104 టెస్టుల్లో 8586, 251 వన్డేల్లో 8273, 19 టీ20 మ్యాచ్‌లలో 394 పరుగులు సాధించాడు. ఇక క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు సాధించిన ఏకైక ఆటగాడిగా, అత్యధిక పరుగుల వీరుడిగా చెక్కు చెదరని ప్రపంచ రికార్డు సాధించాడు. సచిన్- సెహ్వాగ్ ఓపెనింగ్ జోడీగానూ అద్బుతంగా రాణించారు.
చదవండి: బ్యాటర్ల విధ్వంసం.. భారీ టార్గెట్‌ను ఊదేసి భారత్ సంచలన విజయం


