SA vs AUS: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ | Marco Jansen Becomes 1st Player To Achieve Rarest Of Rare Feat VS AUS | Sakshi
Sakshi News home page

SA vs AUS: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌

Sep 25 2026 2:18 PM | Updated on Sep 25 2026 3:12 PM

Marco Jansen Becomes 1st Player To Achieve Rarest Of Rare Feat VS AUS

PC: ProteasMenCSA

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను సౌతాఫ్రికా విజయంతో ఆరంభించింది. డర్బన్‌ వేదికగా గురువారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ప్రొటిస్‌ జట్టు 67 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. కింగ్స్‌మెడ్‌ మైదానంలో టాస్‌ గెలిచిన ఆసీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

మెరుపులు మెరిపించారు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆరంభంలో తడబడ్డా తిరిగి పుంజుకుంది. ఇందుకు నాలుగో నంబర్‌ బ్యాటర్‌ మాథ్యూ బ్రీట్జ్కే, మార్కో యాన్సెన్‌ మెరుపులు కారణం. బ్రీట్జ్కే 106 బంతుల్లో 14 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో శతక్కొట్టగా (112).. ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ మెరుపు అర్ధ శతకం సాధించాడు.

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కేవలం 59 బంతుల్లోనే ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 75 పరుగులు సాధించాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా ఎనిమిది వికెట్ల నష్టానికి 297 పరుగులు సాధించింది.

230 పరుగులకే ఆసీస్‌ ఆలౌట్‌
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 41.2 ఓవర్లలో 230 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయింది. ప్రొటిస్‌ బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌ నాలుగు వికెట్లతో చెలరేగగా.. బిజోర్న్‌ ఫార్చూన్‌, కార్బిన్‌ బాష్‌ తలా రెండు, గెరాల్డ్‌ కోయెట్జి, మార్కో యాన్సెన్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

పరుగులు తీయడంతో పాటు వికెట్‌, క్యాచ్‌లు
ఇక ఈ మ్యాచ్‌లో మార్కో యాన్సెన్‌ నాలుగు క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. ఫార్చూన్‌ బౌలింగ్‌లో జోష్‌ ఇంగ్లిస్‌ (3), కోయెట్జి బౌలింగ్‌లో మ్యాట్‌ రెన్షా (44), మహరాజ్‌ బౌలింగ్‌లో జాక్‌ ఎడ్‌వర్డ్స్‌ (5), బాష్‌ బౌలింగ్‌లో మిచెల్‌ స్టార్క్‌ (16) ఇచ్చిన క్యాచ్‌లను ఒడిసిపట్టాడు. ఈ క్రమంలో మార్కో యాన్సెన్‌ చరిత్ర సృష్టించాడు.

ఆస్ట్రేలియాతో ఓ వన్డే మ్యాచ్‌లో అత్యధికంగా 75 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్‌ తీసి.. నాలుగు క్యాచ్‌లు అందుకున్న తొలి ప్లేయర్‌గా యాన్సెన్‌ రికార్డు సాధించాడు. ఓవరాల్‌గా ఓ వన్డే మ్యాచ్‌లో నాలుగు క్యాచ్‌లు అందుకున్న ఐదో ఆటగాడిగా మార్కో యాన్సెన్‌ నిలిచాడు.

ఒక వన్డే మ్యాచ్‌లో 50కి పైగా పరుగులు చేసి నాలుగు క్యాచ్‌లు అందుకోవడంతో పాటు ఒక వికెట్‌ తీసిన క్రికెటర్లు వీరే
👉సచిన్‌ టెండుల్కర్‌ (ఇండియా)- పాకిస్తాన్‌ మీద ఢాకా వేదికగా 1998లో 67 పరుగులు, ఒక వికెట్‌, నాలుగు క్యాచ్‌లు
👉యూనిస్‌ ఖాన్‌ (పాకిస్తాన్‌)- జింబాబ్వే మీద హరారే వేదికగా 2002లో 90 పరుగులు, ఒక వికెట్‌, నాలుగు క్యాచ్‌లు
👉మైకేల్‌ క్లార్క్‌ (ఆస్ట్రేలియా)- టీమిండియా మీద మెల్‌బోర్న్‌ వేదికగా 2004లో 63 పరుగులు, ఒక వికెట్‌, నాలుగు క్యాచ్‌లు
👉మార్నస్‌ లబుషేన్‌ (ఆస్ట్రేలియా)- ఇంగ్లండ్‌ మీద నాటింగ్‌హామ్‌ వేదికగా 2024లో 77 పరుగులు, మూడు వికెట్లు, నాలుగు క్యాచ్‌లు
👉మార్కో యాన్సెన్‌ (సౌతాఫ్రికా)- ఆస్ట్రేలియా మీద డర్బన్‌ వేదికగా 2026లో 75 పరుగులు, ఒక వికెట్‌, నాలుగు క్యాచ్‌లు.

చదవండి: తొలి టెస్టులో ఆసీస్‌ను మట్టికరిపించిన భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement