PC: CApondicherry X
ఆస్ట్రేలియా-‘ఎ’తో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్-‘ఎ’ జట్టు ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 363 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ కేవలం 200 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
162 పరుగుల భారీ తేడాతో
ఫలితంగా పడిక్కల్ సేన పర్యాటక కంగారూ జట్టును ఏకంగా 162 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
కాగా రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆసీస్ ‘ఎ’ జట్టు భారత్‌కు వచ్చింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య మంగళవారం పుదుచ్చేరి వేదికగా తొలి టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ దేవదత్ పడిక్కల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
334 పరుగులకు ఆలౌట్
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 334 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (57), స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తనుశ్ కొటియాన్ (69) అర్ధ శతకాలు బాదగా.. వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా (113) శతక్కొట్టాడు.
171 పరుగులకే కుప్పకూలిన ఆసీస్
ఆసీస్ బౌలర్లలో కోరే రొచిసియోలి నాలుగు వికెట్లు తీయగా.. టాడ్ మర్ఫీ మూడు, బ్రెండన్ డాగెట్, ఫెర్గూస్ ఓ నీల్, లియామ్ స్కాట్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో రెండో రోజు ఆట సందర్భంగా తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్.. కేవలం 171 పరుగులకే కుప్పకూలింది.
ములానికి నాలుగు వికెట్లు
ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (25), ఆల్‌రౌండర్ లియామ్ స్కాట్ (26) కాస్త ఫర్వాలేదనిపించగా.. జేసన్ సంఘా 46 పరుగులతో రాణించాడు. మిగిలిన వాళ్లంతా స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ షమ్స్ ములాని నాలుగు వికెట్లతో చెలరేగి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు.
199 పరుగులు చేసి భారత్ ఆలౌట్..
మిగితా వారిలో ఆల్‌రౌండర్ తనుశ్ కొటియాన్ రెండు వికెట్లు తీయగా.. పేసర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు, అన్షుల్ కాంబోజ్, ప్రఫుల్ హింగే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక గురువారం మూడో రోజు ఆట సందర్భంగా.. 163 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. 199 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
పడిక్కల్ అర్ధ శతకం
ఓపెనర్ సాయి సుదర్శన్ (39) మరోసారి సత్తా చాటగా.. కెప్టెన్ దేవదత్ పడిక్కల్ అర్ధ శతకం (59)తో ఆకట్టుకున్నాడు. కుమార్ కుశాగ్రా (46 నాటౌట్) మరోసారి రాణించాడు. ఆసీస్ బౌలర్లలో టాడ్ మర్ఫీ నాలుగు వికెట్లు తీయగా.. డాగెట్, స్కాట్ తలా రెండు.. సంఘా ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఆసీస్ టార్గెట్ 363
ఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఆసీస్‌కు భారత్ 363 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో 55/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆఖరిదైన నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్.. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కేవలం 200 పరుగులు చేసి ఆలౌట్ అయింది.

PC: X
మరోసారి చెలరేగిన భారత బౌలర్లు
టాపార్డర్‌లో ఓపెనర్లు సామ్ కొన్‌స్టాస్ (20), కాంప్‌బెల్ కెల్లావే (0) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ 35 పరుగులు చేయగలిగాడు. కెప్టెన్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (16) మరోసారి నిరాశపరచగా.. జేసన్ సంఘా 26 పరుగులు చేయగలిగాడు.
ఈ క్రమంలో భారత బౌలర్ల ధాటికి జోష్ ఫిలిప్ (7), లియామ్ స్కాట్ (0), టాడ్ మర్ఫీ (17) ఇలా వచ్చి అలా వెళ్లగా.. ఆల్‌రౌండర్ ఫెర్గూస్ ఓ నీల్ (47) ఒంటరిపోరాటం చేశాడు. అయితే, మిగతా వారి నుంచి అతడికి సహకారం అందలేదు.
షమ్స్ ములాని బౌలింగ్‌లో బ్రెండన్ డాగెట్ (3) పదో వికెట్‌గా వెనుదిరగగా.. ఆసీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. టెయిలెండర్ కోరే నాలుగు పరుగులతో అజేయంగా నిలిచాడు.
భారత బౌలర్లలో పేసర్ తుషార్ దేశ్‌పాండే, స్పిన్నర్ షమ్స్ ములాని చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. ఆల్‌రౌండర్ తనుశ్ కొటియాన్, పేస్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ తలా రెండు వికెట్లు కూల్చారు.
సంక్షిప్త స్కోర్లు
భారత్- ‘ఎ’: 334 & 199
ఆస్ట్రేలియా- ‘ఎ’: 171 &200
ఫలితం: 162 పరుగుల తేడాతో భారత్ గెలుపు


