PC: CApondicherry X
ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత్- ‘ఎ’ బౌలర్లు అదరగొట్టారు. కంగారూ టాపార్డర్‌ను కకావికలం చేసి ఆది నుంచే చుక్కలు చూపించారు. భారత బౌలర్ల విజృంభణ కారణంగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 171 పరుగులే చేసి ఆలౌట్ అయింది.
పుదుచ్చేరి వేదికగా
కాగా భారత్- ‘ఎ’ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆసీస్ పురుషుల జట్టు ఇండియాకు వచ్చింది. ఇందులో భాగంగా అన్ని మ్యాచ్‌లు పుదుచ్చేరిలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మంగళవారం మొదలైన తొలి అనధికారిక టెస్టులో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది.
కుశాగ్రా సెంచరీ
ఓపెనర్ సాయి సుదర్శన్ (57), ఆల్‌రౌండర్ తనుశ్ కొటియాన్ (69) అర్ధ శతకాలు బాదగా.. బుధవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా కుమార్ కుశాగ్రా శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 240 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. 12 ఫోర్ల సాయంతో 113 పరుగులు రాబట్టాడు. మిగిలిన వారిలో అన్షుల్ కాంబోజ్ (23) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.
ఆసీస్ టాపార్డర్ కుదేలు
ఫలితంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 117.3 ఓవర్లు ఆడి 334 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో రోజు బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్‌కు ఆది నుంచే షాకులు తగిలాయి. ఓపెనర్ కాంప్‌బెల్ కెల్లావే (2), వన్‌డౌన్ బ్యాటర్ నాథన్ మెక్‌స్వీనీ (0) పూర్తిగా విఫలం కాగా.. కెప్టెన్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (8) కూడా నిరాశపరిచాడు.
మరో ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్ (76 బంతుల్లో 25), జేసన్ సంఘా కలిసి (64 బంతుల్లో 46) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, షమ్స్ ములాని సంఘాను అవుట్ చేసి ఈ జోడీని విడదీయగా.. తుషాన్ దేశ్‌పాండే కొన్‌స్టాస్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

PC: CApondicherry X
షమ్స్ ములానికి నాలుగు వికెట్లు
ఆ తర్వాత ఆసీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఫిలిప్ (14) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరగా.. ఆల్‌రౌండర్ లియామ్ స్కాట్ 26 పరుగులు చేయగలిగాడు. మిగిలిన వారిలో ఫెర్గూస్ 13, టాడ్ మర్ఫీ 12, బ్రెండన్ డాగెట్ 13 పరుగులు చేయగా.. కోరే రొచిసియోలి 4 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఈ క్రమంలో బుధవారం నాటి ఆట పూర్తయ్యేసరికి 55.3 ఓవర్లలో ఆసీస్ 171 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ షమ్స్ ములాని నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తనుశ్ కొటియాన్ రెండు, పేసర్లు తుషార్ దేశ్ పాండే రెండు, అన్షుల్ కాంబోజ్, ప్రఫుల్ హింగే తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇక ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్‌కు 163 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
చదవండి: ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ: ఆసీస్‌తో రెండో వన్డేలో భారత్ ఓటమి


