ఆఖరి వరకు ఉత్కంఠ: ఆసీస్‌తో రెండో వన్డేలో భారత్‌ ఓటమి | IND A W vs AUS A W: Australia Beat India By 2 Wickets Last Over Thriller | Sakshi
Sakshi News home page

ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ: ఆసీస్‌తో రెండో వన్డేలో భారత్‌ ఓటమి

Sep 23 2026 4:30 PM | Updated on Sep 23 2026 5:15 PM

IND A W vs AUS A W: Australia Beat India By 2 Wickets Last Over Thriller

PC: Female Cricket

ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు చేతిలో భారత మహిళా ‘ఎ’ జట్టుకు పరాజయం ఎదురైంది. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి రెండో అనధికారిక వన్డేలో పర్యాటక ఆసీస్‌ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఆల్‌ ఫార్మాట్‌ సిరీస్‌
కాగా మూడు అనధికారిక టీ20లు, మూడు అనధికారిక వన్డేలు, ఒక అనధికారిక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళల జట్టు భారత్‌కు వచ్చింది. ఇందులో భాగంగా టీ20 సిరీస్‌ను కంగారూ జట్టు 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

ఈ క్రమంలో భారత్‌- ఆసీస్‌ మహిళల ‘ఎ’ జట్ల మధ్య ఆదివారం నుంచి వన్డే సిరీస్‌ మొదలుకాగా.. తొలి మ్యాచ్‌లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. అయితే, తాజాగా రెండో వన్డేలో మాత్రం ఓటమిపాలైంది.

మొహాలిలోని పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఐఎస్‌ బింద్రా స్టేడియంలో బుధవారం టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు తనీశా సింగ్‌ (37), ప్రియా పునియా (36) శుభారంభం అందించగా.. కెప్టెన్‌, వన్‌డౌన్‌ బ్యాటర్‌ యస్తికా భాటియా శతక్కొట్టింది.

కెప్టెన్‌ విధ్వంసకర శతకం
మొత్తంగా 84 బంతులు ఎదుర్కొన్న యస్తికా.. 16 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 112 పరుగులు సాధించింది. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ విధ్వంసకర శతకంతో చెలరేగగా.. తేజల్‌ హసాబ్నిస్‌ (60), అనుష్క శర్మ (60 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో దుమ్ములేపారు. మిగిలిన వారిలో నికీ ప్రసాద్‌ డకౌట్‌ కాగా.. మిన్ను మణి (3) విఫలమైంది. ఆఖర్లో సయాలీ సత్గరే 12 బంతుల్లో 12 పరుగులతో అజేయంగా నిలిచింది.

ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి భారత్‌ 338 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇక ఆసీస్‌ బౌలర్లలో డార్సీ బ్రౌన్‌ మూడు వికెట్లతో సత్తా చాటగా.. మిల్లీ ఇల్లింగ్‌వర్త్‌ రెండు వికెట్లు కూల్చింది. లిల్లీ మిల్స్‌కు ఒక వికెట్‌ దక్కింది.  

ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ నికోలీ ఫాల్తుమ్‌ (12)ను సయాలీ సత్గరే తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపింది. అయితే, భారత శిబిరానికి ఈ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.

మెరుపులు మెరిపించారు
మరో ఓపెనర్‌, కెప్టెన్‌ తాహిలా విల్సన్‌ (79), వన్‌డౌన్‌ బ్యాటర్‌ అనికా లిరాయిడ్‌ (54) అర్ధ శతకాలతో దుమ్మురేపారు. ఇక నాలుగో నంబర్‌ బ్యాటర్‌ చార్లి నాట్‌ (37 బంతుల్లోనే 63) టీ20 తరహాలో మెరుపులు మెరిపించింది. మిగిలిన వారిలో టెస్‌ ఫ్లింటాఫ్‌ (38), హేలీ సిల్వర్‌ హోమ్స్‌ (47) కూడా రాణించారు.

లిల్లీ మిల్స్‌ 12 పరుగులు చేయగా.. ఆఖరి ఓవర్లో ఆసీస్‌ విజయానికి కేవలం ఐదు పరుగులు కావాల్సి వచ్చింది. అప్పటికి మిల్లీ ఇల్లింగ్‌వర్త్‌ 18, డేసీ బ్రౌన్‌ ఒక పరుగుతో ఉన్నారు. చివరి ఓవర్లో నికీ ప్రసాద్‌ బంతితో రంగంలోకి దిగగా.. తొలి బంతి వైడ్‌ అయింది.

ఆఖరి ఓవర్లో ఉత్కంఠ.. చివరికి
మరుసటి బంతికి పరుగు తీయలేకపోయి బ్రౌన్‌.. రెండో బంతికి సింగిల్‌ తీసి స్ట్రైక్‌ మిల్లీకి ఇచ్చింది. ఈ క్రమంలో మూడో బంతి నోబాల్‌ కాగా.. తద్వారా లభించిన ఫ్రీ హిట్‌ను మిల్లీ ఫోర్‌గా మలిచింది. దీంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఆసీస్‌ జయభేరి మోగించింది. 49.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 341 పరుగులు చేసి.. రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

భారత బౌలర్లలో మిన్ను మణి మూడు వికెట్ల తీయగా.. నికీ ప్రసాద్‌, సయాలి సత్గరే చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. వైష్ణవి శర్మ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకుంది. భారత్‌- ఆసీస్‌ మధ్య శుక్రవారం నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది. ఇందుకు మొహాలీ వేదిక.

చదవండి: సెహ్వాగ్‌ కొడుకు మెరుపులు.. కెప్టెన్‌ సెంచరీ.. ఆసీస్‌పై భారత్‌ గెలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement