PC: BCCI/CA
భారత్- ‘ఎ’, ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్ల మధ్య తొలి అనధికారిక టెస్టులో మొదటిరోజు ఆట ముగిసింది. భారత జట్టు ఆరంభంలో తడబడ్డప్పటికీ లోయర్ ఆర్డర్ రాణించడంతో తిరిగి పుంజుకుంది. కాగా రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆసీస్ ‘ఎ’ పురుషుల జట్టు భారత్‌కు వచ్చింది.
సాయి సుదర్శన్ అర్ధ శతకం
ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య మంగళవారం తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ మొదలైంది. పుదుచ్చేరి వేదికగా టాస్ గెలిచిన భారత్.. తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో అమన్ మోఖడే (6) నిరాశపరచగా.. సాయి సుదర్శన్ అర్ధ శతకం (103 బంతుల్లో 57)తో అలరించాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్, మంచి ఫామ్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్ (3) ఈసారి విఫలం కాగా.. గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ (57 బంతుల్లో 16), యశ్ రాథోడ్ (1) కూడా తేలిపోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా, తనుష్ కొటియాన్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
ఆకట్టుకున్న కుశాగ్రా, తనుష్
ఇద్దరూ కలిసి ఆరో వికెట్‌కు 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కుమార్ కుశాగ్రా సెంచరీకి చేరువవుతున్న వేళ (160 బంతుల్లో 82).. రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇక తొలి రోజు ఆట ముగిసే సరికి ఆల్‌రౌండర్లలో తనుశ్ కొటియాన్ అర్ధ శతకం (134 బంతుల్లో 68) పూర్తి చేసుకోగా.. షామ్స్ ములాని 43 బంతుల్లో పది పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఫలితంగా మంగళవారం నాటి మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి భారత్- ‘ఎ’ జట్టు 89 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో కోరే రొచిసియోలి మూడు వికెట్లు కూల్చగా.. ఫెర్గూస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ చెరో వికెట్ దక్కించుకున్నారు.
చదవండి: పచ్చని ప్రకృతి నడుమ భారత క్రికెటర్ ఐదు బెడ్‌రూమ్‌ల విల్లా!


