వారు అద్భుతం.. ఓడినా మమ్మల్ని భయపెట్టారు: శ్రేయస్ అయ్యర్ | shreyas iyer comments after on against japan victory | Sakshi
Sakshi News home page

వారు అద్భుతం.. ఓడినా మమ్మల్ని భయపెట్టారు: శ్రేయస్ అయ్యర్

Sep 22 2026 3:22 PM | Updated on Sep 22 2026 3:27 PM

shreyas iyer comments after on against japan victory

PC: BCCI/X

సానో అంతర్జాతీయ క్రికెట్ మైదానం వేదికగా జపాన్‌తో జరిగిన చారిత్రాత్మక టీ20 మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. మైదానం తడిగా ఉండటంతో ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జపాన్ బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు మాత్రమే చేయగలిగింది.  ఓపెనర్ అభిషేక్ శర్మ (0) గోల్డెన్ డకౌట్ కాగా.. సంజూ శాంసన్ (9), ఇషాన్ కిషన్ (3) కూడా త్వరగానే పెవిలియన్ చేరారు.

 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 16 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్య చేధనలో జపాన్ 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. కాగా భారత్‌కు ఇది టీ20ల్లో 200వ విజయం కావడం విశేషం. ఈ హిస్టరికాల్ విజయంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ అనంతరం స్పందించాడు.  ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించినప్పటికీ ఇరు జట్ల అత్యుత్తమ ప్రదర్శన చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అయ్యర్ అన్నాడు.

"భారత్‌, జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇరు దేశాల ప్రజలకు నా శుభాకాంక్షలు. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి దీని గురించే మాట్లాడుకుంటున్నాం. ఇక్కడికి చేరుకోవడానికి మాకు దాదాపు 3 గంటల సమయం పట్టినా.. మైదానంలోకి అడుగుపెట్టి అభిమానులను అలరించాలనే ఆలోచనే మా మనస్సులో ఉంది. ఈ చారిత్రక మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించడంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

ఇది కేవలం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినప్పటికీ.. మైదానంలో బరిలోకి దిగినందుకు ఆనందంగా ఉంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు మాకు గట్టి పోటీ ఇచ్చింది. వారు అద్భుతంగా ఆడారు. 

వరుసగా రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టుకు నాయకత్వం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. భారత్ లాంటి జట్టును నడిపించడం చాలా పెద్ద విషయం. ఒత్తిడి ఉన్నప్పుడే నా నుంచి ఉత్తమ ప్రదర్శన వస్తుంది. ఒత్తిడి అనేది నాలోని ఉత్తమ ఆటగాడిని బయటకు తీస్తుందని నమ్ముతాను. ఈ పాత్రను నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను.

మా లక్ష్యం అదే
ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ గెలవడమే మా లక్ష్యం. ముందుగా మేము మ్యాచ్‌లు జరిగే నగోయాకు వెళ్లి అక్కడి పరిస్థితులను అంచనా వేసి, పిచ్ ఎలా స్పందిస్తుందో తెలుసుకుంటాము. ఇతర జట్లు కూడా ఇదే లక్ష్యంతో వస్తాయని నాకు తెలుసు. కానీ మా ప్రణాళికలకు తగ్గట్టు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాం. గతంలో ఏం జరిగిందనో లేదా భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఆలోచించకూడదు. మనం ఎంత ఎక్కువగా వర్తమానంపై దృష్టి పెడితే అంత మంచిది" అని అయ్యర్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు."

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement