PC: BCCI X
ఆసియా క్రీడలు-2026 పురుషుల టీ20 టోర్నమెంట్ ఆరంభానికి ముందు టీమిండియా ఆతిథ్య జపాన్‌తో తలపడింది. కాంటోలోని సనో అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఇరుజట్ల మధ్య తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ జరిగింది.
ఊహించని విధంగా
వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో టాస్ బాగా ఆలస్యమైంది. ఈ క్రమంలో మంగళవారం నాటి ఈ మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించగా.. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. అయితే, జపాన్ బౌలర్లు ఊహించని విధంగా విజృంభించారు.
పదిహేడేళ్ల స్పిన్నర్ చార్లీ హారా- హింజే అనూహ్య రీతిలో అభిషేక్ శర్మను గోల్డెన్ డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (9)ను ఇబ్రహీం తకాహషి పెవిలియన్‌కు పంపగా.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (3)ను బెంజమిన్ ఇటో-డేవిస్ అవుట్ చేశాడు.
ఆఖరి వరకు ఉత్కంఠ
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 16 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ ఒకటి, శివం దూబే సున్నా పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత ఐదు ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేయగలిగింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జపాన్ నరాలు తెగే ఉత్కంఠ రేపింది. నిర్ణీత 5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది. ఫలితంగా రెండు పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కిన టీమిండియా చారిత్రక మ్యాచ్‌లో గెలుపొంది ఊపిరిపీల్చుకుంది.
కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియాకు ఇది 200వ విజయం (సూపర్ ఓవర్లు సహా)కావడం విశేషం. తద్వారా ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది.
టీమిండియా ‘డబుల్ సెంచరీ’లో మైలురాళ్లు
👉తొలి విజయం: 2006లో జొబర్గ్ వేదికగా సౌతాఫ్రికాపై ఆరు వికెట్ల తేడాతో గెలుపు
👉యాభైవ విజయం: 2017లో కొలంబో వేదికగా శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో గెలుపు
👉వందవ విజయం: 2022లో కోల్‌కతా వేదికగా వెస్టిండీస్‌పై 8 పరుగుల తేడాతో గెలుపు
👉150వ విజయం: 2024లో గ్రాస్ ఐలెట్ వేదికగా ఆస్ట్రేలియాపై 24 పరుగుల తేడాతో గెలుపు
👉200వ విజయం: 2026లో సనో వేదికగా జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలుపు.


