ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో మరో కొత్త మోడల్ చర్చనీయాంశంగా మారింది. టైప్‌సేఫ్ ఏఐ సంస్థ అభివృద్ధి చేసిన ‘జేవ్’(jev) మోడల్.. విడుదలైన కొద్దిసేపటికే వేగంగా వినియోగదారులను ఆకట్టుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 15న ఈ మోడల్‌ను విడుదల చేశారు. సోమవారం వెల్లడైన వివరాల ప్రకారం.. విడుదలైన 24 గంటల్లోనే అత్యధికులు ‘జేవ్’ను ఉపయోగించడం ప్రారంభించారు.
చాట్‌జీపీటీ, జెమినీలకు ఎలా భిన్నం?
జేవ్‌ను చాట్‌జీపీటీ, జెమినీ తరహా సాధారణ ఏఐచాట్‌బాట్‌గా భావించకూడదు. అవి ప్రధానంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, కథనాలు రాయడం, ఇ-మెయిల్స్ రూపొందించడం వంటి పనులకు ఉపయోగపడతాయి. అయితే జేవ్ ప్రధానంగా నిర్దిష్ట సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడేలా రూపొందించారు.
ఉదాహరణకు.. ఒక సంస్థకు వేలాది కస్టమర్ ఫిర్యాదులు వస్తున్నాయని అనుకుందాం. వాటిలో చెల్లింపులకు సంబంధించిన సమస్యలు ఏవి, సాంకేతిక ఇబ్బందులు ఏవి, తక్షణమే ఉద్యోగి జోక్యం అవసరమైన కేసులు ఏవి అనే విషయాలను గుర్తించడంలో ‘జేవ్’సహాయపడుతుంది. ముందుగా నిర్దేశించిన ఎంపికల్లో ఒకదాన్ని ఎంచుకోవడంతోపాటు.. ఆ నిర్ణయంపై తనకు ఎంత నమ్మకం ఉందో కూడా తెలియజేయగలదు.
ఏయే పనులకు ఉపయోగపడుతుంది?
జేవ్ ప్రధానంగా సాఫ్ట్‌వేర్ సంస్థలు, కస్టమర్ కేర్ విభాగాలు, డెవలపర్లకు ఉపయోగపడేలా రూపొందించారు. కస్టమర్ ఫిర్యాదులను సంబంధిత విభాగాలకు పంపడం, ఒక పనిలో ఉన్న ప్రమాదాన్ని అంచనా వేయడం, ఏఐ ఇచ్చిన సమాధానాలను పరిశీలించడం, ఒక పనిని ఆటోమేటిక్‌గా చేయాలా లేదా మానవుడి జోక్యం అవసరమా అనే నిర్ణయాల్లో దీనిని ఉపయోగించవచ్చు.
జేవ్ ప్రత్యేకతలు ఏమిటి?
సుదీర్ఘమైన సమాధానాలు ఇవ్వడం కంటే.. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం జేవ్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఎంపికల్లో సరైనదాన్ని ఎంచుకోవడం, సమాచారాన్ని వివిధ కేటగిరీలుగా విభజించడం, స్కోర్లు ఇవ్వడం వంటి పనులను ఇది చేయగలదు. మోసాలను గుర్తించడం, కస్టమర్ ఫిర్యాదులను వర్గీకరించడం, కంటెంట్‌ను పరిశీలించడం, ఏఐ ఏజెంట్లు తదుపరి చర్యను ఎంచుకోవడంలో సహాయపడటం వంటి పనులకు జేవ్‌ను ఉపయోగించవచ్చు. అయితే బారీస్థాయిలో వినియోగం పెరిగిన తర్వాతే దీని వాస్తవ సామర్థ్యం, పనితీరు గురించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జేవ్ ఏఐ త్వరలో అందిరికీ అందుబాటులోకి రానున్నదని సమాచారం.
ఇదీ చదవండి: కేతన్ హత్య కేసు: సియా కుటుంబంపై మరిన్ని అనుమానాలు!


