కావాల్సింది... 'ఇంటిగ్రేటివ్‌ ఇంటెలిజెన్స్‌'! | Sakshi Guest Column On Chandrika Tandon Speech At IIMA | Sakshi
Sakshi News home page

కావాల్సింది... 'ఇంటిగ్రేటివ్‌ ఇంటెలిజెన్స్‌'!

Sep 21 2026 12:39 AM | Updated on Sep 21 2026 12:39 AM

Sakshi Guest Column On Chandrika Tandon Speech At IIMA

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్‌ 61వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ఇండో–అమెరికన్‌ బిజినెస్‌ లీడర్, గ్రామీ అవార్డు గ్రహీత చంద్రికా టాండన్‌ చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం:

విశ్వగురు

ఈ రోజు ఇక్కడికి రావడం నాకు ఎంతో గౌరవంగా ఉంది. యాభై ఏళ్ల క్రితం 1975లో ఇక్కడే పీజీపీ చదివిన నేను, మీలానే నేను కూడా ఆ రోజు ఇక్కడ గర్వంగా నిలబడ్డాను. అప్పుడు నా మనసులో ఎన్నో ప్రశ్నలు. మా కాలంలో మేము వరదలను తట్టుకోవాల్సి వచ్చింది. మీరు మాత్రం సునామీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కృత్రిమ మేధ యుగం. ఈ కొత్త ప్రపంచంలో మన ప్రయాణం ఎలా ఉండాలి? నేను నాలుగు ముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలను కుంటున్నాను: అవి: ఇన్‌సైట్, ఇంటెన్షన్, ఇన్నర్‌ స్టిల్‌నెస్, ఇంపాక్ట్‌. ఈ నాలుగింటిని కలిపి ఇంటిగ్రేటివ్‌ ఇంటెలిజెన్స్‌ (సమగ్ర ప్రజ్ఞ) అంటాను. దీన్ని అనుసరించడం నా జీవితాన్ని మార్చింది. 

ఇన్‌సైట్‌ (లోతైన అవగాహన)
ఒక్క దారిలోనే నడవడం కాకుండా, సుదూర ప్రపంచంలోని వివిధ విషయాలను తెలుసుకోండి! మీకు తెలిసిన పరిమితమైన ప్రపంచం నుంచి బయటకు రావాలి. మీ ఆలోచనల చిన్న పరిధి లోనే చిక్కుకుపోకండి. నా ఐఐఎం అహ్మదాబాద్‌ డిగ్రీ ఆధారంగా నేను న్యూయార్క్‌లోని మెక్‌న్సీ సంస్థలో చేరాను. నా చుట్టూ ఉన్న వాళ్లు తెలివైనవారు. వారిలో చాలామంది హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో చదివినవారు. అప్పటివరకు నేను కారు కూడా నడప లేదు. నా అసలైన గుర్తింపు– నా పనిలో నేను అత్యుత్తమంగా ఉండాలి. అందుకోసం ఎంతో కష్టపడ్డాను.

ఇటీవల నేను ఒక నోబెల్‌ బహుమతి విజేతను కలిశాను. ఆయనకు ఇమ్యూనోథెరపీ రంగంలో నోబెల్‌ వచ్చింది. ఏ రంగంలో పరిశోధన ఎక్కువగా ఉపయోగపడిందని అడిగాను. ఆయన వెంటనే కంప్యుటేషనల్‌ బయాలజీ అన్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఆ రంగం గురించి తక్కువ మందికే తెలుసు. సంప్రదాయ పరిశ్రమలు కూడా మనం ఊహించలేనంత వేగంగా మారిపోతున్నాయి. ఉదాహ రణకు సంగీత పరిశ్రమను చూడండి. సీడీల నుంచి సునో వంటి ఏఐ సాధనాల వరకు వచ్చింది. అందువల్ల సృజనాత్మక రంగంలో ఉన్న వారు కూడా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి. మనలో చాలా మంది ఒక ప్రత్యేక రంగంలో నైపుణ్యం సంపాదించడానికి బిజినెస్‌ స్కూల్‌కు వస్తాం. కానీ మీకున్న ఆ రంగ జ్ఞానాన్ని ఏఐ మించిపోతుంది. అందుకే మీ ప్రత్యేకత ‘ఇన్‌సైట్‌’ కావాలి. మీ దృష్టి... కాలం, ప్రదేశం రెండింటినీ దాటిపోవాలి. మీ ఆలోచన ఎన్ని విభిన్న కోణాల్లో ఉంటే, కొత్త అవకాశాలను గుర్తించే అవకాశం అంత ఎక్కువగా లభిస్తుంది. వివిధ ఆలోచనల సంగమంతోనే గొప్ప ఆవిష్కరణలు సాధ్యమవుతాయి.

ఇంటెన్షన్‌ (సంకల్పం)
ఇన్‌సైట్‌ ప్రపంచాన్ని చూడటానికి మీకు సహాయపడుతుంది. కానీ మీరు ఏ దారిని ఎంచుకోవాలో, ఎంత కష్టమైనా దానిపై ఎలా నిలబడాలో నిర్ణయించడానికి ఇంటెన్షన్‌ అవసరం. సుమారు 25 సంవత్సరాల క్రితం విమానంలో నేను ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్‌ ఏ యోగి’ పుస్తకం చదవడం ప్రారంభించాను. నా మనసులో ఎన్నో ప్రశ్నలు... విజయం అంటే ఏమిటి? ఎంత డబ్బుంటే సరిపోతుంది? నా జీవితంలో నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిన క్షణాలు ఏవి? అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. నేను జీవితంలో ఏ పని చేసినా, సంగీతానికి నా జీవితంలో మరింత ముఖ్యమైన స్థానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. 

మార్పులు చాలా క్లిష్టమైనవి. కానీ మన కాళ్ల కింద నేలే మారి పోతే! 18 నెలల క్రితం మేము ఒక పెద్ద విజువల్‌ యానిమేషన్‌ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాం. రెండేళ్ల పని. వేల డాలర్ల ఖర్చు. ప్రాజెక్ట్‌ సగం పూర్తయ్యే సమయానికి ఏఐ అన్నింటినీ మార్చేసింది. ఏఐ ద్వారా తయారైన చిత్రాలు మరింత బాగున్నాయి, వేగంగా తయా రవుతున్నాయి, ఖర్చు కూడా తక్కువ. ఇది అమెరికా పశ్చిమ తీరానికి చెందిన ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థుల పని. ఇది కేవలం సాంకేతికత సమస్యే కాదు. మనుషుల సమస్య కూడా. ఏళ్లుగా పని చేసిన కొంత మంది ఉద్యోగుల నైపుణ్యాలు ఒక్కసారిగా అవసరం లేనివిగా మారిపోయాయి. కొత్త ప్రపంచంలో విశ్లేషణ చేయగలిగితే సరిపోదు, ఊహాశక్తి అవసరం. ఒకే సమయంలో విభిన్న రంగాల గురించి ఆలోచించగల వ్యక్తులకే భవిష్యత్‌లో అవకాశాలు ఎక్కువ. 

ఇన్నర్‌ స్టిల్‌నెస్‌ (అంతర్గత ప్రశాంతత)
ఇంతకుముందు బిజినెస్‌ స్కూల్స్‌లో మనస్సును ఎలా నిర్వ హించుకోవాలనే విషయం గురించి మాట్లాడేవారు కాదు. అది వ్యక్తి గత విషయం అని భావించేవారు. కానీ ఇప్పుడు ప్రతి రంగంలోనూ మానసిక ఆరోగ్యం, ప్రశాంతత, మనిషి సంపూర్ణ వికాసం... ముఖ్యమైన విషయాలుగా మారాయి. సంగీతంపై ఇష్టం నాకు ధ్యానం వైపు దారి చూపించింది. నా జీవితంలో సమస్యలు లేవని కాదు. కానీ వాటికి నేను స్పందించే విధానం మారిపోయింది. ప్రశాంతతతో నా ఆలోచనల్లో స్పష్టత వచ్చింది. ముఖ్యంగా, నాకు ఇతరుల పట్ల కరుణ, నా మీద నాకు నమ్మకం, ప్రపంచంలోని ప్రతి జీవితో అనుబంధం అనే భావన బలపడింది. ‘వసుధైవ కుటుంబకం’ అంటే ఏమిటో ప్రత్యక్షంగా అనుభవించినట్టు అనిపించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రపంచంలో ఇంటిగ్రేటివ్‌ ఇంటెలిజెన్స్‌ అంటే మనిషిగా మన సంపూర్ణ తను కాపాడుకోవడం.

ఇంపాక్ట్‌ (ప్రపంచంపై ప్రభావం)
మీరు నివసిస్తున్న ప్రపంచంలోని చిన్న భాగాన్ని అయినా మీరు ఇంతకంటే మెరుగైన ప్రదేశంగా మార్చాలి. సంగీతం నన్ను లోతుగా స్వస్థపరిచింది. అందుకే ఆ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవా లనుకున్నాను. దీంతో నేను సంస్కృత గ్రంథాలపై పరిశోధన ప్రారంభించాను. ముఖ్యమైన గ్రంథాల అసలు భావాలను తీసుకుని, ప్రపంచంలోని ఆధునిక కళాకారులతో కలిసి అందరూ పాడగలిగే సంగీతాన్ని రూపొందిస్తున్నాను. నాకు గ్రామీ అవార్డు కూడా ఈ రంగంలోనే వచ్చింది. విద్యార్థుల్లారా... సేవ చేయడానికి సిద్ధమవండి. పెద్ద స్థాయి లోనే ప్రారంభించాల్సిన అవసరం లేదు. మీ పాఠశాల నుంచి మొదలుపెట్టండి. మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. మీరు చేయగలిగేది ఒక్కటే... మీ జీవితమనే పడవను సిద్ధం చేసుకోండి.  స్వచ్ఛమైన జ్ఞానం మీకు ప్రతిరోజూ మార్గదర్శనం చేయాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement