భారత జాతీయ అంతరిక్ష సంవర్ధన– ప్రాధికరణ సంస్థ (ఇన్–స్పేస్) ఈమధ్య వార్తలకెక్కింది. భారత అంతరిక్ష కార్యక్ర మాల భవిష్యత్తు గురించి ఆ సంస్థ చైర్మన్ పవన్ గోయెంకా చేసిన ప్రకటన వివాదా నికి కారణమైంది. దానిపై భారత అంత రిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన శాస్త్రవేత్తల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అంతరిక్ష పరిశోధనా సంస్థను ప్రైవేటీకరించే ప్రణాళికలు ఏవీ లేవని గోయెంకా వెంటనే ఖండన విడుదల చేశారు.
అలాంటి సంశయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఇస్రో కూడా స్పష్టం చేసింది. అయితే, ఈ ఉదంతం విధాన నిర్ణయాలలోని కీలకమైన లొసుగులను ఎత్తి చూపింది. ఆ లొసు గులు ఒక్క ఇస్రోలో మాత్రమే కాక, మొత్తం వైజ్ఞానిక సంస్థలన్నింటి లోనూ తీవ్రమైన పర్యవసానాలకు దారితీసేవిగా ఉన్నాయి.
దేన్ని నియంత్రిస్తుంది?
సైంటిస్టులను, శాస్త్ర–సాంకేతిక రంగానికి చెందిన పెద్దలను విశ్వాసంలోకి తీసుకోకుండా, వర్తమాన పరిస్థితులకు తగని విధంగా కేంద్ర ప్రభుత్వం ‘ఇన్–స్పేస్’ను ఏర్పాటు చేసింది. తొమ్మిది స్టాఫ్ యూనియన్లు సెప్టెంబర్ 4న రాసిన లేఖ ఆ సంగతిని ప్రతిబింబి స్తోంది. ఇన్–స్పేస్‌ను ఐదేళ్ళ క్రితం ఏర్పాటు చేశారు. కానీ, అది నిర్వహించే పాత్ర ఏమిటో ఇంతవరకూ స్పష్టం కాలేదు.
‘దోహదకారి–నియంత్రణ’ల పాత్ర రెండింటినీ నిర్వహించే దిగా దాన్ని కేంద్ర ప్రభుత్వ, ఇస్రో పెద్దలు అభివర్ణిస్తూ వస్తున్నారు. అంకుర సంస్థలకు ద్వారాలు తెరిచే ఏకగవాక్ష బిందువుగా దాని దోహదకారి పాత్రను అర్థం చేసుకోవచ్చు. కానీ, నియంత్రణ పదమే పక్కదోవ పట్టించేదిగా ఉంది.
చట్ట బద్ధత కలిగిన నియంత్రణా చట్రం ఏదీ లేకుండానే ప్రైవేటు రంగ ప్రవేశానికి ప్రభుత్వం పురికొల్పింది. ఉపగ్రహాలకు కక్ష్యలో ప్రదేశాలను కేటాయించడం నుంచి భూమిపైన లేదా కక్ష్యలో ఏవైనా ప్రమాదాలు సంభవిస్తే బాధ్యత వహించడం నుంచి బీమా వరకు అంతరిక్ష కార్యకలాపాలలో అంతర్జాతీయ నియమ నిబంధ నలు చాలా ఉంటాయి. కనుక, తగిన నియంత్రణా వ్యవస్థ తప్పని సరిగా ఉండాలి. ఇస్రో ఒక అంతరిక్ష చట్టాన్ని మొదట 2015లో ప్రతిపాదించింది. దానిపై చర్చలు కొనసాగుతున్న సమయంలోనే, కేంద్ర ప్రభుత్వం ‘ఇన్–స్పేస్’ను ఏర్పాటు చేస్తూ 2023లో నూతన అంతరిక్ష విధానాన్ని ప్రకటించింది. ప్రైవేటు రంగం చేపట్టే అంతరిక్ష కలాపాలను నియంత్రించేందుకు ఒక సమగ్ర లీగల్ ఫ్రేమ్ వర్క్‌ను కల్పించేందుకు స్పేస్ బిల్లు ఎట్టకేలకు 2025లో సిద్ధమైంది.
రెండూ ఒకే చేతులోనా?
ఇన్–స్పేస్‌తో ఇతర సమస్యలూ ఉన్నాయి. అంతరిక్ష శాఖ (డాస్) కింద పనిచేసే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా దాన్ని వర్గీకరించారు. అదే శాఖ ఇస్రో పాలనా వ్యవహారాలను కూడా చూస్తోంది. ఒకవేళ ఇన్–స్పేస్ రెగ్యులేటర్‌గా వ్యవహరించదలిస్తే, ఇక్కడ ప్రయోజనాల ఘర్షణ ఇమిడి ఉంది. ఎందుకంటే, ఇస్రో చైర్మన్ ‘డాస్’కు కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ప్రతిపాదిత స్పేస్ చట్టం కింద రెగ్యులేటర్‌గా వ్యవహరించేందుకు ఇన్–స్పేస్ లీగల్ అథారిటీని పొందిందని అనుకుందాం. ఇప్పటిలాగా, అది చేయూతనిచ్చే సంస్థగా కూడా కొనసాగగలుగుతుందా?
నియంత్రణ, వెసులుబాటు రెండూ ఒకరి చేతుల్లోనే ఉండకూడ దనేది ఒక తిరుగులేని సూత్రం. అందుకనే, 1990లలో టెలికామ్ రంగంలోకి ప్రైవేటు సంస్థల ప్రవేశానికి అనుమతించినప్పుడు, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అనే చట్ట పరమైన సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, టెలికమ్యూనికేషన్ల శాఖకు చెందిన నియంత్రణ విధులను దానికి అప్పగించారు.
కేంద్ర ప్రభుత్వం ఒక రకంగా, ఇస్రోకు సమానమైన సంస్థగా ఇన్–స్పేస్‌ను సృష్టించింది. ఇస్రో మాదిరిగానే, దానికి కూడా ఒక చైర్మన్ ఉంటారు. కనీసం ప్రజా దృష్టిలో, రెండు అధికార కేంద్రాలు ఏర్పడినట్లయింది. విస్తృత అంతరిక్ష విధానం–దిశా నిర్దేశం గురించి ఇన్–స్పేస్ చైర్మన్ చేసిన ప్రకటనను ఈ దృష్టి కోణం నుంచి అర్థం చేసుకోవాల్సి ఉంది.
ప్రైవేటు రంగానికి వీలు కల్పించడానికి ఇన్–స్పేస్ పేరుతో వేరొక సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఇస్రోకు చెందిన రెండు వాణిజ్య విభాగాలు– యాంట్రిక్స్ కార్పొరేషన్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ – ఆ పనిని ఇప్పటికే నిర్వహిస్తున్నాయి. ప్రైవేటు రంగంతో ముఖాముఖి జరపడంలో ఆ రెండింటికి కలిపి నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. ఇపుడు కూడా ఇన్–స్పేస్ ఆ వెసులుబాటుకు ముందుస్తు సన్నాహాలను మాత్రమే చూస్తోంది. అమలు బాధ్యతనంతటినీ ఇస్రోయే చూసుకుంటోంది.
అంతటా అదే కథ
ఇస్రోలో మాదిరిగానే ఇతర సైంటిఫిక్ ఏజెన్సీలు కూడా అధికార మార్పిడులకు లోనవుతున్నాయి. శాస్త్రీయ పరిశోధనకు, నిధులు అందుకునే ప్రాజెక్టులకు శాస్త్ర–సాంకేతిక శాఖ (డీఎస్టీ) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించేది. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ రిసెర్చ్ బోర్డ్ ద్వారా అది ఆ పనులను చక్కబెట్టేది. అనుసంధాన్ నేషనల్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్‌ఆర్‌ఎఫ్) పేరుతో కొత్త సంస్థను నెలకొల్ప డంతో డీఎస్టీ దాని ప్రాధాన్యాన్ని కోల్పోయింది. ఈ ఫౌండేషన్ పాలక మండలికి ప్రధాని అద్యక్షత వహిస్తున్నారు. ప్రభుత్వ నిధుల సాయంతో సాగే పరిశోధనకు ఐదేళ్ళ కాలానికి ఈ ఫౌండేషన్‌కు రూ. 50,000 కోట్లు కేటాయించారు.
కేవలం ప్రైవేటు రంగానికుద్దేశించి పరిశోధన–అభివృద్ధి–నవీకరణ (ఆర్డీఐ) నిధికి ఆరేళ్ళ కాలానికి రూ. లక్ష కోట్లు కేటాయించారు. నిధులను వెచ్చించవలసిన తీరు నిర్ణయాల్లోకానీ, పరిశోధన–అభివృద్ధికి సంబంధించి దిశా నిర్దేశం చేయడంలోకానీ డీఎస్టీ పాత్ర నామమాత్రమే. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అధికా రాలను తగ్గించేందుకు కూడా సాగుతున్న ఇటువంటి ప్రయత్నాల గురించి గతంలో వివరించడం జరిగింది. ఆరోగ్య పరిశోధనకు మార్గదర్శనం చేసే బాధ్యతను మెడికిల్ సైంటిస్టులు, ప్రజారోగ్య నిపుణుల నుంచి తప్పిస్తున్నారు.
ముఖ్య సైంటిఫిక్ సలహాదారు అధ్యక్షతన గల కేంద్రీకృత జాతీయ ఆరోగ్య పరిశోధనా సారథ్య కమిటీ ఇపుడు జాతీయ ఆరోగ్య పరిశోధనా అజెండాను నిర్ణయిస్తుందన్నమాట. కమిటీలో సభ్యులుగా ప్రభుత్వ ఉన్నతాధికారులే ఉంటారు. ఆరోగ్య పరిశోధనా శాఖ అమలుపరచే సంస్థగా ఉంటుంది. ‘శాస్త్రీయ, సాంకేతిక అమలు’కు బాధ్యత వహిస్తూ ఐసీఎంఆర్ చివరి అంచెలో ఉంటుంది.
ఈ అధికార మార్పిడులన్నీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి నిర్ణాయక అధికారాలను సాంకేతికేతర వ్యక్తుల చేతుల్లో పెడు తున్నాయి. నిర్ణయాల ప్రక్రియను కేంద్రీకృతం చేస్తున్నాయి. సైంటి ఫిక్ ఏజెన్సీల స్వయంప్రతిపత్తిని నీరుగారుస్తున్నాయి. ఇవన్నీ చివరకు, ప్రభుత్వ నిధులతో సాగే పరిశోధన–అభివృద్ధి సంస్థల నుంచి నైపుణ్యం, ప్రతిభా సామర్థ్యాలు మృగ్యమయ్యేందుకు దారి తీయవచ్చు. ఇస్రో సైంటిస్టుల లేఖ అటువంటి సంస్థలకు ఒక మేల్కొలుపు.
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత



