జర్మనీలో ఏఎఫ్‌డీ పార్టీ నేతల విజయోత్సాహం
విశ్లేషణ
ఈ నెల సెప్టెంబర్‌లో జర్మనీ, స్వీడన్‌లలో జరిగిన ఎన్నికల ఫలితాలు యూరప్‌లో జాతీయవాద రైట్‌వింగ్ పార్టీలు యూరప్ రాజకీయాలను శాసించబోతున్నాయనే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. తూర్పు జర్మనీలోని సాక్సోని– ఆన్‌హాల్త్ రాష్ట్రంలో ‘ఆల్టర్నేటివ్ ఫ్యూఆర్ డోయిచ్‌లాంట్’ (ఏఎఫ్‌డీ) పార్టీ ఘన విజయం పరిశీలకులను దిగ్భ్రమకు గురి చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో మొట్టమొదటి సారి ఒక రాష్ట్రంలో రైట్‌వింగ్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. సెప్టెంబర్ 13న స్వీడన్‌లో జరిగిన జాతీయ పార్లమెంటరీ ఎన్నిక లలో ప్రాథమిక ఫలితాల ప్రకారం రైట్‌వింగ్ కూటమికీ, వామపక్ష సెంట్రిస్ట్ కూటమికీ మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది.
కేపిటలిస్ట్ పంథా వైపు...
ఒకప్పుడు రైట్‌వింగ్ పక్షాలను దూరంగా ఉంచిన సెంట్రిస్ట్, వామపక్ష పాలక వర్గాలు వాటితో చేతులు కలిపి ఎన్నికలలో పాల్గొ నటానికి, ప్రభుత్వాలను ఏర్పాటు చేయటానికి సిద్ధమవుతున్నాయి. కొన్ని దేశాలలో రైట్‌వింగ్ పొలిటికల్ పార్టీలు ఇప్పటికే అధికారంలోనికి వచ్చాయి. ఇటలీలో మెలోని నాయకత్వంలో రైట్‌వింగ్ ‘బ్రదర్స్ ఆఫ్ ఇటలీ’ పార్టీ ఇప్పటికే అధికారంలోకి వచ్చింది. ఫిన్లాండ్, క్రొయేషియా, స్లొవేకియా, చెక్ రిపబ్లిక్‌లలో ప్రభుత్వాలు రైట్‌వింగ్ పార్టీల మద్దతుపై ఆధారపడుతున్నాయి. యూరోపియన్ పార్లమెంటులో రైట్‌వింగ్ పార్టీల కూటమి రెండవ అతిపెద్ద కూట మిగా ఏర్పడింది. ఫ్రాన్స్‌లో రీఅసెంబెల్‌మెంట్ నేషనల్ పార్టీ, నెదర్లాండ్స్‌లో పార్టీ ఫర్ ఫ్రీడమ్, యూకేలో రీఫార్మ్ యూకే పార్టీ, ఆస్ట్రియాలో ఫ్రీడమ్ పార్టీ, అర్జెంటీనాలో లాలిర్టడ్ అవంజా వంటివి ఐరోపా, లాటిన్ అమెరికాలలో రైట్‌వింగ్ భావజాలానికి ప్రతీకలు. 1990వ దశకపు గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఐరోపా, లాటిన్ అమెరికాలలోని వామపక్ష పార్టీలు కూడా క్రమంగా పెట్టుబడిదారీ (కేపిటలిస్ట్) పంథా వైపు మరలాయి. 2010 సంవత్సరంకల్లా లాటిన్ అమెరికాలో తీవ్ర ద్రవ్యోల్బణం ఏర్పడి ఆహారం వంటి కనీస వస్తు వులకు కొరత ఏర్పడి ఉచిత సంక్షేమ పథకాల ప్రాతిపదికన ఏర్పడిన ప్రభుత్వాలు సంక్షోభంలోనికి నెట్టబడ్డాయి.
రైట్‌వింగ్ ఎదుగుతున్న తీరు
అగ్నికి ఆజ్యం తోడయినట్లు ఐరోపాలో ఆర్థిక సమస్యలకు వలసలు, వలసదారుల ప్రేరేపిత ఉగ్రవాద చర్యలు, ఉనికి (ఐడెంటిటీ) భయాలు రైట్‌వింగ్ పార్టీలు, జాతీయ భావజాలానికి దోహద పడ్డాయి. మితవాద, వామపక్ష ప్రభుత్వాలు ఐరోపాలోకి విచక్షణా రహితంగా ఆసియా–ఆఫ్రికాల నుండి వలసలను అనుమతించాయి. రాడికల్ ఇస్లామిక్ భావజాలం వేళ్లూనుకున్న సిరియా, జోర్డాన్, లెబనాన్, పాలస్తీనా, అఫ్గానిస్తాన్, అల్జీరియా, మొరాకో, నైజీరియా వంటి దేశాల నుండి వచ్చిన వలసదారుల పాత్రలో గ్యాంగ్ వార్‌లు, మెట్రోస్టేషన్‌లో పబ్లిక్ ప్రదేశాలలో బాంబు బ్లాస్టులు భద్రతా భయా లను లేవనెత్తాయి. వలస ప్రజలు యూరప్ నగరాలలో కొన్ని ప్రాంతాలలో కేంద్రీకృతమై సమాంతర సంస్కృతులను, సమాజా లను ఏర్పరచుకోవటం; కొన్ని సందర్భాలలో షరియాను పాటించటం, ప్రభుత్వాలకు సవాలుగా తయారయ్యాయి. వలస వచ్చిన వారు ఐరోపా సంస్కృతిలో సమ్మిళితమవకుండా తమ సంస్కృతి చిహ్నాలను బాహాటంగా ప్రదర్శించటం స్థానికులలో తమ సంస్కృతి ఉనికిపై సందేహాలు, అనుమానాలను లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, స్థానిక సంస్కృతుల పరిరక్షణ, జాతీయ ప్రయోజనాలు ప్రథమ కర్తవ్యమనే అజెండాతో వచ్చిన రైట్ వింగ్ రాజకీయ పక్షాలు ప్రజలను ఆకర్షించాయి. మితవాద, లిబ రల్, వామపక్ష పార్టీలలో వలస సంతతి పౌరులు కీలక స్థానాలను ఆక్రమించారు. స్థానిక సంస్కృతి అంతరించి పోతుందనే రైట్‌వింగ్ నినాదం స్థానిక సంతతి ప్రజలను చైతన్యపరిచింది. ఐరోపాలోని అనేక దేశాల వామపక్ష, లిబరల్ ప్రభుత్వాలు ఈ ప్రమాద ఘంటిక లను పసిగట్టి కొంత వరకు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాయి.
2021లో సామ్సల్ పాటీ అనే ఉపాధ్యాయుడి తలను ఇస్లామిక్ ఉగ్రవాది నరికి వేసిన సంఘటన తరువాత ఫ్రాన్స్ వేర్పాటువాద వ్యతిరేక చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ద్వారా ప్రార్థనా స్థలాలు, మత సంబంధిత పాఠశాలలు, మతప్రవచనాలు, మత సంస్థలకు విదేశీ నిధులపై నియంత్రణ, ఆంక్షలను విధించింది. బహిరంగ ప్రదేశా లలో ముఖాలపై ముసుగును నిషేధించింది. 2018లో డెన్మార్క్‌లో కూడా ముఖాలపై బహిరంగ ప్రదేశాలలో ముసుగును నిషేధించారు. జర్మనీ, ఆస్ట్రియా, స్వీడన్, నెదర్లాండ్స్, బెల్జియం వంటి దేశా లలో కూడా మత సంస్థలు, మత ప్రవచనాలు, మత సంప్రదాయా లను నియంత్రిస్తూ అనేక చర్యలను తీసుకున్నాయి. రైట్‌వింగ్ జాతీయవాద భావజాల వృద్ధి ఐరోపా విధానాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. వలస, ఆర్థిక, విదేశాంగ, పర్యావ రణ, సాంస్కృతిక విధానాలలో పెను మార్పులు చోటు చేసుకుంటు న్నాయి. ఇటలీ వలస శరణార్థులను ఆల్బేనియాకు పంపించే ప్రయ త్నాలు చేస్తున్నది. టిడో ఒప్పందం కింద స్వీడన్, పౌరసత్వం, డీపోర్టేషన్ నిబంధనలను కఠినతరం చేసింది. అర్జెంటీనాలో మీలి ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించి పలు ఆర్థిక మదుపు చర్యలను చేపట్టింది. ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, జర్మనీలు యూరోపియన్ యూనియన్‌ను సంస్కరించాలని పట్టుబడుతున్నాయి. రష్యాపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలను ఆస్ట్రియా వ్యతిరేకిస్తున్నది. రైట్‌వింగ్ పార్టీలు ‘గ్రీన్ ఎనర్జీ’ సిద్ధాంతాన్ని ఆమో దించటం లేదు. కర్బన ఉద్గారాలను నియంత్రించే చర్యలను సమ ర్థించటం లేదు. జర్మనీ, నెదర్లాండ్స్, ఇటలీ, పోలండ్‌లు ఇప్పటికే రెన్యువబుల్ ఎనర్జీ లక్ష్యాల నుండి పక్కకు వచ్చి బొగ్గు, సహజ వాయువు, చమురు వంటి శిలాజ ఇంధనాలు, అణు ఇంధ నాలవైపు మొగ్గు చూపుతున్నాయి. ఎల్‌జీబీటీ, సరోగసీ, అబార్షన్ వంటి సున్నిత సామాజిక అంశాలలో రైట్‌వింగ్ భావజాల ఒత్తిడితో హంగరీ, ఇటలీ, పోలండ్ వంటి దేశాలు కఠిన చట్టాలు, నిబంధన లను తీసుకుని వచ్చాయి.
భారత్‌పై ప్రభావం ఏమిటి?
ఐరోపాలో రైట్‌వింగ్ భావజాలం వల్ల భారతదేశంపై పడే ప్రభావాన్ని నిశితంగా పరిశీలించాలి. దౌత్యపరంగా ఇది భారత్‌కు ఒక రకంగా స్వాగతించదగిన అంశం. దశాబ్దాలుగా ఐరోపా దేశాలు, యూఎస్‌ఏ... భారత్ అంతర్గత విషయాలైన మైనారిటీ హక్కులు, మత అంశాలు, మానవ హక్కులపై మనకు ఉపన్యా సాలు, ప్రవచనాలు వినిపించేవారు. తమదాకా వచ్చేదాకా తెలియ దన్నట్లు ఐరోపాకు ఇప్పుడు తత్వం బోధపడుతున్నది. ఈ అంశా లలో భారత్‌పై ప్రపంచ స్థాయిలో ఒత్తిడి తగ్గే అవకాశం ఉన్నది. రైట్‌వింగ్ పార్టీలు ఐరోపా పర్యావరణ సుంకాలను వ్యతిరేకించటం కూడా మనకు కలిసివచ్చే అంశం. ఉదాహరణకు ఐరోపా అవలంబిస్తున్న ‘కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (సీబీఏఎమ్) తొలగిస్తే ఉక్కు, అల్యూమినియం వంటి భారత ఎగుమతులకు మరింత ప్రోత్సాహం లభించే అవకాశం ఉన్నది. అయితే ఐరోపా– భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవచ్చు. కఠిన వలస విధానం వల్ల భారత విద్యార్థులు, ఐటీ నిపుణులు ఐరోపాలోకి ప్రవేశించటం కష్టమయ్యే అవకాశం ఉన్నది.
గురజాల శ్రీనివాసరావు
వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);
సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు


