విశ్వగురు
అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో 2026 బ్యాచ్ పట్టభద్రులను ఉద్దేశించి కామెడీ లెజెండ్ కోనన్ ఓబ్రెయిన్ చేసిన స్నాతకోత్సవ ప్రసంగ సంక్షిప్త పాఠం:
అందరికీ స్వాగతం. రేపటి గొప్ప మేధావులైన మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. హార్వర్డ్ అమెరికాలో అత్యంత పురాతనమైన, ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యానిలయం. నేను 40 సంవత్సరాల క్రితం ఇక్కడే డిగ్రీ పూర్తి చేశాను. ఈ రోజు మీరు 375వ గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్. 1642లో మొదటి గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌లో విద్యార్థుల సంఖ్య కేవలం తొమ్మిది మంది. అమెరికాలోని ఏ యూనివర్సిటీ కూడా హార్వర్డ్ కంటే ఎక్కువ మంది నోబెల్ విజేతలను గానీ, లేదా వైట్–కాలర్ నేరస్థులను గానీ తయారు చేయలేదు. కాబట్టి మీరు మంచి మార్గాన్ని ఎంచుకున్నా లేదా చెడు మార్గాన్ని అనుసరించినా... మీరు అత్యుత్తమ వ్యక్తుల మధ్య ఉన్నారని గుర్తుంచుకోండి.
అనేకమంది కలిస్తేనే పని
నేను ఈ హార్వర్డ్ యూనివర్సిటీని ఎందుకు ప్రేమిస్తున్నాను? నిజంగా నాకు ఈ కాలేజీ అంటే చాలా ఇష్టం. ఇది నా జీవితాన్ని మార్చేసింది. నాకు హార్వర్డ్‌లో సీటు వచ్చిందని మంచానికే పరిమితమైన నా నానమ్మకు చెప్పిన రోజు... అసలు కాలేజీ ముఖమే చూడని ఆమె కళ్ల వెంబడి నీళ్లు తిరిగాయి. నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజుల్లో అదొకటి. 1985లో నా గ్రాడ్యుయేషన్ రోజున ఇక్కడ కూర్చున్నప్పుడు నేను కూడా ఎంతో సంతోషపడ్డాను. మీరందరూ ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో నేను నిజంగా అర్థం చేసుకోగలను. నేను లేట్ నైట్ టాక్ షో హోస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించి నప్పుడు ఇంటర్నెట్ లేదు. మీడియాకు కోనన్ ఓబ్రెయిన్ గురించి తెలిసిన ఏకైక విషయం అతడు హార్వర్డ్‌లో చదువుకున్నాడని మాత్రమే. ఒకవేళ నేను ఒక తత్వవేత్తనో లేదా భౌతిక శాస్త్రవేత్తనో అయి ఉంటే హార్వర్డ్ నాకు బాగా ఉపయోగపడేదేమో. కానీ ఒక కమెడియన్‌కి అది మరణశాసనం లాంటిది. ఇన్ని సంవత్సరాల తర్వాత, నా పేరు వినగానే ప్రజలకు గుర్తుకొచ్చే మొదటి విషయం హార్వర్డ్ ఎంతమాత్రం కాదు. నేను పదివేల గంటల కంటెంట్ తయారు చేశాను. అందులో ఏ ఒక్కదానికీ హార్వర్డ్ చదువుతో సంబంధం లేదు.
కానీ ఏ ఒక్క పనినీ నేను ఒంటరిగా పూర్తి చేయలేదని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. ప్రముఖ అమెరికన్ కవి, రచయిత, జర్నలిస్టు వాల్ట్ విట్‌మాన్ ‘నాలో అనేకమంది ఉన్నారు’ అని రాశారు. అలాగే నేనూ ఏది సాధించినా, నా వెనుక ఉన్న అనంతమైన వ్యక్తుల సహాయంతోనే సాధించాను. ఈ రోజు మీ ముందు ప్రసంగించడానికి నా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరినీ(బతికున్నవారైనా, చనిపోయినవారైనా) నేను ఆహ్వానించగలిగితే... హార్వర్డ్ మొత్తం, అలాగే నా స్నేహి తులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, రచయితలు, నిర్మాతలు, నన్ను ద్వేషించేవారు, అభిమానులు, అనుకోకుండా కలిసిన వేలాది మందితో కిక్కిరిసిపోతుంది. నా విజయాలు కేవలం నావి మాత్రమే కావని గుర్తించడం వల్ల, నా జీవితంలో అవసరమైన సమతుల్యత వచ్చింది.
మార్గాన్ని మార్చుకున్నాను!
నన్ను పదే పదే కాపాడిన మరొక విషయం... మార్గాన్ని మార్చుకోవడం. నా కెరీర్‌లో నేను ఎన్నోసార్లు నా దారిని మార్చు కోవాల్సి వచ్చింది. దానివల్ల నా మార్గం ఒక వంకర టింకర గీతలా మారిపోయింది. ప్రాణంగా భావించిన ఉద్యోగాన్ని కోల్పోయాను. ఆ తర్వాత కొన్నేళ్లకు నా కెరీర్‌ను అంకితం చేసిన లేట్ నైట్ టెలివిజన్ ఫార్మాట్ కనుమరుగవ్వడం చూశాను. దాంతో ఒక తెలివైన స్నేహితుడి సలహాతో ఒక పాడ్‌కాస్ట్ ప్రారంభించాను. మొదట్లో నాకా ప్రాజెక్ట్ అంటే నచ్చేది కాదు. కానీ జనం నా లేట్ నైట్ షో కంటే ఎక్కువగా ప్రేమించేలా నేను దాన్ని సృష్టించగలిగాను. నేను ఈ విధంగా అనేకసార్లు దారి మార్చుకున్నాను. ఇప్పుడు నాకు ఆ మార్పులంటే చాలా ఇష్టం. నా సంభాషణల్లో, మలుపు అనే పదాన్ని అవసరానికి మించి వాడుతుంటాను. ఎందుకంటే జీవితంలో అనేక మలుపులు ఉంటాయి.
నా జీవితంలో అదృష్టం గొప్ప పాత్రను నేను ఎల్లప్పుడూ గుర్తిస్తాను. ఒకరి విజయంలో అదృష్టం పాత్రను చూడకపోవడం అజ్ఞానమే అవుతుంది. చాలామంది తమకు దక్కిన అదృష్టాన్ని తమ సొంత తెలివితేటలుగా పొరబడతారు. ఆ మానవ సహజమైన ఆలోచనను నిరోధించడం వల్లే నేను స్థిరంగా ఉండగలిగాను. సమాజం, సహజత్వం, వినయం, పని పట్ల నిజమైన అంకితభావం... అర్థవంతమైన గొప్ప జీవితాన్ని నిర్మించుకోవడానికి నాకు సహాయపడ్డాయని నమ్ముతున్నా. ఇక్కడ నా ఉద్దేశం విజయాలను వదులుకోవాలని కాదు, వాటిని ఒంటబట్టించుకోకపోవడమే మంచిది. మీరు మీ విజయాలను తేలికగా తీసుకున్నప్పుడు... దయ, సృజనాత్మకత, ధైర్యం, హాస్యం, మానవత్వం వంటి ఇతర గుణాలు బయటకు రావడానికి అవకాశం ఏర్పడుతుంది.
ప్రయాణాల ద్వారా నేర్చుకున్న పాఠాలు
బహుశా నేను జీవితంలో నేర్చుకున్న అతిపెద్ద పాఠాలు నా ట్రావెల్ షోల ద్వారానే అయ్యుండవచ్చు. క్యూబా, ఘనా, కొరియా, అర్మేనియా, ఐరోపాలో సగం భాగాలు, అర్జెంటీనా, థాయిలాండ్, మెక్సికో, గ్రీన్ ల్యాండ్‌లలో నన్ను నేను తగ్గించుకున్నాను. నన్ను నేను తగ్గించుకోవడం వల్ల హెచ్చింపబడ్డాను. నేను వేరే దేశానికి వెళ్లినప్పుడు, నేను మాట్లాడిన ప్రతి మాట... అక్కడి సమాజం, పరిస్థితులకు అనుగుణంగా మారడం... ఇవన్నీ చాలా అవసరం. మీకు అక్కడి భాష రానప్పుడు, మీరు ఏ కాలేజీలో చదివారనేది అనవసరం. అప్పుడు స్నేహం చేయడం తప్ప మీకు వేరే మార్గం లేదు. ఆ ప్రయాణాల్లోనే నేను ఒక గొప్ప పాఠం నేర్చు కున్నాను. కొన్ని విషయాల్లో తగ్గి ఉండటమే మంచిది.
మా తాతయ్య పేరు ‘హుఫర్’. ఆయన తన తల్లిదండ్రులను పోషించడానికి ఏడో తరగతిలోనే చదువు ఆపేసి... వర్సెస్టర్, మాసాచుసెట్స్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేశారు. ఆయనో మాట చెప్పేవారు: ‘ఏది దొరికితే అది తీసుకో.. ఆపై ఇంకా కావా లని అడుగు’. చాలా తెలివైన వ్యక్తి! నా జీవితంలో హుఫర్ చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయన గౌరవార్థం, నేను ఈ యూనివర్సిటీ ఇవ్వజూపిన డాక్టరేట్‌ను తీసుకుంటాను, ఆ తర్వాత నగదు బహు మతి ఏమైనా ఇస్తారా అని కూడా అడుగుతా! నా కోరిక ఏమిటంటే... హార్వర్డ్ అనేది మీ గురించి ప్రజలకు తెలిసే విషయాల్లో అత్యంత తక్కువ ప్రాధాన్యత ఉన్నదిగా మారాలి. ఎందుకంటే, మీ అసలైన చదువు ఇప్పటి నుంచే మొదలవుతుంది. మీ కష్టం, పట్టుదల, మానవత్వం, మీరు నిర్మించబోయే సరిహద్దులు లేని సమాజం కోసం... నా హృదయపూర్వక అభినందనలు!


