నీరు, గాలి, వాతావరణ నాణ్యత క్షీణించడానికి నిస్సారమైన మట్టి దారితీస్తుంది. నేల ఆరోగ్యం క్షీణించడం వల్ల మొక్కలు, జంతు వులు, మానవుల ఆరోగ్యం దెబ్బతింటుంది. నేల స్వయంగా ఒక జీవ వ్యవస్థ. అలాగే ఇతర జీవరాశులకు ఆధారభూతమైనది కూడా. నేల, మొక్కలు, జంతువులు, మానవులు, పర్యావరణ వ్యవస్థ, భూగ్రహం ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడివడి విడదీయలేని ‘ఏకైక ఆరోగ్యం’ (వన్ హెల్త్)గా ఉంటాయి.
‘ఆరోగ్యమైన నేల– ఆరోగ్యమైన మొక్క– ఆరోగ్యమైనజంతువు– ఆరోగ్యమైన మనిషి’ అనే భావనే వన్ హెల్త్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనుషులు, జంతువులు, మొక్కలు, పర్యా వరణం పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ఈ నాలుగు ఆరో గ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ‘ఏకైక ఆరోగ్యం’ భావనను, భారతదేశంలో జరిగిన జీ–20 సమావేశాలలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఒక టీ స్పూన్ ఆరోగ్యకరమైన నేలలో కోట్ల నుండి వందల కోట్ల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి. వీటిలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు (ఫంగి), యాక్టినోమైసెట్స్, ప్రోటో జోవా, నులిపురుగులు (నీమటోడ్లు), వానపాములు వంటి జీవులు ప్రధానమైనవి. ఈ సూక్ష్మజీవులు, నేల జీవులు కలిసి సేంద్రియ పదార్థాలను కుళ్లించి మొక్కలకు అవసరమైన పోషకాలను అందుబాటులోకి తెస్తాయి. నేలలో ఉండే ఖనిజాలు (జింక్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్ వంటివి) మొక్కల వేర్ల ద్వారా గ్రహించబడి ధాన్యాలు, కూర గాయలు, పండ్లు ఇతర ఆహార పంటలలో నిల్వ అవుతాయి. ఈ పంటలను మనం ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆ ఖనిజాలు, పోషకాలు మన శరీరానికి అందుతాయి. ‘నేలలో పోష కాలు సమృద్ధిగా ఉంటేనే ఆహారం పోషకవంతంగా ఉంటుంది; ఆహారం పోషకవంతంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.’
నేల ఆరోగ్యాన్ని కాపాడే పద్ధతులు
సేంద్రియ పదార్థాల వినియోగం నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పశువుల ఎరువు, కంపోస్ట్, వర్మీకంపోస్ట్, గ్రీన్ మెన్యూర్, బయోచార్ వంటి సేంద్రియ పదార్థాలు నేలలో సేంద్రియ కార్బన్‌ను పెంచి, నేల సారాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవుల వృద్ధిని ప్రోత్సహించి, మొక్కలకు అవసరమైన పోషకాలను క్రమంగా అందుబాటులోకి తీసుకు వస్తాయి. పంటల మార్పిడి మరో పద్ధతి. ఒకే భూమిలో ఒకేపంటను వరుసగా సాగు చేయకుండా, వివిధ రకాల పంటలను క్రమపద్ధతిలో సాగు చేయాలి.
పప్పు ధాన్యాలైన శనగ, పెసర, మినుము, కంది, అలసంద వంటివాటి వేర్లపై ఉండే రైజోబియం అనే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని గ్రహించి, మొక్కలు ఉపయోగించుకునే రూపంలో నేలలో స్థిరీకరిస్తాయి.మరీ ముఖ్యంగా పంట అవశే షాలను కాల్చకూడదు. కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ కార్బన్, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పోష కాలు నష్టపోతాయి. పంట అవశేషాలను మల్చింగ్ చేయడం ద్వారా నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి, కలుపు మొక్కల పెరుగు దల తగ్గుతుంది. అవసరానికి మించి తరచుగా దుక్కి దున్నడం వల్ల నేల సహజ నిర్మాణం దెబ్బతింటుంది. నేలలో నిల్వ ఉన్న సేంద్రియ కార్బన్ వేగంగా విచ్ఛిన్నమైపోతుంది. అతి దుక్కిని నివారించాలి.
‘ఏకైక ఆరోగ్యం’ భావన విజయవంతం కావడంలో రైతు పాత్ర కీలకం. రైతు అనుసరించే వ్యవసాయ పద్ధతులే నేల, మొక్కలు, పశువులు, పర్యావరణం, చివరకు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. నేల ఆరోగ్యాన్ని కాపాడటం అనేది రైతు పొలం దిగుబడికే కాదు, సమాజ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు భవిష్యత్ తరాలకు చేసే గొప్ప పెట్టుబడి.
– డా‘‘ కె. తేజస్వరరావు, డా‘‘ ఎం.ఎం.వి. శ్రీనివాసరావు, డా‘‘ బి. సహదేవ రెడ్డి ‘ సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు


