విశ్లేషణ
ఇటీవలి ఈక్విరస్ ‘వృద్ధి విధాన నివేదిక’ 2036 నాటికి 20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందాలంటే నామినల్ రూపాయి వృద్ధి 14.2 శాతంగానూ, సాంవత్సరిక రూపాయి అప్రిషియేషన్ 3–3.6 శాతం అవసరమనీ పేర్కొనడం చర్చనీయాంశంగా నిలిచింది. రాబోవు పదేళ్ల కాలంలో జీడీపీలో 5 రెట్లు పెరుగు దల ఉండాలంటే, దానికి అవసరమైన సగటు వార్షిక డాలర్ – ఆధారిత నామినల్ జీడీపీ వృద్ధిని 15.9 శాతంగా నివేదిక అంచనా వేసింది. వివిధ రంగాలలో ఉత్పాదకత వృద్ధి తక్కువగా ఉండటం, స్థూల స్థిర మూలధన కల్పన జీడీపీలో 30 శాతానికి పరిమితం కావడం, సంఘటిత రంగంలో ఉపాధి తక్కువగా ఉండటం, ఇంధన ధరలలో పెరుగుదల కారణంగా అధిక ద్రవ్యోల్బణం, మానవాభివృద్ధిపై పెట్టుబడులు తక్కువగా ఉండటం, ద్రవ్యలోటు పెరుగుదల, సామర్థ్యానికి తగినట్లు ఎగుమతు లలో వృద్ధి లేకపోవడం లాంటి అంశాలు నామినల్ జీడీపీ వృద్ధిలో అనూహ్య పెరుగుదలకు అవరోధాలుగా నిలిచే అవకాశం ఉంది. భారత్ వాస్తవిక జీడీపీ వృద్ధిని 2026–27లో 6.3 శాతంగా, 2027–28లో 6.4 శాతంగా ఓఈసీడీ అంచనా వేస్తుండగా, ప్రపంచ బ్యాంకు 6.6 శాతంగా అంచనా వేసింది. నామినల్ వార్షిక జీడీపీ వృద్ధిని 15.9 శాతంగా రాబోవు పది సంవత్సరాల కాలంలో నిర్వ హించాలంటే సాంప్రదాయ కోశ విధానం, విత్త మద్దతుతో పాటు భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పు అవసరం.
అభివృద్ధి దేశాల వృద్ధి నమూనా
ప్రస్తుతం భారత్ జీడీపీ 3.96 ట్రిలియన్ డాలర్లు కాగా 2036 నాటికి 20 ట్రిలియన్ డాలర్లకు చేరుకొనే క్రమంలో ప్రపంచంలో అధిక ఆదాయ దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా రూపొంద డానికి ఎంత సమయం తీసుకున్నాయి, ఏ అభివృద్ధి వ్యూహాలను అవలంభించాయో పరిశీలించాలి. అధిక ఆదాయ దేశాలుగా రూపొందడానికి అమెరికాకు (వందకు మించిన సంవత్సరాలు), యూకే (100 సం‘‘లు), జర్మనీ (50–100 సం‘‘లు), జపాన్ (50–100 సం‘‘లు), కెనడా (75–100 సం‘‘లు), దక్షిణ కొరియా (30–40 సం‘‘లు) సమయం తీసుకోగా, ప్రపంచ బ్యాంకు నిర్వచనం ప్రకారం ఎగువ మధ్య ఆదాయ దేశమైన చైనాలో 1978 తర్వాతి కాలంలో వృద్ధి వేగవంతమై 2026 నాటికి ఐఎంఎఫ్ అంచనా ప్రకారం 20.85 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందింది. చైనా, దక్షిణ కొరియాతో పోల్చినప్పుడు అధిక ఆదాయ దేశంగా రూపొందడానికి అమెరికా అధిక సమయం తీసుకొంది. అతిపెద్ద ఏకీకృత స్వదేశీ మార్కెట్, ప్రైవేటును ప్రోత్సహించడం, మౌలిక సౌకర్యాలపై అధిక పెట్టుబడులు, పటిష్టమైన మూలధన మార్కెట్, ప్రఖ్యాత విద్య, పరిశోధనా సంస్థలు, సాంకేతిక నవకల్ప నలు అమెరికాకు సానుకూలంగా పనిచేశాయి. మొదటి పారిశ్రామిక విప్లవం వలన బ్రిటన్; భారీ పరిశ్రమలు, రసాయనాలు, మెషినరీ, తయారీ రంగం అభివృద్ధి కారణంగా జర్మనీ; పారిశ్రామికీకరణ, ఎగుమతులు, సాంకేతికత కారణంగా జపాన్; ఎగుమతులపై దృష్టి కేంద్రీకరించి తయారీ రంగ అభివృద్ధి, విద్య, పారిశ్రామిక విధానం ద్వారా దక్షిణ కొరియా అధిక ఆదాయ దేశాలుగా రూపొందాయి.
వివిధ రంగాలలో ఏం మారాలి?
20 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపొందాలంటే వ్యవసాయం, తయారీ, సేవలు, శక్తి, మానవ మూలధనం, సాంకే తిక రంగాలలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి చర్యలు అవ సరం. ఐఎంఎఫ్ అభిప్రాయంలో భారత్ ఉత్పాదకత పెంపు, నైపు ణ్యత, శ్రామిక మార్కెట్ సరళత, నియంత్రణల సడలింపు, వాణిజ్యం అనుసంధానంపై దృష్టి సారించాలి. పట్టణీకరణ వేగవంతమవుతున్న కారణంగా ప్రస్తుతం జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 17 శాతం నుండి రాబోవు కాలంలో తగ్గే సూచనలున్నాయి. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంపు, సప్లయ్ చెయిన్‌ను మెరుగుపరచడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని విస్తరణ, నిల్వ సౌకర్యం, లాజిస్టిక్స్ అభివృద్ధికి చర్యలు అవసరం. నశ్వర ఉత్పత్తులైన పండ్లు, కూరగాయల మొత్తం ఉత్పత్తిలో 4 శాతంకు మాత్రమే రిఫ్రిజిరేటెడ్ రవాణా సౌకర్యం ఉంది. కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు సంబంధించి పది సంవత్సరాల పన్ను విరామాన్ని ప్రకటించాలి. తయారీ రంగంలో అతిపెద్ద నిర్మాణాత్మక మార్పులు అవసరం. జీడీపీలో తయారీ రంగం వాటా ప్రస్తుతం 12.9 శాతం కాగా 2035 నాటికి 25 శాతానికి పెంచాలని జాతీయ తయారీ విధానం లక్ష్యంగా తీసుకుంది.
తయారీ రంగంలో చిన్న సంస్థలు, పెద్ద సంస్థ లుగా మారే క్రమంలో చెప్పుకోదగిన ప్రగతి లేదు. ఆగస్ట్ 2026 నాటికి భారత ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ ఉద్యమ్ పోర్టల్‌లో సూక్ష్మ సంస్థలు (9.24 కోట్లు), చిన్న సంస్థలు (5.42 లక్షలు), మధ్య తరహా సంస్థలు (41,775) నమోదయ్యాయి. సంస్థలు చిన్న స్థాయిలో ఉంటే నైపుణ్యత కల్గిన శ్రామికుల లభ్యత, సంస్థాపరమైన పరపతి, సప్లయ్ చెయిన్‌కు అనుసంధానపరచడం, సాంకేతికత లభ్యత క్లిష్టతరమవుతుంది. సక్రమంగా నడుస్తున్న చిన్న సంస్థలకు ఈక్విటీ మార్కెట్‌లో ప్రవేశం కల్పించి పెద్ద మొత్తంలో నిధులు సేకరించుకొనే అవకాశం కల్పించాలి. కార్పొరేట్ బాండ్లను జారీ చేసే స్వేచ్ఛను కంపెనీలకు ఇవ్వాలి. జీడీపీలో కార్పొరేట్ బాండ్ మార్కెట్ విలువ భారత్‌లో 15–16 శాతం కాగా, చైనాలో 38 శాతం, మలేషి యాలో 54 శాతం, దక్షిణ కొరియాలో 79 శాతం. అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సహించాలి. జీసీసీలు అధిక విలువ కల్గిన కార్య కలాపాలను నిర్వహిస్తున్నందువలన, ఈ రంగాన్ని విస్తరిస్తే భారత్ జీడీపీలో పెరుగుదల ఏర్పడుతుంది.
ఉత్పాదక శ్రామికులుగా మార్చాలి!
భారత్‌లో తాత్కాలిక కార్మికులు 2029–30 నాటికి 2.35 కోట్లుగా ఉండగలరని అంచనా. ప్రత్యేకమైన శ్రామిక ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడం ద్వారా శ్రామిక వివాదాలను పరిష్కరించాలి. 2036 నాటికి శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 70 శాతం, మొత్తం శ్రామిక శక్తిలో మహిళల వాటా 50 శాతం, సంఘటిత రంగంలో ఉపాధి విస్తరణ, అప్రెంటిషిప్స్ ఏడాదికి కోటికి పైగా ఉండేలా తగిన విధానాలను రూపొందించుకోవాలి. పనిచేసే వయో వర్గ జనాభాను అధిక వేతనంతో కూడిన ఉత్పాదక శ్రామికులుగా మార్చడం శ్రామిక మార్కెట్ సంస్కరణలలో కేంద్ర బిందువుగా ఉండాలి. దేశంలో 37 కోట్లకు పైగా ఉన్న యువతకు వ్యవసాయేతర రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశోధన, అభివృద్ధి వ్యయం జీడీపీలో 0.6–0.7 శాతంగా ఉండటం వలన ఉత్పాదకత పెంపు, సాంకేతిక ఆధారిత అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నందువలన ఈ వ్యయాన్ని పెంచాలి. భారత్ అంతర్జాతీయ కంపెనీలకు తక్కువ వ్యయంతో సేవలను అందించేకన్నా ‘ప్రపంచ నవకల్పన, అధిక విలువతో కూడిన సేవల హబ్’గా రూపొందాలి.
డా‘‘ తమ్మా కోటిరెడ్డి
వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు


