యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు! | UK Flight Chaos: Air Traffic System Failure Disrupts 1000 Plus Flights | Sakshi
Sakshi News home page

యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు!

Sep 9 2026 8:06 AM | Updated on Sep 9 2026 8:12 AM

UK Flight Chaos: Air Traffic System Failure Disrupts 1000 Plus Flights

బ్రిటన్‌ గగనతలంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం దేశవ్యాప్తంగా విమాన రాకపోకలను తీవ్రంగా దెబ్బతీసింది. వెయ్యికి పైగా విమానాలు రద్దు కాగా.. మరెన్నో విమానాలు గంటల తరబడి ఆలస్యమయ్యాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు విమానాల్లోనే, విమానాశ్రయాల టెర్మినల్స్‌లోనూ గంటలపాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. 

విమానాలను రద్దు చేయడం, దారి మళ్లించడం, షెడ్యూళ్లు మార్చడంతో బ్రిటన్‌ మాత్రమే కాకుండా యూరప్‌లోని పలు ప్రాంతాల్లోనూ విమాన సేవలు అస్తవ్యస్తమయ్యాయి. బ్రిటన్‌ గగనతల నియంత్రణ సేవలను నిర్వహించే నేషనల్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ సర్వీసెస్‌ (NATS)కు చెందిన ఫ్లైట్‌ డేటా ప్రాసెసింగ్‌ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడమే ఈ సంక్షోభానికి కారణం. లండన్‌లోని హీత్రూ, గాట్‌విక్‌, స్టాన్‌స్టెడ్‌, సిటీ విమానాశ్రయాలతోపాటు మాంచెస్టర్‌, బర్మింగ్‌హామ్‌, ఎడిన్‌బర్గ్‌ తదితర ప్రధాన ఎయిర్‌పోర్టులపై దీని ప్రభావం పడింది. ఒక దశలో విమానాలను ఇతర యూరప్‌ విమానాశ్రయాలకు మళ్లించాల్సి వచ్చింది. విమానాలు, సిబ్బంది తమ నిర్ణీత ప్రాంతాల్లో లేకపోవడంతో.. సాంకేతిక సమస్య పరిష్కారమైన తర్వాత కూడా దాని ప్రభావం వెంటనే తొలగిపోలేదు.

గంటల తరబడి నిరీక్షణ..
సాంకేతిక లోపం కారణంగా ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. రన్‌వేలపై విమానాల్లోనే గంటల తరబడి కూర్చోవాల్సి రావడంతో పలువురు తీవ్ర అసహనానికి గురయ్యారు. కొన్ని విమానాలను చివరకు రద్దు చేయడంతో ప్రయాణికులు టెర్మినల్స్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా భారీ రద్దీ, బ్యాగేజీ సమస్యలు, సమాచార లోపంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ 100కు పైగా విమానాలను రద్దు లేదా దారి మళ్లించగా.. ర్యాన్ఎయిర్‌ 65 వేల మందికి పైగా ప్రయాణికులపై ప్రభావం పడినట్లు వెల్లడించింది. ఈజీజెట్‌ సహా పలు విమానయాన సంస్థల సర్వీసులపైనా అంతరాయం ఏర్పడింది.

సమస్య పరిష్కారం కానీ..
సాయంత్రానికి సాంకేతిక లోపాన్ని పరిష్కరించినట్లు నాట్స్‌ ప్రకటించింది. వ్యవస్థ సాధారణ స్థితికి వస్తోందని, నిలిచిపోయిన విమానాల భారీ బ్యాక్‌లాగ్‌ను క్లియర్‌ చేస్తున్నామని వెల్లడించింది. అయితే అంతరాయం ప్రభావం వెంటనే తొలగిపోలేదు. హీత్రూ విమానాశ్రయంలో ఆ రోజు రాత్రి రాకలను నిలిపివేసి.. కేవలం బయలుదేరే విమానాలను మాత్రమే నడిపారు. 

భారత్‌-యూకే సర్వీసులపైనా ప్రభావం
ఈ సాంకేతిక సమస్యతో భారత్‌ నుంచి యూకేకు, యూకే నుంచి భారత్‌కు నడిచే విమాన సర్వీసులపైనా ప్రభావం పడింది. విమానాలు, సిబ్బంది వేరే ప్రాంతాల్లో చిక్కుకోవడంతో తదుపరి సర్వీసుల షెడ్యూళ్లలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన స్థితిని సంబంధిత ఎయిర్‌లైన్‌తో నిర్ధారించుకోవాలని సూచించారు. 

వరుస వైఫల్యాలతో విమర్శలు
నాట్స్‌లో ఇలాంటి సమస్యలు పునరావృతమవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో ఫ్లైట్‌-ప్లాన్‌ ప్రాసెసింగ్‌లో లోపంతో భారీగా విమానాలు నిలిచిపోయాయి. ఆ ఘటనలో ఎయిర్‌లైన్స్‌కు భారీగా రీఫండ్‌లు, పరిహారం చెల్లించాల్సి వచ్చింది. తాజాగా మరోసారి సాంకేతిక వైఫల్యం తలెత్తడంతో బ్రిటన్‌ విమానయాన మౌలిక వసతుల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి. 

ఇటు బ్రిటన్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ ఘటనపై పూర్తి నివేదిక కోరింది. NATS చీఫ్‌ మార్టిన్‌ రోల్ఫ్‌ మాత్రం అసలు సమస్యకు ఖచ్చితమైన కారణం ఇంకా తమకు తెలియలేదని తెలిపారు.

ఇదీ చదవండి: ముంచేసిన మరో విపత్తు.. జలమయంగా జపాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement