breaking news
Air traffic control system
-
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో గందరగోళం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య తీవ్ర అలజడి రేపింది. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏటీసీ సరిగా పనిచేయకపోవడంతో 800కు పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పటికీ శుక్రవారం ఉదయం 5.45 గంటల నుంచి తీవ్రరూపం దాల్చిందని అధికార వర్గాలు తెలిపాయి. రద్దీ తీవ్రరూపం దాల్చడంతో కనీసం ఏడు విమానాలను సమీపంలోని జైపూర్, లక్నో విమానాశ్రయాలకు దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోర్డింగ్ గేట్ల వద్ద ప్రయాణికుల భారీ క్యూలు కనిపిస్తున్నాయని, టెర్మినళ్ల వద్ద వందలాది మంది ప్రయాణికులు ఎదురు చూపులు చూస్తున్నారని సమాచారం. ఫ్లైట్ షెడ్యూల్ ఆటో ట్రాక్ సిస్టమ్ ద్వారా అందకపోవడంతో ట్రాఫిక్ కంట్రోలర్లు మాన్యువల్‌గా తయారు చేస్తున్నారు. ఇందుకు చాలా సమయం తీసుకుంటోంది. దీంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. నిత్యం 1,500 విమానాలు రాకపో కలు సాగించే ఢిల్లీ ఎయిర్ పోర్టు ఏటీసీలోని ఆటో మేటిక్ మెసేజ్ స్విఛింగ్ సిస్టం(ఏఎంఎస్ఎస్)లో సాఫ్ట్వేర్ సమస్య ఎదురైంది. ట్రాఫిక్ సిస్టమ్‌పై ప్రభావం పడటంతో విమానాల టేకాఫ్, ల్యాండింగ్ షెడ్యూల్‌కు తీవ్ర అవ రోధం ఏర్పడింది. ఇంతటి కీలకమైన ఎయిర్ పోర్టులో తలెత్తిన ఈ సమస్యను కేవలం సాంకేతిక పరమైందిగానే అధికా రులు చెబుతున్నా, ‘జీపీఎస్ స్పూఫింగ్’అని పిలిచే సైబర్ అటాక్ కావచ్చని నిపుణులు అంటున్నారు. సమస్య పరిష్కరించాం: ఏఏఐఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యం కావడానికి కారణమైన ఆటోమేటిక్ మెసేజ్ స్విఛింగ్ సిస్టమ్(ఏఎంఎస్ఎస్)ను ఎట్టకేలకు గాడిన పెట్టినట్లు ఏఏఐ శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో తెలిపింది. ట్రాఫిక్ కార్యకలాపాలు తక్షణమే ఆటంకం లేకుండా కొనసాగేందుకు అవస రమైన సిబ్బందిని కూడా రంగంలోకి దించామంది.ఏమిటీ జీపీఎస్ స్పూఫింగ్..?సాధారణంగా సంక్షోభ ప్రాంతాల్లో జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలకు ఎక్కువగా అవకాశముంటుంది. భారత్–పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలోనూ ఈ రకమైన సైబర్ దాడులు జరుగుతుంటాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా తయారీ పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను అక్కడి మిలటరీ ప్రాంతాలపై దాడుల సమయంలో భారత్ జామ్ చేసింది. ల్యాండవ్వాల్సిన విమానాల పొజిషన్‌పై ఏటీఎస్‌కు తప్పుడు శాటిలైట్ సిగ్నళ్లను పంపించడం ద్వారా వాటిని దారి మళ్లేలా చేయడం, రద్దీ పెంచడం దీని లక్ష్యం. ఢిల్లీ విమానాశ్రయంలో విమానం పొజిషనింగ్ సాధారణ స్థాయి 8 కాగా, గత కొద్ది రోజులుగా 0గా చూపిస్తోంది. ఢిల్లీ పరిధిలో 60 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా ఇలాంటి తప్పుడు సిగ్నళ్లు అందుతున్నట్లు పైలట్లు ఫిర్యాదు చేస్తున్నారు. -
యూకే ఏటీసీలో సమస్య.. 100 విమానాలపై ప్రభావం
లండన్: ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో సమస్య తలెత్తడంతో గురువారం దక్షిణ ఇంగ్లండ్‌లోని పలు విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనీసం 100 విమాన సర్వీసులు, ఆలస్యంగా నడవడం లేదా రద్దవడం సంభవించాయి. దీంతో వేలాదిగా ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. హీత్రూ, గాట్విక్, బర్మింగ్‌హామ్, మాంచెస్టర్, కార్డిఫ్, ఎడిన్‌బరో తదితర విమానాశ్రయాల్లో పలు విమానాలను తాత్కాలికంగా రద్దు చేశారు. సుమారు 20 నిమిషాల తర్వాత సమస్యను పరిష్కరించినప్పటికీ ఆ ప్రభావం సాయంత్రం వరకు కొనసాగింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తాము వెళ్లాల్సిన విమానాలను అధికారులు రద్దు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి దరిద్రంగా మారిందంటూ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు నిర్విరామంగా పనిచేస్తున్నామని నేషనల్ ఎయిర్‌ట్రాఫిక్ సర్వీసెస్(ఎన్ఏటీఎస్) తెలిపింది. -
సాంకేతిక సమస్యతో యూకేలో నిలిచిన విమానాలు
లండన్: సాంకేతిక సమస్య కారణంగా యూకేకు వెళ్లాల్సిన, అక్కడి నుంచి ఇతరదేశాలకు వెళ్లే విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో, వేలాది మంది ప్రయాణికులు ఎక్కడివారక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బ్రిటిష్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థల్లో సమస్య ఇందుకు కారణమని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో భద్రతా నిర్వహణ కోసం ట్రాఫిక్‌పై నియంత్రణలను విధించినట్లు యూకే నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ తెలిపింది. అయితే, సమస్యకు కారణం, ఎప్పటివరకు పరిష్కారమవుతుందనే విషయం సంస్థ తెలపలేదు. సమస్యను సాధ్యమైనంత త్వరంగా పరిష్కరించేందుకు తమ ఇంజనీర్లు కృషి చేస్తున్నారని తెలిపింది. యూకే గగనతలాన్ని మాత్రం మూసివేయలేదని స్పష్టతనిచ్చింది. -
భారీ సాంకేతిక లోపం.. అమెరికా అంతటా నిలిచిపోయిన విమానాలు
న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో విమాన సర్వీసులకు ఆటంకం తలెత్తింది. దీంతో అమెరికా వ్యాప్తంగా దాదాపు 400 విమానాలు నిలిచిపోయాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో సమస్య ఏర్పడటంతో యునైటెడ్ స్టేట్స్ అంతటా విమాన సర్వీసులు నిలిచిపోయినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది. విమానాలు తిరిగే మార్గాల్లో మార్పులు, చేర్పులు, వాతావరణ సమస్యలు, ప్రమాదాల గురించి పైలెట్లు, విమాన సిబ్బందిని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేసేందుకు ఎఫ్ఏఏ ఇచ్చే నోటామ్ (నోటీస్ టు ఎయిర్‌మిషన్)లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఎక్కడి విమానాలు అక్కడే అగిపోవడంతో దేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ‘ఫ్లైట్ అవేర్ యూఎస్’ ప్రకారం ఉదయం 5:31 గంటలకు యునైటెడ్ స్టేట్స్లో 400 విమానాలు ఆలస్యమైనట్లు తెలిపింది. నోటీస్ టు ఎయిర్ మిషన్స్ సిస్టమ్‌ను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు ఎఫ్ఏఏ ఓ ప్రకటనలో తెలిపింది. జాతీయ గగనతల వ్యవస్థ అంతటా కార్యకలాపాలు ప్రభావితమవుతాయని పేర్కొంది. ఎప్పుడు పునరుద్ధరించబడుతుందనే ప్రశ్నకు సమయాన్ని వెల్లడించకపోవడం గమనార్హం. చదవండి: కోవిడ్ దెబ్బకు కుదేలవుతున్న చైనా! చికిత్స అందిచేందుకు కూడా.. -
ఉద్యోగానికి కండబలం అక్కర్లేదు!
‘ఉద్యోగానికి కండబలం అక్కర్లేదు. చిత్తశుద్ధితో పాటు శ్రద్ధ, ఎప్పుడూ ‘ది బెస్ట్’ ఇవ్వాలనే సదాశయం ఉంటే చాలు. ఉద్యోగం ఓ క్రీడా మైదానం. ఎంత పోటీ పడితే అంత ముందంజలో ఉంటాం’ అంటున్నారు శ్యామ్లీ హల్దార్. భారతదేశ మొట్టమొదటి మహిళా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జనరల్‌గా నియమితులైన శ్యామ్లీని ఆ స్థానానికి ఎదిగేలా చేసింది కేవలం ఆమె కృషి, నిబద్ధతలే. ఎంచుకున్న పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో నిర్వర్తించగల సత్తా మహిళకే ఉందని మరోసారి చాటారు శ్యామ్లీ హల్దార్. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ జనరల్‌గా ఈ మంగళవారం కోల్‌కతాలో నియమితులైన శ్యామ్లీ మొన్నటి వరకు ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోలర్‌గా విమానం కదలికలను పర్యవేక్షించేవారు. ఇప్పుడు కోల్‌కతాలోని 300 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల బృందాన్ని పర్యవేక్షించే బాధ్యతను చేపట్టారు. మూడు దశాబ్దాల క్రితం అలహాబాద్‌లోని సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజీ నుండి ట్రైనింగ్ పొందిన శ్యామ్లీ 1991లో కోల్‌కతాలో మొదటి పోస్టింగ్ తీసుకున్నారు. మానసిక బలం ‘‘నేను నా ఇంటి పనిని ఆఫీసుకు తీసుకు వెళ్లను. ఆఫీసు పనిని ఇంటికి తీసుకు వెళ్లిందీ లేదు. చేతిలో ఉన్న ఉద్యోగానికి నా ఉత్తమమైన పని ఇవ్వడానికే ఎప్పుడూ ప్రయత్నించాను. నా కూతురు, నా ఉద్యోగం నా జీవితానికి సమాంతర అంతఃశక్తులు. మన దేశంలో మహిళలు కుటుంబ విషయాల్లో ఎదుర్కొనే ఒత్తిళ్లతో పాటు రకరకాల సంఘర్షణలపై దృష్టి సారించడం సహజంగానే వస్తుంది. ఉద్యోగానికి కండ బలం అక్కర్లేదు. మహిళలు ఇదో క్రీడా మైదానంగా తన పోరాట పటిమను చూపించవచ్చు. నేను మానసికంగా బలవంతురాలిని. విధి నిర్వహణలో ఎప్పుడూ నా ఉత్తమమైన పనినే ఇచ్చాను. నేను చెప్పే మాట మీకు వింతగా అనిపించవచ్చు. కానీ, నేను ఏదో ఒక రోజు ఈ హోదాలో ఉండితీరుతాను అని ముందే ఊహించాను’’ అని బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో సగర్వంగా తెలిపారు శామ్లీ హల్దార్. (చదవండి: పెళ్ళి ఛాందసమా, సదాచారమా!!) పనితో సమాధానం 1989లో మొదటి ఎయిర్ బ్యాచ్ కంట్రోలర్లలో శ్యామ్లీ హల్దార్ కూడా ఉన్నారు. అప్పుడు మగ్గురు మహిళలను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లుగా ఎంపిక చేశారు. కోల్‌కతాలో అధికారిగా మాత్రం శామ్లీ ఒక్కరే నియమితులయ్యారు. అలహాబాద్‌లోని సివిల్ ఏవియేషన్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పొందిన శామ్లీ పురుషాధిపత్య వృత్తిలో విధి నిర్వహణ ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. ఒంటరి తల్లిగా జీవిస్తున్న శామ్లీ ఓ వైపు ఉద్యోగాన్ని, మరో వైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎదిగారు. -
ద్రోన్ల ట్రాఫిక్ నియంత్రణకు కొత్త ఏటీసీ వ్యవస్థ!
న్యూయార్క్: గగనతలంలో విమానాలు, హెలికాప్టర్ల ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్(ఏటీసీ) ఉంది. మరి గగనతలంలో పక్షుల్లా వీరవిహారం చేస్తున్న ద్రోన్ల సంగతేంటి? భవిష్యత్తులో ద్రోన్లు ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమవుతూ ఎటుపడితే అటు దూసుకెళ్లడం చాలా సాధారణం కానుంది కూడా. అందుకే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు ద్రోన్ల నియంత్రణ కోసం ప్రత్యేక ‘ద్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్’ను రూపొందిస్తున్నారు. భూమిపై 400-500 అడుగుల ఎత్తులో ఎగిరే ద్రోన్ల నియంత్రణకు వారు ద్రోన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను అభివృద్ధిపరుస్తున్నారు. ద్రోన్లు ఒకదానిని ఒకటి ఢీకొట్టకుండా, హెలికాప్టర్ల దారికి అడ్డువెళ్లకుండా, భవనాల్లోకి దూసుకుపోకుండా ఉండేందుకు వీలుగా ఈ కొత్త ఏటీసీని రూపొందిస్తున్నారు. ఆయా ద్రోన్లు ఎంత ఎత్తులో, ఏ దిశలో వెళ్లాలి? అన్నది ఈ కంప్యూటర్ ఆధారిత ఏటీసీ వ్యవస్థ ఆటోమేటిక్‌గా నియంత్రిస్తుందట.


