‘ధురంధర్‌ 2’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Dhurandhar 2 Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

‘ధురంధర్‌ 2’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Mar 19 2026 12:20 AM | Updated on Mar 19 2026 3:56 AM

Dhurandhar 2 Movie Review And Rating In Telugu

సినిమా: ధురంధర్: ద రివేంజ్
నటీనటులు: రణ్‌వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ తదితరులు
సంగీతం: శాశ్వత్ సచ్‌దేవ్
సినిమాటోగ్రఫీ: వికాల్ నోవ్లఖా
ఎడిటర్: శివకుమార్ వి పనికర్
రచన-దర్శకత్వం: ఆదిత్య ధర్
నిర్మాతలు: జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్
నిడివి: 229 నిమిషాలు
విడుదల తేదీ: 19 మార్చి 2026

గతేడాది డిసెంబరులో ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా 'ధురంధర్'. సీక్వెల్ గురించి అప్పుడే క్లారిటీ ఇ‍చ్చారు. ఇప్పుడు అదే మాటపై నిలబడి 'ధురంధర్: ద రివేంజ్'ని థియేటర్లలోకి తీసుకొచ్చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా రెండో భాగాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? తొలి భాగాన్ని మించిపోయిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?
రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్‌ పార్ట్‌ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్‌ పప్పు (అశ్విన్‌ ధర్‌)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్‌ పప్పుపై రెహమాన్‌ సోదరుడు ఉజెయిర్‌ బలోచ్‌(డానిష్‌) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని  భారత సీక్రెట్‌ ఏజెంట్‌ హమ్జా(రణ్‌వీర్‌ సింగ్‌) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అజయ్‌ సన్యాల్‌(మాధవన్‌) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్‌పై పాన్‌ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్‌ ఏజెంట్‌ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్‌ ’ ఎవరు? ఆపరేషన్‌ ధురంధర్‌ కోసం ఇంటెలిజెన్స్‌ బ్యూరో చీఫ్‌ అజయ్‌ సన్యాల్‌.. పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న  జస్కరిత్ సింగ్ రంగీ(రణ్‌వీర్‌)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్‌ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఒక జైలు ఖైదీని సీక్రెట్‌ ఏజెంట్‌గా పాకిస్తాన్‌కి పంపడం అనే కొత్త పాయింటే ధురంధర్‌ విజయానికి కారణం అయింది. ఇంతవరకు వచ్చిన స్పె యాక్షన్‌ సినిమాలకు ధురంధర్‌కు మత్య ఉన్న తేడా అదే.  దానికి తోడు యాక్షన్‌ సన్నివేశాలు, బీజీఎం అదిరిపోవడంతో రికార్డు స్థాయి కలెక్షన్స్‌ వచ్చాయి. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ధురంధర్‌ : ది రివెంజ్‌ కూడా అదే రేంజ్‌లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. యాక్షన్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్‌కి కూడా పెద్ద పీట వేశారు. 

పార్ట్‌ 1 చూసిన వాళ్లు సినిమా ప్రారంభం నుంచే ధురంధర్‌ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. చూడనివారికి కూడా కథను చాప్టర్ల వారిగా విడగొట్టి.. అర్థమయ్యేలా తెరపై చూపించాడు దర్శకుడు. అయితే పార్ట్‌ 1 చూస్తేనే కొన్ని పాత్రలకు తాలుకు పవర్‌ తెలిసి..తర్వాత ఏం జరుగుతుందో ఊహించొచ్చు.చివరిలో వచ్చే కొన్ని ట్విస్టులను మాత్రం ఊహించలేం. అవి థ్రిల్‌కి గురి చేస్తాయి. పార్ట్‌1 కంటే నిడివి ఎక్కువైనా.. ఎక్కడా బోర్‌ కొట్టదు.

హమ్జా పాత్ర ప్లాష్‌బ్యాక్‌తో సినిమా కథ ప్రారంభం అవుతుంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై హీరో పగ తీర్చుకునే క్రమంలో వచ్చే సన్నివేశాలు అయితే ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. అక్కడ నుంచి మొదలు సినిమా ఎండింగ్‌ వరకు యాక్షన్‌ సీన్స్‌ను ఓ రేంజ్‌తో తీర్చిదిద్దారు. ల్యారీ పీఠం దక్కించుకునేందకు హమ్జా ఆడే మైండ్‌ గేమ్‌ అదిరిపోతుంది. ఉగ్రవాదులకు అంతం చేసేందుకు వేసే ఎత్తులు థియేటర్స్‌లో చప్పట్లు కొట్టించేలా ఉంటాయి. 

2016లో జరిగిన నోట్ల రద్ధు ఘటనను కూడా ఈ కథలో ప్రస్తావించారు. నోట్ల రద్దు సరైన నిర్ణయం అనేలా ఈ చిత్రంలో చూపించారు. అలాగే మాఫీయా డాన్‌ దావూద్‌ని కూడా ఈ కథకు ముడిపెట్టడం ఆసక్తిరేకెత్తించే అంశం. ఫస్టాఫ్‌ వరకు కాస్త స్లోగా అనిపించినా.. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ మాత్రం అదిరిపోతుంది. ద్వితియార్థంలో ఏం జరుగుందా అనే ఆసక్తిని ప్రేక్షకులను కలిగించేలా ఇంటర్వెల్‌ కట్‌ చేశారు. ఇక సెకండాప్‌ మొత్తం కథనం పరుగులు పెడుతుంది. హమ్జాపై ఎన్సీ అస్లాం చౌదరిపై అనుమానం రావడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. హమ్జా భారత ఏజెంట్‌ అని తెలిసిన తర్వాత ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక చివరి 30 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి.  క్లైమాక్స్‌ ఎమోషనల్‌గా సాగుతుంది. 

ఎవరెలా చేశారంటే..
సీక్రెట్‌ ఏజెంట్‌ హమ్జా పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్లతో పాటు ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. పాకిస్తాన్‌ మేజర్‌ ఇక్బాల్‌గా అర్జున్‌ రాంపాల్‌ అద్భుతంగా నటించాడు. ఎస్పీ చౌదరిగా నటించిన సంజయ్‌ దత్‌ నిడివి కాస్త తక్కువే. ఆయన పాత్ర ముగింపు బాగుంటుంది. ఐబీ చీఫ్‌ అజయ్‌ సన్యాల్‌గా మాధవన్‌ తెరపై కనిపించేది తక్కువే అయినా.. గుర్తిండిపోయేలా నటించాడు.  జమీల్‌ జమాల్‌గా నటించిన రాకేశ్‌ బేడి నవ్వులు పూయించడంతో పాటు థ్రిల్లింగ్‌కి కూడా గురిచేశాడు. సారా అర్జున్‌  పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. మిగిలినవారంతా బాగానే చేశారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. శాశ్వత్ సచ్‌దేవ్ బీజీఎం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన నేపథ్య సంగీతంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పోరాట ఘట్టాలు వాస్తవికంగా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. 
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement