ఏటీసీ సమస్యతో 800 విమానాలు ఆలస్యం
ఉత్తరాది విమానాశ్రయాలపైనా ప్రభావం
రాత్రి 9 గంటలకు సమస్య పరిష్కారం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య తీవ్ర అలజడి రేపింది. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏటీసీ సరిగా పనిచేయకపోవడంతో 800కు పైగా దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పటికీ శుక్రవారం ఉదయం 5.45 గంటల నుంచి తీవ్రరూపం దాల్చిందని అధికార వర్గాలు తెలిపాయి.
రద్దీ తీవ్రరూపం దాల్చడంతో కనీసం ఏడు విమానాలను సమీపంలోని జైపూర్, లక్నో విమానాశ్రయాలకు దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోర్డింగ్ గేట్ల వద్ద ప్రయాణికుల భారీ క్యూలు కనిపిస్తున్నాయని, టెర్మినళ్ల వద్ద వందలాది మంది ప్రయాణికులు ఎదురు చూపులు చూస్తున్నారని సమాచారం.
ఫ్లైట్ షెడ్యూల్ ఆటో ట్రాక్ సిస్టమ్ ద్వారా అందకపోవడంతో ట్రాఫిక్ కంట్రోలర్లు మాన్యువల్‌గా తయారు చేస్తున్నారు. ఇందుకు చాలా సమయం తీసుకుంటోంది. దీంతో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. నిత్యం 1,500 విమానాలు రాకపో కలు సాగించే ఢిల్లీ ఎయిర్ పోర్టు ఏటీసీలోని ఆటో మేటిక్ మెసేజ్ స్విఛింగ్ సిస్టం(ఏఎంఎస్‌ఎస్)లో సాఫ్ట్‌వేర్ సమస్య ఎదురైంది. ట్రాఫిక్ సిస్టమ్‌పై ప్రభావం పడటంతో విమానాల టేకాఫ్, ల్యాండింగ్ షెడ్యూల్‌కు తీవ్ర అవ రోధం ఏర్పడింది. ఇంతటి కీలకమైన ఎయిర్ పోర్టులో తలెత్తిన ఈ సమస్యను కేవలం సాంకేతిక పరమైందిగానే అధికా రులు చెబుతున్నా, ‘జీపీఎస్ స్పూఫింగ్’అని పిలిచే సైబర్ అటాక్ కావచ్చని నిపుణులు అంటున్నారు.
సమస్య పరిష్కరించాం: ఏఏఐ
ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యం కావడానికి కారణమైన ఆటోమేటిక్ మెసేజ్ స్విఛింగ్ సిస్టమ్(ఏఎంఎస్‌ఎస్)ను ఎట్టకేలకు గాడిన పెట్టినట్లు ఏఏఐ శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో తెలిపింది. ట్రాఫిక్ కార్యకలాపాలు తక్షణమే ఆటంకం లేకుండా కొనసాగేందుకు అవస రమైన సిబ్బందిని కూడా రంగంలోకి దించామంది.
ఏమిటీ జీపీఎస్ స్పూఫింగ్..?
సాధారణంగా సంక్షోభ ప్రాంతాల్లో జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలకు ఎక్కువగా అవకాశముంటుంది. భారత్–పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంలోనూ ఈ రకమైన సైబర్ దాడులు జరుగుతుంటాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా తయారీ పాక్ గగనతల రక్షణ వ్యవస్థలను అక్కడి మిలటరీ ప్రాంతాలపై దాడుల సమయంలో భారత్ జామ్ చేసింది. ల్యాండవ్వాల్సిన విమానాల పొజిషన్‌పై ఏటీఎస్‌కు తప్పుడు శాటిలైట్ సిగ్నళ్లను పంపించడం ద్వారా వాటిని దారి మళ్లేలా చేయడం, రద్దీ పెంచడం దీని లక్ష్యం. ఢిల్లీ విమానాశ్రయంలో విమానం పొజిషనింగ్ సాధారణ స్థాయి 8 కాగా, గత కొద్ది రోజులుగా 0గా చూపిస్తోంది. ఢిల్లీ పరిధిలో 60 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా ఇలాంటి తప్పుడు సిగ్నళ్లు అందుతున్నట్లు పైలట్లు ఫిర్యాదు చేస్తున్నారు.


