బార్ కోడ్‌తో వీడిన హత్యాయత్నం మిస్టరీ
మూడు రోజుల్లో ముగ్గురు నిందితుల పట్టివేత
న్యూఢిల్లీ: ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో జరిగిన ఒక హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించిన తీరు ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. అది డిసెంబర్ 15వ తేదీ.. కరోల్ బాగ్‌లోని అజ్మల్ ఖాన్ పార్కులో ఒక వ్యక్తి తన స్నేహితుడితో కలిసి సరదాగా ఇన్‌స్టా రీల్స్ షూట్ చేసుకుంటున్నాడు. పక్కనే మద్యం తాగుతున్న ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వారితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.
గొడవకు కారణమేమిటంటే.. నిందితులు బాధితుడిని అగ్గిపెట్టె అడిగారు. లేదన్నందుకు అతని జేబులు వెతకడం మొదలుపెట్టారు. అది కాస్తా తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. ఆవేశంలో ఒక నిందితుడు బీర్ సీసాను పగులగొట్టి, బాధితుడి తలపై బలంగా బాదాడు. బాధితుడు రక్తపు మడుగులో పడిపోగా, నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.
క్లూ దొరికిందిలా..
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా, దాడికి ఉపయోగించిన పగిలిన బీర్ సీసా దొరికింది. దానిపై ’బార్ కోడ్’ చెక్కు చెదరకుండా ఉంది. అదే ఈ కేసులో కీలక మలుపు.. ఆ బార్‌కోడ్ ఆధారంగా పోలీసులు సమీపంలోని వైన్ దుకాణాలన్నీ గాలించారు.
72 గంటల గాలింపు
బార్‌కోడ్ మ్యాచ్ అయిన వైన్ దుకాణం దగ్గర సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించగా, నిందితులు వాడిన స్కూటర్ బయటపడింది. వరుస సీసీటీవీలను పరిశీలించిన స్పెషల్ టీమ్, కేవలం 72 గంటల్లోనే నిందితుల చిరునామా కనిపెట్టి వారిని చుట్టుముట్టింది.
అసలు నిందితులు వీరే!
డిసెంబర్ 18న హమ్మద్ అలియాస్ రిజ్వాన్ (22), కామ్రాన్ (24), ఫర్జాన్ (24) అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో హమ్మద్ అనే వ్యక్తి సాధారణ నేరస్తుడు కాదు.. అతనిపై ఇప్పటికే 20 ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి. అగ్గిపెట్టె కోసం మొదలైన గొడవలో.. ఒక చిన్న బార్‌కోడ్ ఆధారం నిందితుల్ని కటకటాల వెనక్కి నెట్టింది.


