బంగ్లాలో దాస్ హత్యపై పోలీసులు
కంపెనీ వర్గాల ఉద్దేశపూర్వక ఆలస్యం
ముందే మాకు ఫోన్ చేస్తే బతికేవాడు
ప్రీ ప్లాన్డ్‌మర్డరేనని స్పష్టీకరణ
సాక్షి, నేషనల్ డెస్క్: బంగ్లాదేశ్‌లో మతోన్మాదుల చేతిలో నిస్సహాయంగా మూక హత్యకు గురైన హిందూ మైనారిటీ వర్గానికి చెందిన దీపూ చంద్రదాస్ ఉదంతానికి సంబంధించి కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన పని చేసిన కంపెనీ వర్గాలతో పాటు సహచరులే హత్యలో పాత్రధారులుగా మారినట్టు పోలీసులు వెల్లడించారు! దాంతో బంగ్లాదేశ్‌లోని మైనారిటీ వర్గాలన్నీ మరోసారి భగ్గుమంటున్నాయి.
బంగ్లాదేశ్‌లో మైమెన్‌సింగ్ పట్టణంలోని ఓ బట్టల ఫ్యాక్టరీలో కార్మికునిగా పని చేస్తున్న 27 ఏళ్ల దాస్ డిసెంబర్ 16న దారుణ హత్యకు గురవడం తెలిసిందే. కంపెనీ ఆవరణ బయటే మతోన్మాద మూక ఆయనను అతి దారుణంగా కొట్టిచంపింది. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ఢాకా–మైమెన్‌గంజ్ హైవే మీదికి లాక్కెళ్లి బాహాటంగా తగలబెట్టింది. మత దూషణకు పాల్పడ్డాడన్నది దాస్‌పై ప్రధాన ఆరోపణ. అయితే అందుకు అసలు ఆధారాలే లేవని పోలీసులు ఇప్పుడు తీరిగ్గా చెబుతున్నారు. పైగా దాస్ హత్య ఆవేశంలో అప్పటికప్పుడు జరిగిన ఘటన కాదని, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని యాంటీ క్రైం ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్‌ఏబీ) స్పష్టం చేయడం విశేషం. అంతేకాదు, దాస్‌ను దారుణంగా కొట్టిచంపడంలో ఏకంగా ఆయన సహోద్యోగులు కూడా మూకతో చేతులు కలిపినట్టు ఆర్‌ఏబీతో పాటు స్థానిక మీడియా కూడా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆర్‌ఏబీ ఇప్పటిదాకా 10 మందిని అరెస్టు చేసింది. అనంతరం పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగింది?
దాస్ మతదూషణకు పాల్పడుతూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టినట్టు డిసెంబర్ 16న ఉదయం నుంచే జోరుగా పుకార్లు షికారు చేశాయి. విషయం తెలియని ఆయన ఎప్పట్లాగే విధులకు హాజరయ్యాడు. అదే ఆయన పాలిట మృత్యువుగా పరిణమించింది. సాయంత్రానికల్లా సహోద్యోగులే ఆయనను దూషించడం మొదలుపెట్టారు. వారించాల్సిన పై అధికారులు పట్టించుకోకపోగా, దాస్‌తో బలవంతంగా రాజీనామా పత్రంపై సంతకం చేయించారు.
మరోవైపు మధ్యాహ్నం నుంచే
కంపెనీ బయట ఉన్మాద మూక పోగడం మొదలుపెట్టింది. సాయంత్రానికల్లా దాస్‌పై ఫ్యాక్టరీ ఆవరణలోనే తొలి దాడి జరిగినట్టు ఆర్‌ఏబీ–14 క మాండర్ నయీముల్ హసన్ వెల్లడించారు! ‘‘ఫ్యాక్టరీ ఫ్లోర్ ఇన్‌చార్జి దాస్‌తో బలవంతంగా రాజీనామా చేయించడమే గాక ఆవేశంతో ఉడికిపోతున్న మూకకు ఆయనను స్వయంగా అప్పగించాడు. రాత్రి 8:30 గంటల వేళ, సరిగ్గా తర్వాతి షిఫ్ట్ కార్మికులు చిన్న గేట్ గుండా లోపలికొస్తున్న సమయంలో, బయట మూగిన మూక చూస్తుండగా దాస్‌ను బలవంతంగా లాక్కెళ్లి ఫ్యాక్టరీ మెయిన్ గేట్ దగ్గరున్న సెక్యూరిటీ రూములో ఉంచాడు.
అంతే! ఆ వెంటనే మూక లోనికి దూసుకొచ్చి దాస్‌ను బయటికి లాక్కెళ్లింది. నిమిషాల వ్యవధిలోనే విచక్షణారహితంగా కొట్టిచంపింది. దాస్ సహోద్యోగులు కూడా వారితో చేతులు కలపడం ఈ ఉదంతంలో మరో విషాదం’’అని హసన్ వివరించారు. అంతేకాదు, ‘‘ఇంత ఉద్రిక్తత నెలకొన్నా రాత్రి 8 గంటల దాకా ఫ్యాక్టరీ బాధ్యులు తమకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. సకాలంలో ఒక్క ఫోన్ కాల్ చేసుంటే దాస్ బతికేవాడే’’అని చెప్పుకొచ్చారు. ‘‘ఫోన్ రాగానే మేం హుటాహుటిన బయల్దేరినా కిలోమీటర్ల కొద్దీ విపరీతంగా ట్రాఫిక్ జామై సకాలంలో ఘటనా స్థలికి చేరలేకపోయాం. మేం వెళ్లేసరికే అంతా అయిపోయింది’’అన్నారు.
కంపెనీ అంగీకారం!
దాస్ హత్యోదంతంలో ఫ్యాక్టరీ తప్పేమీ లేదని సీనియర్ మేనేజర్ షకీబ్ మహ్మూద్ బుకాయించినా, సహోద్యోగుల్లో కొందరు సాయంత్రానికల్లా దాస్‌కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారంటూ వాస్తవాన్ని చెప్పకనే చెప్పాడు! అంతేకాదు, దాస్ దైవదూషణకు పాల్పడ్డట్టు ఎలాంటి రుజువులూ దొరకలేదని కూడా అంగీకరించాడు. ‘‘మూకను శాంతింపజేసేందుకు దాస్‌తో ఉత్తుత్తి రాజీనామా చేయించాం. కానీ ఆ చర్యతో మూక కాదు కదా, సహోద్యోగులు కూడా శాంతించలేదు’’అంటూ హంతకుల్లో తమ ఉద్యోగులు కూడా ఉన్నట్టు పరోక్షంగా చెప్పాడు.


