‍శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..! | Health tips: Understanding Toxic Positivity in Modern Culture | Sakshi
Sakshi News home page

‍శ్రుతిమించిన పాజిటివిటీ వద్దు..!

Feb 8 2026 1:02 PM | Updated on Feb 8 2026 3:05 PM

Health tips: Understanding Toxic Positivity in Modern Culture

వ్యక్తిత్వ వికాసం అంటే... గెలుస్తూ ఉండటమే అనే భావన పూర్తిగా స్థిరపడింది. అయితే సైకిల్‌కు గాలి కొట్టినట్టుగా ఇలా ఎప్పుడూ పాజిటివ్‌ యాటిట్యూడ్‌తో ఉండటాన్ని ‘టాక్సిక్‌ పాజిటివిటి’ అంటారనీ ఇది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ‘హెల్దీ ఆప్టిమిజమ్‌’ (వాస్తవిక ఆశావాదం) కలిగి ఉండి... నిరాశ, ఓటములను అంగీకరించే మానసిక పరిణితి ఉంటే మేలని వారు సూచిస్తున్నారు. ‘టాక్సిక్‌ పాజిటివిటీ’ ఎందుకు వద్దో చదవండి.

మన దగ్గర ‘అంతా మన మంచికే’ అనే తాత్త్వికత ఉంది. అంటే మంచైనా చెడైనా మంచికే దారి తీస్తుందనే ఒక ఆశావాదాన్ని ఇది కలిగిస్తుంది. దీనిచుట్టూ ఆసక్తికరమైన కథలు కూడా ఉన్నాయి. అలాగే చైనాలో ‘ఇన్‌ యాంగ్‌’ అనే భావన ఉంది. అంటే దుఃఖం–సంతోషం, ఆశ–నిరాశ, గెలుపు–ఓటమి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని, ఇంకా చె΄్పాలంటే ఒకదానిలోనే మరొకటి ఉంటాయని వారు నమ్ముతారు.

జీవితంలో ముందుకు సాగాలంటే లక్ష్యం, గెలుపు మీద దృష్టి ఉండాల్సిందే. అయితే ఆ దారిలో కలిగి ఉండాల్సింది ‘వాస్తవిక ఆశావాదమే’ తప్ప ‘కేవల గెలుపువాదం’ మాత్రం కాదు. ఈ సృష్టిలో అంతా గెలుపునకే అవకాశాలు ఉన్నాయని ప్రయత్నిస్తే అన్నివేళలా గెలుపు అందుకోవచ్చని, ఆ విధంగా పాజిటివ్‌ యాటిట్యూడ్‌ను కలిగి ఉండాలని ఆధునిక వ్యక్తిత్వ వికాసం ప్రబోధిస్తుంది. అయితే దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువని అంటున్నారు మానసిక నిపుణులు.

హద్దుల్లేని ఆశావాదం
ఒక విద్యార్థి యావరేజ్‌ మార్కులతో ఉన్నా ‘నువ్వు జెఇఇలో ర్యాంకు సాధించగలవు’ అనే ΄ాజిటివ్‌ యాటిట్యూడ్‌ నూరి΄ోసినా, ఆ ΄ాజిటివ్‌ యాటిట్యూడ్‌తో ర్యాంకు వస్తుందని విద్యార్థి నమ్మినా చివరకు ఫలితాలు భంగపరిచే తీరుతాయి. అప్పుడు ఓటమి, నిరాశను తట్టుకోవడం కష్టమవుతుంది. సమయానికి చేరుకుంటే ఫ్లయిట్‌ అందుకుంటాం గానీ మనం లేటవుతూ ‘ఏం పర్లేదు.. ఫ్లయిట్‌ దొరుకుతుందిలే’ అనుకోవడం శ్రుతి మించిన ఆశావాదమే. 

మనల్ని మనం మోసం చేసుకోవడమే. లోకంలో గెలుపు, వెలుతురు ఉంటాయి. అలాగే మనం వద్దనుకున్నా ఓటమి, చీకటి కూడా ఉంటాయి. వాటిని యాక్సెప్ట్‌ చేయడం ముఖ్యమని అంటున్నారు మానసిక నిపుణులు. టాక్సిక్‌ పాజిటివిటీ వల్ల నిరంతరం సంతోషంగా ఉండాలేమో, సంతోషంగా ఉంటే తప్ప జీవితానికి విలువ లేదేమో అనేది కండీషనింగ్‌గా మారి సమస్యలకు దారి తీస్తోందని అంటున్నారు. 

ఆరు రుచులు... అన్ని భావాలు
ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఉప్పు, పులుపు, తీపి, చేదు, కారం, వగరులతో కలిపిన పదార్థం. జీవితంలో కూడా అటువంటి అన్ని అంశాలు కలిసే ఉంటాయని చెప్పేందుకు ఉగాది పచ్చడి తినిపిస్తుంటారు. అయితే జీవితంలో పాజిటివిటీ ఎక్కువైపోతే కేవలం తీపిని తప్ప చేదుని రుచి చూడలేని పరిస్థితి తలెత్తుతుందని, దీని వల్ల చిన్న విషయాలకే మనసును తీవ్రంగా గాయపరుచుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. 

అన్ని రకాల భావాలకూ మనసులో చోటివ్వకుండా, కేవలం మంచి మాత్రమే జరగాలని కోరుకోవడం వల్ల భిన్న దృక్కోణాల్లో సమస్యను పరిశీలించి, పరిశోధించే అవకాశం దక్కడం లేదని అంటున్నారు. ఈ కారణంగానే కొందరు తొందరగా డిప్రెషన్‌ బారిన పడుతున్నారంటున్నారు.

పాజిటివ్‌గా ఆలోచించడం తప్పా?
ఇదంతా విన్నాక ‘పాజిటివ్‌గా ఆలోచించడం తప్పా? అలా ఆలోచించడం ముప్పు తెస్తుందా?’ అనే సందేహం రావచ్చు. పాజిటివ్‌గా ఆలోచించడం తప్పు కాదు. అందులో దోషం లేదు. అయితే పాజిటివిటీతోపాటు జీవితంలో నెగిటివిటీ కూడా ఉంటుందని గుర్తించకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు సమస్యలుగా పరిణమిస్తాయి. 

కొందరు ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఆలోచిస్తుంటారు. ఏదైనా చిన్న కష్టం వచ్చినా ‘ఇంత బాగా ఆలోచించే నాకు ఎందుకీ కష్టం వచ్చింది? నాకెందుకు ఇలా జరిగింది?’ అని ఆలోచించి ఆలోచించి మరింత మధనపడుతుంటారు. రాన్రానూ ఇదొక తీవ్ర సమస్యగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆనందం శాశ్వతం కాదు...
పాజిటివ్‌ థింకింగ్‌లో ఉన్న మరో ప్రధాన సమస్య ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకోవడం. మనిషికి సహజంగా ఆనందంతోపాటు దు:ఖం, కోపం, చిరాకు, అలసట వంటివి వస్తుంటాయి. అయితే పాజిటివ్‌ థింకింగ్‌ కారణంగా కేవలం ఆనందంగా మాత్రమే ఉండాలని అనుకుంటే మిగిలిన భావాలు లోలోపలే పేరుకు΄ోయి మానసిక సమస్యలకు కారణమవుతాయి. 

ముఖ్యమైన సందర్భాల్లో భావోద్వేగాలు బయటకు రాక ఇబ్బంది పడుతుంటారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువైందని మానసిక నిపుణులు అంటున్నారు. బలవంతంగా సంతోషాన్ని నటించడం వల్ల ఇబ్బందులు తప్ప ఫలితాలు ఉండవని హెచ్చరిస్తున్నారు. 

నిర్వహణ: యాసీన్‌

(చదవండి: ఎంత తక్కువ మోతాదైనా.. ఆ ముప్పు తప్పదు..! హెచ్చరిస్తున్న అధ్యయనాలు)

Advertisement
 
Advertisement
Advertisement