ఈ వారం కథ: బూడిద రంగు ఆకాశం | This week's story | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: బూడిద రంగు ఆకాశం

Feb 8 2026 8:58 AM | Updated on Feb 8 2026 8:58 AM

This week's story

బ్రూనో తన ఎదురుగా ఉన్న కంప్యూటర్‌ స్క్రీన్‌ మీద కన్పిస్తున్న బొమ్మల వైపు నిశితంగా చూసింది. ఓ వైపు గులాబీ పువ్వుంది. మరోవైపు రత్నాలహారం... తను సరైన బొమ్మను ఎన్నుకుంటే బనానా మిల్క్‌షేక్‌ బహుమతిగా లభిస్తుందని తెలుసు. పొరపాటు చేస్తే శిక్ష తప్పదని కూడా తెలుసు.బ్రూనో తన కుడిచేతిని ముందుకు చాపి పొడవాటివేలితో హారం వైపు చూపించింది. గత రెండు వారాలుగా హారంవైపు చూపించిన ప్రతిసారీ దానికి తీయటి మిల్క్‌షేక్‌ లభించిన విషయం గుర్తుంది. కాని, ఒక్కసారిగా కంటెయినర్లో అంధకారం అలముకుంది. బ్రూనోకు తను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఐదు నిమిషాలు చీకటిలో మగ్గాక లైట్‌ వెలిగింది. మరోసారి బ్రూనో ముందు కంప్యూటర్‌ స్క్రీన్‌  ఉంచబడింది.

 బ్రూనో మళ్ళా హారం వైపు చూపించింది. దాన్ని ఉంచిన కంటెయినర్‌ లోపలున్న బల్బ్‌ వెంటనే ఆరిపోయింది. ఆరుసార్లు ప్రయత్నించినా బ్రూనో తప్పు చేస్తూనే ఉంది. నిన్నటి వరకు హారం సరైన సమాధానమే అయినా ఈరోజు అది మారిపోయిందన్న విషయం దాని మెదడు గ్రహించలేకపోతోంది.అది జతకడుతున్న ఆడకోతి లిల్లీతో అదే ప్రయోగాన్ని చేశాను. నిన్నటి వరకు లిల్లీ హారం బొమ్మ వైపు చూపిస్తే దానికి అరటిపళ్ళు బహుమతిగా ఇచ్చాను. ఈరోజు మొదట అది హారంబొమ్మ చూపించింది. వెంటనే కంటెయినర్లో లైట్‌ తీసేసి, చీకటి చేశాను. ఐదు నిమిషాల తర్వాత మళ్ళా స్క్రీన్‌ చూపిస్తే అది గులాబీపువ్వుని చూపించింది. మరో రెండు కోతులు కూడా మొదట హారాన్ని చూపించి, దాని వల్ల శిక్షిస్తారని అర్థమై, రెండోసారి గులాబీపువ్వు వైపు చూపించాయి.

బహుమతినందించే బొమ్మలో మార్పు జరిగిందన్న విషయం వీటికి అర్థమైనట్టు బ్రూనోకి ఎందుకు అర్థం కాలేదో నాకు తెలుసు. అందుక్కారణం నెలరోజుల క్రితం దాని మెదళ్ళోని ఓ భాగంలోకి ఇంజెక్ట్‌ చేసిన టాక్సిన్‌. దానివల్ల అక్కడి టిష్యూలు దెబ్బతిని ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతం ఉన్న ముప్పయిరెండు కోతుల్లోకెల్లా బ్రూనో చాలా తెలివైన మగ కోతి. నేను న్యూరో సైంటిస్టుగా ఇక్కడ ఉద్యోగంలో చేరేనాటికి దీని వయసు నాలుగు నెలలు. ఎంత అల్లరి చేసేదో.. ఎంత చురుగ్గా  ఉండేదో.. ప్రయోగాలకు అవసరమైన కోతుల్ని ప్రయోగశాలలోనే పెంచుతారు. నాలుగడుగుల ఎత్తు, నాలుగున్నర అడుగుల పొడవున్న విశాలమైన బోన్లలో కోతుల జంటతో పాటు వాటికి పుట్టిన పిల్లల్ని కూడా ఉంచుతారు. అవి ఆడుకోడానికి కంటెయినర్లోనే అవసరమైన ఏర్పాట్లు ఉంటాయి.

ఏడాది వయసు దాటేవరకు బ్రూనో వాళ్ళమ్మను అంటిపెట్టుకునే ఉండేది. ఆ తర్వాత స్వతంత్రంగా వ్యవహరించసాగింది. నేను ల్యాబ్‌లోకి ప్రవేశిస్తుంటే నావైపు చాలా ఆసక్తిగా చూసేది. దాని కళ్ళలో మెరుపు కన్పించేది. ఆ కళ్ళు పలకరింపుగా నవ్వుతున్నాయేమో అన్పించేది. దానికిపుడు నాలుగేళ్ళు. ఈమధ్య నన్ను చూడగానే బ్రూనో సంతోషం ఆపుకోలేక గెంతుతోంది. దవడలను ముందుకు చాపి, పెదవులను పైకి లాగి, పళ్ళన్నీ కన్పించేలా అదో రకంగా నవ్వుతోంది కూడా. నేను మాట్లాడుతుంటే శ్రద్ధగా వింటుంది. మెమొరీ పరీక్షల్లో, పజిల్స్‌లో చాలా చురుగ్గా పాల్గొంటుంది.ఈ ప్రయోగశాలలో పార్కిన్సన్స్‌కి, ఏడీహెచ్‌డీకి, ఆటిజం డిజార్డర్‌కి సరైన మందులు కనుక్కోవడం కోసం కోతులమీద నాడీసంబంధిత ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక్కడున్న కోతులన్నీ రీసస్‌ మకాక్‌ జాతికి చెందినవే.

 రక్తంలోని ఆర్‌హెచ్‌ ఫ్యాక్టర్‌ గురించి తెల్సుకోవడంలో, రేబిస్, పోలియో, మశూచి వంటి జబ్బులకు టీకాలు కనుక్కోవడంలో శాస్త్రవేత్తలకు సహకరించింది ఈ కోతులే. మానవుల డీఎన్‌ఏ సీక్వెన్స్‌తో పోలిస్తే వీటి డీఎన్‌ఏ తొంభై మూడు శాతం వరకు ఒకేలా ఉండటం వల్ల వీటిని ప్రయోగశాలల్లో విస్తృతంగా ఉపయోగిస్తుంటారు.నేను స్వతహాగా జంతు ప్రేమికురాలిని. అందుకే జంతువుల మీద జరిపే ప్రయోగాలకు విరోధిని. మనుషులకొచ్చే రోగాలకు మందుల్ని కనుక్కోవడం కోసం నోరులేని జంతువుల్ని హింసించడం దారుణం కదా. జంతువుల శరీరాల్లోకి రకరకాల మందుల్ని పంపించడంవల్ల ఎన్ని దుష్పరిణామాలు ఏర్పడతాయో... ఇలా ప్రతియేటా కొన్ని వేల లక్షల ఎలుకలు, గినీ పిగ్స్, కుందేళ్ళు, పందులు, కోతుల్ని బలివ్వడం రాక్షసత్వం కాక మరేమిటి?ఈ ప్రయోగశాలలో కూడా కోతులు హింసకు గురవుతున్నాయి. 

అయినా మనసుని రాయి చేసుకుని నేనిక్కడ ఉద్యోగంలో చేరడానికి ముఖ్య కారణం స్వార్థమే... కాదనను. కాని, నాకు మరో గత్యంతరం లేదు. నేను చార్జ్‌ తీసుకున్నాక ఇంతకుముందు అనుసరిస్తున్న పద్ధతుల్లో చాలా మార్పులు తీసుకు వచ్చాను. తప్పు చేస్తే, ఇంతక్రితం కోతి శరీరానికి మైల్డ్‌ కరెంట్‌ షాక్‌ ఇచ్చేవారు. నేను కంటెయినర్లో లైట్లు ఆర్పేసి చీకటి చేసే పద్ధతిని ప్రవేశపెట్టాను. కోతులు చీకటిలో అసహనానికి లోనవుతాయి. వాటికి ఆపరేషన్లు చేయడానికి వాడే థియేటర్ని శానిటైజ్డ్‌ కండిషన్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఆపరేషన్‌ తర్వాత గాయాలు ఇన్ఫెక్ట్‌ కాకుండా చూసుకోడానికి అనుభవజ్ఞులైన ఇద్దరు వెటర్నరీ డాక్టర్లను ఏర్పాటు చేయించాను.

పార్కిన్సన్స్‌, ఏడీహెచ్‌డీ, ఆటిజం డిజార్డర్ల గురించి తెల్సుకోవాలంటే మెదళ్లోని ఏ భాగం రోగగ్రస్థం కావడం వల్ల ఆ జబ్బులు సోకుతున్నాయో తెల్సుకోవడం అవసరం. బ్రూనో మెదడు మీద జరుగుతున్న ప్రయోగాల ఉద్దేశం అదే. ఏడాది క్రితం బ్రూనో మెదడుకి శస్త్రచికిత్స జరిగింది. మొదట బ్రూనో తలమీదున్న జుట్టుని షేవ్‌ చేశారు. ఆపరేషన్‌ థియేటర్లోకి తీసుకెళ్ళి, మత్తుమందు ఇచ్చారు.  పుర్రెలో ఎనిమిది చోట్ల చిన్నచిన్న రంధ్రాలు చేసి, వాటిలోకి సన్నటి మెటల్‌ గొట్టాల్ని చొప్పించారు. ఒక ట్యూబ్‌ ద్వారా నీడిల్‌ని పంపించి, గులాబీ బూడిద రంగులో ఉండే గ్రేమేటర్లోకి తక్కువ మోతాదులో టాక్సిన్ని ఇంజెక్ట్‌ చేశారు. దాని ప్రభావం వల్ల మెదళ్లోని ఆ భాగం చెడిపోయి పనిచేయడం మానేస్తుంది. ఆ తర్వాత బ్రూనో ప్రవర్తనలో కలిగే మార్పుల్ని పరిశీలించి రికార్డ్‌ చేయడం జరుగుతుంది.

దానివల్ల పార్కిన్సన్స్‌ లేదా ఏడీహెచ్‌డీ లేదా ఆటిజం లక్షణాలు ఏర్పడకపోతే, మరో భాగంలోకి  టాక్సిన్‌ను ఇంజెక్ట్‌ చేసి, మళ్ళా దాని స్వభావంలో వచ్చిన మార్పుల్ని గమనిస్తారు. పుర్రెలో చేసిన ఎనిమిది రంధ్రాల్ని వినియోగించుకున్నాక కూడా ఆశించిన ఫలితం రాకపోతే, ఆ కోతిని మెర్సీ కిల్లింగ్‌ పద్ధతిలో చంపేసి, లోతైన గుంట తవ్వి పూడ్చిపెట్టేస్తారు. బ్రూనోలో నేను ఆశిస్తున్న ఫలితం రాకపోవడంతో, వారం తర్వాత మెదళ్ళోని మరో భాగంలోకి టాక్సిన్‌ని పంపించి, నెలరోజుల వరకు దాని ప్రవర్తనని గమనించాను. ఫలితం సంతృప్తికరంగా లేకపోవడంతో మరో భాగంలో టాక్సిన్‌ని ఇంజెక్ట్‌ చేశాను.మెదళ్లో ఎనిమిదిచోట్ల ఉన్న టిష్యూలని నాశనం చేశాక కూడా ఆశించిన ఫలితం రాకపోతే? నాకెందుకో చప్పున భయమేసింది. బ్రూనోని కూడా చంపేస్తారు. ఆ ఆలోచనకే వొళ్ళు జలదరించింది. చప్పున కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరిగాయి.
∙∙ 
ఇంటికి చేరుకునేటప్పటికి రాత్రి ఎనిమిదైంది.నాన్నకు రోజూ రాత్రి ఏడింటి లోపలే భోజనం చేయడం అలవాటు. ఆయన సోఫాలో కూచుని టీవీలో వార్తలు వింటున్నాడు. అమ్మ నేనొచ్చే వరకు భోజనం చేయదు.బెడ్రూంలోంచి తుషార్‌ అరుపులు పెద్దపెద్దగా విన్పిస్తున్నాయి.‘‘వాడేం చేస్తున్నాడు లోపల? అన్నం తిన్నాడా?’’ బెడ్రూం వైపు నడుస్తూనే అడిగాను.‘‘వెళ్ళి చూడు. నీకే తెలుస్తుంది. భోజనానికి రెండుసార్లు పిలిచినా రాలేదు’’ అంది అమ్మ.జారవేసి ఉన్న తలుపుని తోసుకుని లోపలికి వెళ్ళాను.ట్రాంపోలీన్‌ మీద ఎగిరినట్టు మంచంమీద వేసి ఉన్న డన్‌లప్‌ పరుపుమీద తుషార్‌ గెంతుతూ అరుస్తున్నాడు.వాడు నావైపు ఓసారి అభావంగా చూసి, మళ్ళా పెద్దగా కేకలుపెడుతూ గెంతడంలో నిమగ్నమై పోయాడు. ఉదయం బైటికెళ్ళిన అమ్మ రాత్రి ఎనిమిదింటికి తిరిగొస్తే ఏ పిల్లాడైనా సంతోషంతో పరుగెత్తుకుంటూ వచ్చి, అమ్మను కౌగిలించుకుంటాడు కదా. నాకా అదృష్టం లేదు.‘‘ఇక చాల్లే నాన్నా. ఆపు. ఆకలి వేయడం లేదా? నాకైతే చాలా ఆకలేస్తోంది. అన్నం తిందాం రా’’ గోముగా అన్నాను.

వాడు నా మాటల్ని పట్టించుకోలేదు.మంచాన్ని సమీపించి, వాడి చేయి పట్టుకుని ఆపుతూ ‘‘పడిపోతావు నాన్నా... కిందికి దిగు’’ అన్నాను.వాడు కోపంతో వూగిపోయాడు. ఒక్క దూకు దూకి హాల్లోకి పరుగెత్తాడు. డైనింగ్‌ టేబుల్‌ మీద ఉన్న వాడి పింగాణీ ప్లేట్‌ని కిందికి విసిరికొట్టాడు. అది శబ్దం చేస్తూ ముక్కలుగా పగిలిపోయింది. వాటర్‌ జగ్‌ని కింద పడేశాడు. నీళ్ళునింపి ఉన్న గాజుగ్లాసుని కూడా విసిరి కొట్టబోతున్న సమయంలో వేగంగా కదిలి, వాడిని గట్టిగా హత్తుకున్నాను. వాడు కొన్ని నిమిషాలు పెనుగులాడాడు. కోపం తగ్గకపో వడంతో రెండు చేతుల్తో గిచ్చాడు. నా చేతిమీద కొరికాడు. భరించాను.కొన్ని నిమిషాల తర్వాత వాడు శాంతించాడు. అమ్మ హాల్‌ని శుభ్రం చేశాక ముగ్గురం భోజనాలు చేశాం. తుషార్‌ బెడ్రూంలోకెళ్ళి ఆడుకోసాగాడు.‘‘ఎందుకు తల్లీ ఈ రోజు చాలా అలజడిగా కన్పిస్తున్నావు?’’ అని అడిగాడు నాన్న. ఆయన గొంతులో ధ్వనించిన వాత్సల్యానికి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

‘‘ఏం లేదు నాన్నా’’ అన్నాను.‘‘తుషార్‌ చేస్తున్న పనిని ఆపినా, అడ్డుకున్నా. వద్దని చెప్పినా వాడు వయొలెంట్‌గా ప్రవర్తిస్తాడని, ఎదుటి వ్యక్తులకు హాని చేయడమో లేకపోతే తనకు తాను హాని చేసుకోవడమో చేస్తాడని మాకు చెప్తూ ఉంటావుగా. ఈరోజు నువ్వు వాడి ట్యాన్‌ట్రమ్స్‌కి కారణమైనావంటేనే తెలుస్తోంది నీ మనసులో ఏదో అలజడి ఉందని. నీ మెదణ్ణి తొలుస్తున్నదేమిటో చెప్పు’’ అన్నాడు.వెళ్ళి నాన్న పక్కనున్న కుర్చీలో కూచున్నాను.‘‘నీ మనసులో చెలరేగుతున్న సంఘర్షణ ఏమిటో వూహించగలను తల్లీ. డ్రగ్‌ టెస్టుల కోసం జంతువుల్ని వాడుకోవడం నీకు నచ్చదు. 

ప్రయోగాల పేరుతో వాటి మీద జరిగే హింసకు నువ్వు పూర్తి వ్యతిరేకివి. కాని, గత నాలుగేళ్ళుగా నువ్వు పనిచేస్తున్న ల్యాబొరేటరీలో నీ కళ్ళముందే కోతుల్ని హింసకు గురిచేస్తుంటే చూస్తూ తట్టుకోలేకుండా ఉన్నావు’’ అన్నాడు నాన్న.నేను మానసికంగా పడ్తున్న హింసని నాన్న ఎంత బాగా అర్థం చేసుకున్నాడో... మనం పడే మూగవేదన ఆత్మీయులకు తెలిసినట్టు వేరేవాళ్ళకి తెలియదు కదా.‘‘అవున్నాన్నా. నా స్వభావానికి విరుద్ధమైన పని చేస్తున్నాను కదా. అందుకే ఒత్తిడికి లోనవుతున్నా’’ అన్నాను.‘‘మానవాళి ఎదుర్కొంటున్న భయంకరమైన రోగాలకు మందులు కనిపెట్టాలంటే కొన్ని జంతువుల ప్రాణాల్ని బలివ్వక తప్పదు కదమ్మా’’ అన్నాడు నాన్న.‘‘తుషార్‌కి ఏడీహెచ్‌డీ సమస్య లేకపోతే, నేనా ల్యాబ్లో చేరేదాన్ని కాదు నాన్నా. పార్కిన్సన్స్, ఏడీహెచ్‌డీ, ఆటిజం డిజార్డర్లను పూర్తిగా నయంచేసే మందులకోసం చేస్తున్న ప్రయోగాలు కాబట్టి వాటిల్లో భాగస్వామిని కాక తప్పలేదు. 

తల్లిని కదా. ఏదో ఆశ... ఏడీహెచ్‌డీకి మందు కనుక్కోగలిగితే నా కొడుకుతో పాటు ఆ జబ్బుతో బాధపడుతున్న లక్షలమంది పిల్లలకు, ఆ భారాన్ని మోస్తున్న వాళ్ళ తల్లులకు ఉపశమనం లభిస్తుందన్న ఆశ.’’‘‘జంతువులమీద పరీక్షలు జరపాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు రకరకాల ప్రత్యామ్నాయ పద్ధతులు అందుబాటులో ఉన్నాయని విన్నానమ్మా. సెల్‌ కల్చర్స్, ఆర్గాన్స్‌ ఆన్‌ చిప్స్‌... ఇవే కాకుండా కంప్యూటర్‌ మోడలింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ని కూడా వాడుకోవచ్చట కదా’’ అన్నాడు‘‘నిజమే నాన్నా. మిగతా అవయవాలకు వచ్చే జబ్బుల విషయంలో ఆర్గాన్స్‌ ఆన్‌ చిప్స్, సెల్‌ కల్చర్‌ లాంటివి బాగా ఉపయోగపడ్తాయి. 

కాని, మెదడుకి సంబంధించిన రుగ్మతల విషయంలో వాటి ప్రయోజనం చాలా పరిమితం నాన్నా.’’‘‘ఎందుకలా? నాకర్థమయ్యేలా చెప్పు’’ అన్నాడు.‘‘విశ్వాంతరాళంలో ఉన్న మనకు అర్థంకాని అనేకానేక రహస్యాల్లానే మెదళ్లోని సంక్లిష్టతలు మానవమేధకు పూర్తిగా అందడం లేదు నాన్నా. ఆకాశంలో కనిపించే కోటానుకోట్ల నక్షత్రాల్లా సూది మొనంత గ్రే మేటర్, వైట్‌ మేటర్‌లలో కోటానుకోట్ల న్యూరాన్లు అల్లుకుని ఉంటాయి. మెదళ్లోని ఒక క్యూబిక్‌ మిల్లీమీటర్‌ టిష్యూని శాస్త్రవేత్తలు స్కాన్‌ చేసే ప్రయత్నం చేశారు. దాని పూర్తి నిర్మాణాన్ని ఒడిసి పట్టుకోడానికి 1.4 పెటాబైట్స్‌ అంత డేటా అవసరమైంది. అర్థమయ్యేలా చెప్పాలంటే అధిక నిడివి గల పధ్నాలుగు వేల సినిమాల సమాచారాన్ని ఇసుకరేణువులో నిక్షిప్తం చేస్తే ఎలా ఉంటుందో అలా అన్నమాట. అందుకే మెదడు సంబంధిత రుగ్మతల్ని నయం చేయడం శాస్త్రవేత్తలకు పెద్ద సవాలుగా మారింది’’ అన్నాను.‘‘పార్కిన్‌సన్స్‌కి, ఏడీహెచ్‌డీకి కొన్ని మందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి కదమ్మా. 

మరి మీ ల్యాబ్లో చేస్తున్న ప్రయోగాలేమిటి?’’ ‘‘అవున్నాన్నా. కొన్ని మందులున్నాయి. వాటివల్ల వ్యాధి తీవ్రత తగ్గుతుంది తప్ప పూర్తిగా నయంచేసే మందులు లేవు. మెదళ్లోని న్యూరోట్రాన్స్‌మీటర్లలో సమతుల్యత లోపించడం వల్ల ఈ రుగ్మతలు ఏర్పడతాయి. కొన్నిచోట్ల మెదడు టిష్యూలు దెబ్బతినడం కూడా కారణం కావొచ్చు. మొదట అవి ఏ ప్రాంతంలో దెబ్బతినడం వల్ల ఈ జబ్బులు ఏర్పడుతున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. మేము చేస్తున్న పని అదే. దెబ్బతిన్న మెదడు కణాల్ని పునరుజ్జీవింపచేసే పరిజ్ఞానంలో శాస్త్రవేత్తలు వేగంగా అడుగులు కదుపుతున్నారు. తొందర్లోనే విజయం సాధిస్తారన్న నమ్మకం ఉంది. అప్పుడు ఇటువంటి న్యూరొలాజికల్‌ డిజార్డర్స్‌ను పూర్తిగా నయం చేయవచ్చు’’ అన్నాను.బెడ్రూంలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయాను. బాగా డస్సిపోయిన భావన... శారీరక శ్రమ ఎక్కువ కావడం వల్ల కాదు, మానసికంగా కుంగుబాటువల్ల కలుగుతున్న అలసట.

తుషార్‌ మంచం చుట్టూ పరుగెత్తుతూ చేతిలో ఉన్న స్కేల్తో వార్డ్‌రోబ్స్‌ మీద, తలుపు మీద దబదబా బాదుతూ శబ్దం చేస్తున్నాడు.
ఎంత అందమైన జీవితాన్ని వూహించుకున్నానో... పీజీలో రాహుల్‌తో ఏర్పడిన పరిచయం కొన్ని నెలల వ్యవధిలోనే ప్రేమగా మారింది. రాహుల్‌ ఓ ప్రైవేట్‌ బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్‌గా పనిచేసేవాడు. నా ఎకౌంట్‌ అదే బ్యాంకులో ఉండటంతో, పనిమీద వెళ్ళిన ప్రతిసారీ రాహుల్‌ నవ్వు ఆత్మీయంగా పలకరించేది. ఎంత అందమైన నవ్వో... మెస్మరైజింగ్‌ స్మయిల్‌... నాకు శ్రమ లేకుండా అన్ని పనులు చేసిపెట్టేవాడు.  నేనంటే అతనికి ఎంతిష్టమో అర్థమవడంతో నేను కూడా ఇష్టపడసాగాను. అందగాడు, మంచి మనసు ఉన్నవాడు, ప్రేమిస్తున్నవాడు, మంచి ఉద్యోగంలో ఉన్నవాడు ... ఇంతకన్నా ఏ ఆడపిల్లయినా ఏం కోరుకుంటుంది? పీజీ పూర్తయిన రెండేళ్ళ తర్వాత రాహుల్‌తో నా పెళ్ళి జరిగింది.
ఎన్ని మధురమైన అనుభవాలో... ఎన్ని తీయటి అనుభూతులో... స్వర్గం అంటే ఇదే కదా అనిపించేది. వసంతం తాకిన వనంలా విరబూసి, మంజుల వీణానిక్వణంలా రవళించి, మకరందం గ్రోలిన మధుపంలా మత్తిలి... జీవితం నిండా ఎన్ని రంగులో... వేనవేల హరివిల్లులు విరిసినట్టు...
తుషార్‌ పుట్టాక జీవితం మరింత శోభాయమానంగా కనిపించసాగింది.
కాని, జీవితంలో సంతోషాల జీవితకాలం తక్కువని తొందర్లోనే తెలిసొచ్చింది.
రాహుల్‌కి అదే బ్యాంకులో పనిచేసే హర్షితతో సన్నిహిత సంబంధం ఉందని తెలిసిన రోజు పెద్ద గొడవైంది.
‘మా ఇద్దరి మధ్య అటువంటి సంబంధం ఏమీ లేదు. ఉత్త పుకారు’ అంటాడనుకుని ఆశపడ్డాను. ఒకవేళ నిజంగానే ఉన్నా, ‘తప్పు చేశాను. క్షమించు. ఇంకెప్పుడూ అటువంటి పొరపాటు చేయను’ అంటూ పశ్చాత్తాప పడతాడనుకున్నాను. సిగ్గులేకుండా ‘అవును. తనంటే నాకిష్టం. హర్షితతో శారీరక సంబంధం ఉన్నమాట వాస్తవమే. అయితే ఏమైంది? నీకేమీ తక్కువ చేయడం లేదు కదా. నిన్నొదిలేసి ఆ అమ్మాయిని చేసుకునే ఉద్దేశం ఏమీ లేదు. జస్ట్‌ ఫర్‌ ఫన్‌. అంతే. దానికింత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావో అర్థం కావడం లేదు’ అన్నాడు.
‘ప్రేమించానని కదా వెంటపడ్డావు. నీ ప్రేమ నిజమైందని నమ్మి కదా పెళ్ళి చేసుకున్నాను. ఇలా చేయడం నమ్మక ద్రోహం కాదా?’ అని అడిగాను.
‘ఇప్పటికీ నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను సౌమ్యా. హర్షితమీద నాకున్నది ప్రేమ కాదు. లస్ట్‌. అంతే. ఆ అమ్మాయికి మరో మూడేళ్ళలో పెళ్ళవుతుంది. అప్పుడు తనెవరో, నేనెవరో! అది టెంపరరీ బంధం. మనది శాశ్వత బంధం డియర్‌’ అంటూ నవ్వాడు.
మొన్నటి వరకు మెస్మరైజింగ్‌గా కనిపించిన నవ్వు ఇప్పుడు మాయలమరాఠీ నవ్వులా వెగటుగా అనిపించింది.
‘నేను కూడా కాపురం నీతో చేస్తూ సెక్స్‌ కోసం మరో మగాడితో సంబంధం పెట్టుకుంటే ఒప్పుకుంటావా?’ అన్నాను.
నా చెంప పగిలేలా కొట్టి, విసురుగా గదిలోంచి బైటికెళ్ళిపోయాడు.
ఇరు కుటుంబాల పెద్దలతో పంచాయతీ జరిగింది.
‘నిన్ను వదుల్తాననడం లేదు కదా. ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదంటున్నాడుగా. కొన్ని రోజులు కళ్ళు మూసుకుంటే, ఆ అమ్మాయి పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతుంది. ఇంత చిన్న విషయానికి ఎందుకు పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటావు’ అంటూ సలహాలిచ్చే వాళ్ళే అందరూ.
ఆ సమయంలో నాకు సపోర్ట్‌గా నిలబడింది మా అమ్మ.
విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించాను.
నాకు విడాకులు మంజూరయ్యే నాటికి తుషార్‌కి మూడేళ్ళు...
వాడికి ఏడాది వయసున్నప్పటి నుంచి రాహుల్‌తో మొదలైన గొడవలు, విడాకుల కోసం కోర్టుల చుట్టూ చేసిన ప్రదక్షిణలు, పడిన పాట్లు, పర్యవసానంగా అనుభవించిన మానసిక హింస... వీటివల్ల నేను తుషార్‌ని సరిగ్గా పట్టించుకోలేదనేది వాస్తవం. వాడి ఆలనాపాలనా అన్నీ అమ్మే చూసుకునేది.
రాహుల్‌తో విడిపోయాక, ప్రశాంతత చిక్కడంతో తుషార్‌ని దగ్గరకు తీసుకునే అవకాశం దొరికింది. అప్పుడు గమనించాను వాడి స్వభావంలో ఉన్న వైపరీత్యాల్ని. ఒకచోట కుదురుగా కూర్చోడు. హైపర్‌ యాక్టివ్‌... మామూలుగా ఆ వయసు పిల్లలు చేసే అల్లరి గురించి నాకు అవగాహన ఉంది. కాని, తుషార్‌ చేసే అల్లరి దానికి రెట్టింపు స్థాయిలో ఉంటోంది. 
ఏమైనా చెప్తుంటే అస్సలు వినడు. చెప్పిన పని చేయడు. పిల్లలతో కలిసి ఆడుకోడు. ఆడే ఆటలో నిమిషాల్లోనే ఆసక్తిని కోల్పోయి మరో ఆట మొదలెడ్తాడు. ఇంపల్సివ్‌గా పనులు చేస్తాడు తప్ప వాటి పర్యవసానాల గురించి ఆలోచించడు. వాడిని నిద్ర పుచ్చడం పెద్ద సమస్య. నిద్ర పట్టినా చాలాసార్లు మధ్యమధ్యలో లేచి కూచుంటాడు. విపరీతమైన అసహనం, కోపం, ఏకాగ్రత లేకపోవడం, చిన్న విషయానికే అతిగా స్పందించడం, నిర్లక్ష్యం, ప్రమాదం జరుగుతుందన్న భయం లేకపోవడం, హింసాత్మక ప్రవర్తన వంటి లక్షణాలు కన్పించడంతో నాలో ఏదో అనుమానం పడగ విప్పసాగింది. నిర్ధారణ కోసం చైల్డ్‌ సైకియాట్రిస్ట్‌కి చూపించాను. 

నా అనుమానం నిజమైంది. తుషార్‌కి ఏడీహెచ్‌డీ సమస్య ఉంది. అటెన్షన్‌ డెఫిషిట్‌ హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌... రాహుల్‌ నాకు చేస్తున్న ద్రోహం గురించి తెల్సినపుడు కూడా ఇంత బాధపడ లేదు. విడాకుల తర్వాత సింగిల్‌ పేరెంట్‌గా మారినపుడు కూడా ఆందోళనకు లోనుకాలేదు. కాని, నా ప్రాణంలో ప్రాణమైన నా కొడుక్కి ఏడీహెచ్‌డీ ఉందని నిర్ధారణ కాగానే అంతులేని దుఃఖంలో కూరుకుపోయాను. రెండేళ్ళపాటు బిహేవియరల్‌ థెరపీ ఇప్పించాను. వాడికిపుడు ఎనిమిదేళ్ళు...ఏడీహెచ్‌డీతో బాధపడే పిల్లలు పెద్దయ్యాక పార్కిన్సన్‌ వ్యాధి బారిన పడొచ్చు. ఎడీహెచ్‌డీకి, పార్కిన్సన్స్‌ వ్యాధికి డోపమైన్‌ అనే న్యూరోట్రాన్స్‌మీటరే కారణం.    
ఆడి ఆడి అలసిపోయి, నాపక్కన పడుకున్న తుషార్‌ మీద లాలనగా చేయివేసి, కళ్ళు మూసుకున్నాను. అనాయాసంగానే కళ్ళలోంచి నీళ్ళు ఉబికుబికి వచ్చాయి.
∙∙ 
బ్రూనో తలకు చేసిన ఎనిమిదో రంధ్రంలోకి టాక్సిన్‌ని పంపించాక, దాని ప్రవర్తనలో వస్తున్న మార్పుల్ని గమనించసాగాను. వారం గడిచేటప్పటికి దానిలో అసహనం, అలజడి స్పష్టంగా కన్పించసాగాయి. ఒకచోట కుదురుగా కూచోవడం లేదు. కంటెయినర్‌లో అట్నుంచిటు అవిశ్రాంతంగా తిరుగుతోంది. తనతోపాటు ఉన్న లిల్లీని కొట్టి కొరికి హింసిస్తోంది. నిద్ర కూడా బాగా తగ్గింది.ఇవన్నీ ఏడీహెచ్‌డీ లక్షణాలు కావడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెదళ్లోని ఏ భాగంలో ఉన్న న్యూరాన్లు దెబ్బతినడం వల్ల ఏడీహెచ్‌డీ ఏర్పడుతుందో కచ్చితంగా తెలియడం వల్ల ఆ డిజార్డర్‌కి రెండు పద్ధతుల ద్వారా శాశ్వత పరిష్కారం కనుక్కోవచ్చు. 

మెదళ్లోని ఆ భాగంలోకి ఏ మందుని పంపించడం వల్ల అక్కడి న్యూరాన్లు పునరుజ్జీవం పొందుతాయో తెలుసుకోవడం ఓ పద్ధతి. ప్రయోగశాలలో అటువంటి మెదడు కణాల్ని ఉత్పత్తి చేసి, ఆ భాగంలో అమర్చడం ద్వారా నయం చేయడం మరో పద్ధతి.
ఏడీహెచ్‌డీతో బాధపడే పిల్లల్ని ఆరోగ్యవంతుల్ని చేయడం కోసం తన శరీరాన్ని పణంగా పెట్టిన బ్రూనో ఇప్పుడు నా కళ్ళకు దేవదూతలా కన్పిస్తోంది.నేను భయపడుతున్న ఘడియలు రానేవచ్చాయి... బ్రూనోని మెర్సీకిల్లింగ్‌కు లోను చేయాల్సిన ఘడియలు... నేను బ్రూనోవైపు జాలిగా చూశాను. ఒకప్పటిలా అది నన్ను గుర్తు పట్టడంలేదు. పెదవుల్ని సాగదీసి నవ్వడం ఎప్పుడో మర్చిపోయింది. దుమికే జలపాతంలా చురుగ్గా కదిలే ఒకప్పటి బ్రూనో కాదిప్పుడు. దాని కదలికల్లోనే కాకుండా, ప్రవర్తనలో కూడా చాలా మార్పులొచ్చాయి. అదిప్పుడు వైద్యశాస్త్ర ప్రరిశోధనలకు పనికిరాని ప్రాణి. 

దాన్ని చంపొద్దని ల్యాబొరేటరీ డైరెక్టర్‌ నీరవ్‌ని బతిమాలుకున్నాను.‘‘చంపకుండా ఉంచడం వల్ల ప్రయోజనం ఏముంది? దాని పోషణకయ్యే ఖర్చు వృథా కావడం తప్ప. అదిప్పుడు రకరకాల మానసిక రుగ్మతలతో బాధపడుతోంది. ఇన్ఫెక్షన్లు తగ్గడానికి దాని శరీరంలోకి ఎన్ని యాంటీబయోటిక్స్‌ పంప్‌ చేశామో గుర్తుందా? వాటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వల్ల దాని అంతర్గత అవయవాలు బాగా దెబ్బతిని ఉంటాయన్న విషయం మీకు తెలుసుకదా’’ అన్నాడు.‘‘బ్రూనో మానవజాతికి చేసిన మేలు ఎలా మర్చిపోగలం? భవిష్యత్తులో ఏడీహెచ్‌డీకి పరిష్కారం కనుక్కుంటే ఆ క్రెడిట్‌ బ్రూనోకే దక్కుతుంది. దానికి మనం ఇచ్చే ప్రతిఫలం ఇదేనా?’’ అన్నాను.‘‘దాన్ని చంపడమే మనం దానికి చేయగల మహోపకారం’’ అన్నాడు.‘‘నాకిచ్చేయండి. నేను పెంచుకుంటాను’’ అన్నాను.

‘‘మీకేమైనా పిచ్చా? రకరకాల మానసిక శారీరక రుగ్మతలతో బాధపడుతున్న బ్రూనోని పెంచడం ఎంత కష్టమో, అందులో ఎంత రిస్క్‌ ఉందో ఆలోచించారా?’’ అన్నాడు.‘‘ఆ విషయంలో నాకు స్పష్టమైన అవగాహన ఉంది. పర్వాలేదు. నా కొడుకు ఏడీహెచ్‌డీతో బాధపడ్తున్నాడని మీకు తెలుసు. అటువంటి కొన్ని లక్షలమంది పిల్లల కోసం అది శారీరక హింసను భరించింది. నేను దానికోసం ఆ మాత్రం కష్టాన్ని భరించలేనా?’’ అన్నాను.నేనతన్ని ఒప్పించి, బ్రూనోని ఇంటికి తెచ్చుకున్నాను.బ్రూనో కోసం వసారాలో ఉన్న ఖాళీస్థలంలో అల్యూమినియంతో చిన్న గదిలా కట్టించాను.రోజూ రాత్రి యింటికి చేరుకునే సమయానికి బెడ్రూంలో తుషార్‌ పెద్దగా అరుస్తూ, మంచం పైనుంచి కిందికి జంప్‌ చేస్తూ గోల చేస్తుంటే, వసారాలో బ్రూనో అల్యూమినియం గదిలో అశాంతిగా, అలజడిగా తిరుగుతూ, కంటెయినర్‌ గోడల్ని చేతుల్తో బాదుతూ శబ్దాలు చేస్తూ ఉంటుంది.ఇప్పుడు మా యింట్లో ఏడీహెచ్‌డీతో బాధపడుతున్న ఇద్దరు పిల్లలున్నారు.
 

∙సలీం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement