కథాకళి: కారణం లేదు | Kathakali Funday Story | Sakshi
Sakshi News home page

కథాకళి: కారణం లేదు

Feb 8 2026 8:48 AM | Updated on Feb 8 2026 8:49 AM

Kathakali Funday Story

ఆ ఫిర్యాదు అందుకోగానే సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ని పిలిచి ఆదేశించాడు.‘‘కొత్తపేటలో ఓ ఇల్లాలు తన భర్తని చంపేసిందని ఫిర్యాదు వచ్చింది. వెళ్ళి చూడు.’’అతను ఓ కానిస్టేబుల్‌తో ఆ చిరునామాకి పావుగంటలో చేరుకున్నాడు. దూరం నుంచే ఆ ఇంటి బయట లైట్‌ స్తంభం వెలుతురులో గుమిగూడిన జనాన్ని చూశారు.  వాహనంలోంచి దిగిన యూనిఫామ్‌లోని ఆ ఇద్దర్ని చూసి జనం పక్కకి తప్పుకున్నారు.‘‘ఫిర్యాదు చేసింది మీలో ఎవరు?’’ ఎస్‌.ఐ. అడిగాడు.

ఒకతను ముందుకి వచ్చి చెప్పాడు.‘‘నేనే. పక్కింట్లో ఉంటాను. వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తూంటే ఇంట్లోంచి అనివర్తిగారి అరుపులు వినిపించాయి. పరిగెత్తుకు వెళ్ళి చూస్తే ఆయన మంచం మీద రక్తసిక్తమై కనిపించాడు. ఆవిడ చేతిలో కత్తి. ఆయన ఎదురుగా కూర్చుని ఆయన్నే చూస్తోంది. ‘ఏమైంద’ని అడిగితే ‘మా వారిని పొడిచాను’ అని చెప్పింది. వెంటనే మీకు ఫోన్‌  చేశాను.’’ఎస్‌.ఐ. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. లోపల మంచం మీది హతుడి చొక్కా రక్తంతో తడిసి, నేల మీద కూడా కొంత మడుగు కట్టింది. ఛాతీలో రెండు చోట్ల గాయాలు కనిపించాయి. ఎదురుగా ఏభై ఏళ్ళ ఆవిడ కూర్చుని ఉంది. మంచం మీద రక్తసిక్తమైన కత్తి ఉంది. ఆవిడ పోలీసుల వంక నిర్లిప్తంగా చూసింది.

‘‘ఈయన ఎవరు? మీకు ఏమవుతారు?’’ ఎస్‌.ఐ. అడిగాడు.‘‘నా భర్త.’’‘‘ఈయన్ని మీరే చంపారా?’’‘‘అవును.’’‘‘ఆ కత్తితోనే పొడిచి చంపారా?’’‘‘అవును.’’‘‘ఎందుకు చంపారు?’’ ఎస్‌.ఐ. ప్రశ్నించాడు.‘‘నాకు తెలీదు.’’‘‘మీకు తెలుసు. కారణం లేకుండా మీరు ఆయన్ని చంపలేరు.’’‘‘ఏమో మరి?’’‘‘ఆయన మీకు తెలీకుండా మరో పెళ్ళి చేసుకోవడం, అక్రమ సంబంధం, ఏ కారణంగానైనా హింసించడం లాంటివి ఏమైనా జరిగాయా?’’‘‘లేవు. ఆయన ఎన్నడూ నా మీద చెయ్యి చేసుకోలేదు.’’‘‘మీరు చంపబోయే ముందు ఏం జరిగింది?’’
‘‘పెద్దగా ఏం జరగలేదు. నేను బాత్‌రూంలోకి వెళ్ళి బయటకి రాగానే ఎందుకో ఆయన మీద కోపం వచ్చి ఉంటుంది. అందుకని పొడిచి ఉంటాను.’’‘‘ఎందుకు కోపం వచ్చిందో గుర్తు తెచ్చుకోగలరా?’’ ఎస్‌.ఐ. అడిగాడు.

పెళ్ళైన కొత్తల్లో అనివర్తి ఆఫీస్‌ నించి ఆలస్యంగా వచ్చాడు.‘‘ఆలస్యమైనప్పుడు ఓ ఫోన్‌  కాల్‌ చేయమని ఎన్నిసార్లు చెప్పాలి? మీ కోసం వండిన ఉప్మా చల్లారిపోయింది. రీహీట్‌ చేస్తే మీరు తినరు.’’అనివర్తి చొక్కా విప్పగానే వీపువైపు చినిగిన బనీన్‌ ని చూసింది.‘‘ఆ చిరుగుల బనీన్‌  వేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నేను మిమ్మల్ని పట్టించుకోవట్లేదని అంతా అనుకుంటారు.’’మరో రోజు. ‘‘స్నానానికి వెళ్తూ మూడు విజిల్స్‌ రాగానే కుక్కర్‌ని ఆఫ్‌ చేయమన్నానా? అన్నమంతా ఎలా పొంగిపోయిందో చూడండి. మీరు ఏ పనీ సరిగ్గా చేయరు.’’‘‘ఇంగువ డబ్బా తేలేదే?’’ అనివర్తి సాయంత్రం షాప్‌కి వెళ్ళొచ్చాక సంచీలోవి కిచెన్‌  ప్లాట్‌ఫాం మీదకి కుమ్మరించి చూసి అడిగింది.

‘‘మర్చిపోయాను.’’‘‘అసలు మిమ్మల్ని పంపించిందే అందుకు కదా?’’‘‘గుర్తు లేదు.’’‘‘న్యూస్‌ పేపర్‌ చదివాక టీవీ కింద షెల్ఫ్‌లో ఉంచమన్నానా? ఫేన్‌  గాలికి అవి ఎలా చిందరవందరగా పడ్డాయో చూడండి.’’‘‘రాత్రుళ్ళు మీ మొబైల్‌ని సైలెంట్‌ మోడ్‌లో ఉంచమన్నానా? టింగ్‌ టింగ్‌మని మెసేజ్‌ అలర్ట్స్‌కి మెలకువ వచ్చి తర్వాత నిద్రపట్టి చావటం లేదు.’’‘‘మనిద్దరికీ డయాబెటిస్‌. ఆ కాజు బర్ఫీ తీసుకురావద్దంటే ఎందుకు తెస్తారు? మీ కౌంట్‌ పోయినసారి టూట్వంటీకి వెళ్ళింది.’’‘‘బాత్‌రూం బయట ఆ పట్టా ఎందుకు వేశారు? దాని కింద బట్ట చిరిగి రబ్బర్‌ బయటకి వచ్చింది. కింద తడికి దాని మీద కాలు వేస్తే జర్రున జారి పడ్డాను. అదృష్టం. నా ఎముకలు విరగలేదు.’’‘‘ఎందుకిలా అనవసరపు ఖర్చులు పెడతారు? కిలో పదహారు వందలు పెట్టి పిస్తా కొనే తాహతు మనకి ఉందా అని ఆలోచించుకోనక్కర్లేదా?’’

ఆ అర్ధరాత్రి అనివర్తి భార్యకి మెలకువ వచ్చింది. లేచి బాత్‌రూంలోకి వెళ్ళింది. ఆవిడకి గుప్పున యూరిన్‌  వాసన వేసింది. పెళ్ళైన కొత్తల్లో తన భర్తకి చెప్పడానికి ఆమె కొంత సిగ్గు పడింది. తర్వాత చెప్పేప్పుడు ఇబ్బందిగా చెప్పింది.‘‘మీరు బాత్‌రూంలో నీళ్ళు చక్కగా చుట్టూ కూడా కొట్టండి.’’వంటగదిలోకి వెళ్ళి కత్తి తీసుకుని వచ్చి నిద్రపోయే భర్త ఛాతీలో రెండుసార్లు బలంగా పొడిచింది. తర్వాత ఎటాచ్డ్‌ బాత్‌రూంలోకి కాక కామన్‌  బాత్‌రూంలోకి వెళ్ళింది. ‘‘లేదు. నేను నా మావారిని చంపడానికి కారణం ఉందనుకోను. నిజానికి కొన్ని కారణాలు ఉన్నా అందులో ఏవీ చంపదగ్గ కారణాలుగా నాకు తోచలేదు. ఎందుకు చంపానో నాకే తెలీదు.’’ ఆవిడ ఎస్‌.ఐ.కి చెప్పింది.  

∙మల్లాది వెంకట కృష్ణమూర్తి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement