ప్యాచెస్‌ కనిపిస్తున్నాయి | Alopecia areata is a hair loss problem and treatment | Sakshi
Sakshi News home page

ప్యాచెస్‌ కనిపిస్తున్నాయి

Feb 8 2026 4:25 AM | Updated on Feb 8 2026 4:25 AM

Alopecia areata is a hair loss problem and treatment

నాకిప్పుడు 24 ఏళ్లు. ప్రస్తుతం డిగ్రీ పూర్తిచేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం సిద్ధమవుతూ ఎక్కువ ఒత్తిడిలో ఉంటున్నాను. ఇటీవల తలపై ఒకటి రెండు చోట్ల గుండ్రంగా జుట్టు పూర్తిగా రాలిపోయిన ప్యాచెస్‌ కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో నొప్పి లేదా దురద ఏమీ లేదు. ఇది ప్రమాదకరమైన సమస్యా? – రాధిక, గుంటూరు
రాధిక గారు, మీరు చెప్పిన లక్షణాలను బట్టి ఇది అలోపేషియా ఎరియాటా అనే జుట్టు రాలే సమస్యగా భావించవచ్చు. ఇది ప్రమాదకరమైన వ్యాధి కాదు. కాబట్టి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మానసిక ఒత్తిడి ఎక్కువైతే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలోపేషియా ఎరియాటా అనేది ఒక ఆటోఇమ్యూన్  సమస్య. ఇందులో మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున జుట్టు మూలాలపై దాడి చేస్తుంది. ఫలితంగా తలపై లేదా జుట్టు ఉన్న ఇతర ప్రాంతాల్లో గుండ్రంగా జుట్టు పూర్తిగా ఊడిపోయిన ప్యాచెస్‌ కనిపిస్తాయి. 

ఇది తలకే కాకుండా కనుబొమ్మలు, వెంట్రుకలు, శరీరంపై ఉన్న జుట్టు, పురుషుల్లో గడ్డం భాగాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. ఈ సమస్యలో జుట్టు మూలాలు పూర్తిగా నాశనం కావు. అందువల్ల సరైన చికిత్సతో జుట్టు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఏ వయసులోనైనా రావచ్చు. అయితే పిల్లలు, యువతలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్యకు ప్రధాన కారణాల్లో మానసిక లేదా భావోద్వేగ ఒత్తిడి, పోషక లోపాలు, వైరల్‌ ఇన్ఫెక్షన్లు, అధిక జ్వరం, శస్త్రచికిత్సల తర్వాత వచ్చే మార్పులు ముఖ్యమైనవి. అలాగే థైరాయిడ్‌ వ్యాధులు, విటిలిగో వంటి ఇతర ఆటోఇమ్యూన్  సమస్యలు ఉన్నవారిలో కూడా ఇది కనిపించవచ్చు. 

ఇది అంటువ్యాధి కాదు. నూనె వాడటం, షాంపూ మార్చడం లేదా తల శుభ్రం చేయకపోవడం వల్ల వచ్చే సమస్య కూడా కాదు. కాబట్టి ఈ విషయంలో అపోహలకు లోనవ్వాల్సిన అవసరం లేదు. సమస్యను నిర్ధారించడానికి చర్మవైద్యులు ప్రత్యేకంగా తల చర్మాన్ని పరిశీలించే పరీక్షలు చేస్తారు. అవసరమైతే రక్త పరీక్షలు కూడా సూచించవచ్చు. రక్తహీనత, ఐరన్  లోపం, థైరాయిడ్‌ సమస్యలు, విటమిన్  డీ లేదా విటమిన్  బి12 లోపాలు ఉన్నాయా లేదా అనేది పరీక్షల ద్వారా తెలుసుకుంటారు. 

చికిత్సలో భాగంగా పోషక లోపాలను సరిచేయడం, తలకు అప్లై చేసే మందులు, అవసరమైతే ప్రత్యేక ఇంజెక్షన్లు వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సరైన చికిత్స ప్రారంభించిన తర్వాత సాధారణంగా ఆరు నుంచి పన్నెండు వారాల్లో జుట్టు మళ్లీ పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా అర్హత గల చర్మవైద్యుణ్ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం కూడా ఈ సమస్యను నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. 

-డా. ఇందిర పవన్‌ఎంబీబీఎస్,ఎండీ, సీనియర్‌ కన్సల్టెంట్‌ డెర్మటాలజిస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement