ప్రేమికుల వారోత్సవాలు
ఒకప్పుడు పెళ్లి అనగానే ‘ఆకాశం దిగివచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి’ అనే పాటందుకునేవారు వధూవరులు. ఏ పెళ్లిలోనైనా పీటలపై కూర్చున్న జంట ఒకే రకం పెళ్లి చీర, ఒకేరకం పట్టు లాల్చీతో కనిపించగానే, సంప్రదాయం ఉట్టిపడేది. పురోహితుడి మంత్రాల దగ్గర నుంచి గట్టిమేళం వరకు ఇంచుమించు ఒకే తీరులో పెళ్లివేడుక నడిచేది. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు ఊహల్లో ఊగులాడుతూ– ఊరంత పందిరినీ, ఊరంతా సందడినీ కోరుకునేవారు. కాని, ట్రెండ్ మారింది. ఇప్పటి యువత ఎక్కువగా స్పెషల్ అండ్ యూనిక్ మ్యారేజెస్‌కే ఓటేస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో సాహసాలను కోరుకుంటున్నారు. శుభాశుభాలను, తిథి నక్షత్రాలను పక్కనపెట్టి, పెళ్లిని వ్యక్తిగత వేడుకగా మార్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి నడుస్తోంది. ఆచారాలు, ఆత్మీయ ఆహ్వానాలు తగ్గిపోయాయి. ఇప్పుడు పెళ్లీడుకొచ్చిన యువత థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం, ట్రెండీ లుక్ కోసం సరికొత్త వివాహ పద్ధతుల జాబితాను సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ట్రెడిషన్ ఫాలోవర్స్ కంటే ట్రెండ్ సెట్టర్స్ ఎక్కువైపోతున్నారు. వైరల్ కావాలనే కుతూహలం కొందరిది; తమ యవ్వనంలోనే ఏదో ఒక ప్రత్యేకతను చాటుకోవాలన్న తాపత్రయం మరికొందరిది; మరపురాని మధుర క్షణాలను సృష్టించుకోవాలన్న ఆరాటం ఇంకొందరిది. ఈ క్రమంలోనే చాలామంది పెళ్లికి సిద్ధమయ్యే యువత– సంప్రదాయాలను పక్కనపెట్టి అనూహ్యంగా ఆలోచిస్తున్నారు. విస్మయకరంగా విచిత్రరీతుల్లో వివాహాలు చేసుకుంటూ ‘ద్యావుడా’ అనిపిస్తున్నారు. తమ పెళ్లి అందరిలా కాకుండా– అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అందరికీ గుర్తుండిపోయేలా ఉండాలని తపిస్తున్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా పెళ్లి మండపాలు– వింత పందిళ్లను వేçస్తూ, విడ్డూరాలకు తెరలేపుతున్నాయి.
పెళ్లి అంటే ప్రమాణం. నీకు నేను, నాకు నువ్వు అనే ప్రమాణం. ఆ ప్రమాణాన్ని ప్రపంచంలోని ఒక్కో ఆచారం– ఒక్కో తంతుతో నిర్వహిస్తుంది. ప్రతి ఆచారంలోనూ పెళ్లి పేరుతో ఏకమైన జంటకు దైవమే సాక్ష్యమంటూ బంధుగణం ఆశీర్వదిస్తుంది. అలాంటి పవిత్రమైన వేడుక రానురాను ట్రెండ్ మార్చుకుంటోంది. కొన్నిసార్లు గతి తప్పుతోంది. మరికొన్నిసార్లు మతులు పోగొడుతోంది.
అడ్వెంచరస్ వెడ్డింగ్స్
‘సంసార జీవితమంటేనే ఓ సాహసం’ అనే అనుభవజ్ఞుల మాటల్ని ఫాలో అవుతున్నారో ఏమో కాని, చాలామంది యువత తమ పెళ్లి జీవితాన్ని అదే సాహసంతో ప్రారంభిస్తున్నారు. అలాంటి అడ్వెంచరస్ వెడ్డింగ్స్ ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. అవేంటో చూద్దాం!
స్కైడైవింగ్ వెడ్డింగ్
అడ్వెంచరస్ వెడ్డింగ్స్‌లో స్కైడైవింగ్‌తో కూడిన బేస్ జంపింగ్ పెళ్లిళ్లు చేసుకుని వైరల్ అవుతున్నాయి కొన్ని కొత్త జంటలు. నిజానికి ఇలాంటి పెళ్లిళ్లు యునైటెడ్ స్టేట్స్‌లోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా, హవాయి, మొజూరి వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. అలాస్కా మంచుదారుల్లో ఇలాంటి సాహసాలు అధికంగా తారసపడతాయి. స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వత ప్రాంతాలతో పాటు ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కూడా ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతుంటాయి. ఆయా ప్రాంతాలన్నీ స్కైడైవింగ్‌తో పాటు బేస్ జంపింగ్ వెడ్డింగ్స్‌కు అనుకూలంగా ఉంటాయి.
నిజానికి ఆస్ట్రేలియా, న్యూజీలండ్ దేశాలు సాహస క్రీడలకు కేంద్రం కావడంతో పాటు– అక్కడ బీచ్‌లు, పర్వతాలు స్కైడైవింగ్‌కి అనుకూలంగా ఉండటంతో ఈ రకమైన వివాహాలు తరచుగా జరుగుతాయి. మరోవైపు యూకేలో కొందరు వధూవరులు పెళ్లి వేదికకు విమానం, స్కైడైవింగ్ చేస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంటారు. 2023లో ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే జంట తమ వివాహ వేడుకను థ్రిల్లింగ్‌గా నిర్వహించుకుని ప్రపంచాన్ని అవాక్ చేశారు.
ఎత్తైన కొండ అంచున పెళ్లి చేసుకుని, వివాహం పూర్తయిన వెంటనే, ఆ కొండ అంచు నుంచి బేస్ జంపింగ్/ స్కైడైవింగ్ చేశారు. అప్పట్లో ఆ వీడియో నెట్టింట భీకరంగా వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఈ ట్రెండ్ 20వ శతాబ్దం ప్రారంభం నుంచి ఉన్నప్పటికీ సోషల్ మీడియా ప్రభావంతో ఈ మధ్యకాలంలోనే త్వరగా పాపులర్ అయ్యింది. దీనితో ప్రపంచవ్యాప్తంగా సాహస ప్రియులైన వ«ధూవరులు– ఈ విధానాన్ని ఎంచుకోవడం మొదలుపెట్టారు.
స్పేస్‌నెట్ వెడ్డింగ్స్
ఈ స్పేస్‌నెట్ వెడ్డింగ్ సాహసానికి పరాకాష్టగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కిమ్ వెగ్లిన్, ర్యాన్ జెంక్స్ అనే జంటను ఈ వివాహానికి ట్రెండ్ సెట్టర్స్‌గా చెబుతుంటారు. వీరు అమెరికాలోని ఉటా రాష్ట్రంలోని మోయాబ్ ఎడారిలో 400 అడుగుల ఎత్తులో లోయ పైభాగంలో కట్టిన స్పేస్‌నెట్‌పై వివాహం చేసుకున్నారు. కిమ్, ర్యాన్ ఇద్దరూ ప్రొఫెషనల్ స్లాక్‌లైనర్లు. వీరు మోయాబ్‌లో జరిగే ప్రసిద్ధ హై–లైనింగ్ ఫెస్టివల్‌లో కలుసుకుని ప్రేమించుకున్నారు. అందుకే, తమ వివాహాన్ని కూడా అదే స్పేస్‌నెట్‌లో చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పదిమంది బేస్ జంపర్లు టూటూ దుస్తులు ధరించి, పారాషూట్లలో పూల రేకులను వదులుతూ ఈ వివాహాన్ని అంగరంగవైభవంగా జరిపారు. ఈ వివాహం 2017లో జరిగింది. అంతకు ముందు పర్పుల్, మిక్కీ అనే మరో జంట మోయాబ్‌లోనే స్పేస్‌నెట్‌పై వివాహం చేసుకున్నట్లు సమాచారముంది. ఇంతటి సాహసం చేసి పెళ్లి చేసుకుంటున్న జంటలు అరుదుగా ఉన్నప్పటికీ ఈ పెళ్లితంతు ప్రపంచ యువత దృష్టిని ఆకట్టుకుంది.
అండర్ వాటర్ వెడ్డింగ్స్
సాహస ప్రియులైన జంటలకు అండర్ వాటర్ వెడ్డింగ్ అనేది తమ ప్రేమలోని లోతును ప్రకటించుకునే ఒక అద్భుత అవకాశం. షాంపేన్ కంటే ఎక్కువ బుడగలతో, ప్రశాంతమైన సముద్రపు అడుగున, రంగురంగుల పగడపు దిబ్బలు, చిన్నాపెద్దా చేపల సాక్షిగా వివాహం చేసుకోవడం ఇవన్నీ ఈ ట్రెండ్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. భారతదేశంలో నీటి అడుగున వివాహాలకు ప్రధాన కేంద్రం అండమాన్ దీవులు. ఇక్కడ హేవ్‌లాక్ ఐలాండ్ ఈ వినూత్న వేడుకలకు వేదికగా మారుతోంది. ఇది దేశంలోనే నీటి అడుగున వివాహాలకు ఆదరణ పొందుతున్న ఏకైక ప్రదేశం. వధూవరులు స్కూబా గేర్ లేదా ఆడియో సిస్టమ్ ఉన్న అండర్ వాటర్ హెల్మెట్‌లు ధరించి నీటి అడుగుకు వెళ్తారు.
ఇక్కడ నోటి మాటలకు బదులు, డైవింగ్ స్లేట్లు ఉపయోగించి ప్రమాణాలు చేసుకుంటారు. అనంతరం ఉంగరాలు మార్చుకుంటారు. అండమాన్ లో ఈ వివాహ ఏర్పాట్లకు ఖర్చు సుమారుగా రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంటుంది. డైవింగ్ మాస్టర్లు, భద్రతా సిబ్బంది, కెమెరామెన్ వివాహం చేసుకోబోయే జంట వెంటే ఉంటారు. నిజానికి అండర్ వాటర్ వెడ్డింగ్స్ గ్లోబల్ ట్రెండ్. అయితే ఈ వివాహానికి మురికి లేని స్వచ్ఛమైన నీరు, పగడపు దిబ్బలు కలిగిన సుందరమైన వాతావరణం ఉండాలి. థాయ్‌లాండ్ ఈ వివాహాలకు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో నీటి అడుగున సామూహిక వివాహాలు జరుగుతాయి. 2001లో క్రాదాన్ ద్వీపంలో 22 దేశాల నుంచి 34 జంటలు ఒకేసారి వైవాహిక జీవితాన్ని ప్రారంభించి, ప్రపంచ రికార్డును కూడా సృష్టించారు.
అక్కడ కొన్ని రిసార్ట్‌లలో ప్రత్యేకంగా నీటి అడుగున వివాహాల కోసం చాపెల్స్ అందుబాటులో ఉంటాయి. కైమాన్ దీవులు, మాల్దీవులు, మారిషస్, ఇండోనేషియా కూడా ఈ డైవింగ్‌కు అనుకూలమైన ప్రాంతాలు కాబట్టి, ఈ ట్రెండ్‌ను అక్కడ కూడా అనుసరిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని ట్రాంగ్ ప్రావిన్స్‌లో 1997లో వార్షిక సామూహిక జలాంతర వివాహ వేడుక ప్రారంభమవడంతో ఈ కాన్సెప్ట్‌కు ప్రపంచవ్యాప్తంగా పెద్ద గుర్తింపు, ప్రజాదరణ లభించింది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ ట్రెండ్ తరచుగా అత్యంత విలాసవంతమైన లేదా సాహసోపేతమైన గమ్యస్థానాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. డైవింగ్ అనుభవం ఉన్న లేదా శిక్షణ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న జంటలు ఈ పద్ధతిలో వివాహం చేసుకోవడానికి ఎగబడుతున్నారు.
హాట్ ఎయిర్ బెలూన్ వెడ్డింగ్స్
నిజానికి చాలామంది జంటలు పెళ్లి ప్రతిపాదనలు చేసుకోవడానికి ఈ హాట్ ఎయిర్ బెలూన్‌ను ఎక్కుతుంటారు. ఈ వివాహం ఆకాశంలో తేలియాడుతూ, భూమిపై అద్భుతమైన దృశ్యాలను చూస్తూ జరుపుకునే సాహస వేడుక. ఈ రకమైన వివాహం– కేవలం వధూవరులు, పూజారి, ఫొటోగ్రాఫర్‌ల సమక్షంలో మాత్రమే జరుగుతుంది. ఈ వేడుకకు పెద్ద బెలూన్ బాస్కెట్ ఉపయోగిస్తారు. ఈ సాహసానికి టర్కీలోని కప్పడోసియా ప్రత్యేకం. అక్కడి రాతి నిర్మాణాలు, లోయలను పైన హాట్‌ఎయిర్ బెలూన్ నుంచి చూస్తే కళ్లు చెదురుతాయి.
దాంతో చాలామంది ఈ వివాహాలను చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు ఈజిప్ట్‌లోని లక్సర్‌లో పురాతన దేవాలయాలు, చారిత్రక కట్టడాల మీదుగా సూర్యోదయాన్ని చూస్తూ బెలూన్ ప్రయాణం చేస్తే అదిరిపోతుంది. అలాగే ఇటలీలోని టస్కనీలో పచ్చని కొండలు, ద్రాక్ష తోటలు, పురాతన కోటల మీదుగా బెలూన్‌పై ప్రయాణించే అనుభూతి చాలా బాగుంటుంది. అందుకే చాలామంది జంటలు ఆయాప్రాంతాల్లో ఈ ప్రయాణం చేస్తూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక భారత్‌లో కూడా ఈ వివాహాల ట్రెండ్ పెరుగుతోంది. సాధారణంగా హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌లు జరిగే ప్రదేశాలలోనే ఈ వివాహాలను ప్లాన్ చేసుకుంటారు. ముఖ్యంగా రాజస్థాన్ (జైపూర్), గోవా ఈ జాబితాలోకి వస్తాయి.
హాట్ ఎయిర్ బెలూన్ చరిత్ర 18వ శతాబ్దంలోనే కనిపిస్తుంది. మొట్టమొదటి మానవ ప్రయాణంతో కూడిన హాట్ ఎయిర్ బెలూన్ విమానం, 1783 నవంబర్ 21న ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ప్రయోగించారు. ఆధునిక, సురక్షితమైన ప్రొపేన్ బర్నర్‌లు కలిగిన హాట్ ఎయిర్ బెలూన్ లు 1950ల చివరలో అభివృద్ధి చెందాయి. అప్పటి నుంచి, బెలూనింగ్ ఒక వినోద కార్యక్రమంగా, ఆపై ఒక రొమాంటిక్ వేదికగా మారింది.
డెస్టినేషన్ వెడ్డింగ్స్ ట్రెండ్ పెరిగిన తరువాతే, హాట్ ఎయిర్ బెలూన్ లలో వివాహాలు కూడా క్రమంగా మొదలయ్యాయి. అంటే, సాంకేతికంగా బెలూన్లు చాలా పాతవి అయినప్పటికీ, వాటిలో వివాహాలు జరుపుకోవడం అనేది కొత్త ట్రెండ్ అనే చెప్పుకోవాలి. భారత్‌లో, కొన్ని కొత్త జంటలు వివాహ వేడుక పూర్తయిన తర్వాత పుట్టింటి నుంచి అత్తింటికి కారుకు బదులుగా హాట్ ఎయిర్ బెలూన్ లో ప్రయాణిస్తూ వైరల్ అవుతున్నారు.
మంచుశిఖరాల్లో..
ఎవరెస్ట్ శిఖరం పైన, మంచుతో నిండిన అంటార్కిటికాలో, మంచు ఎడారులలో లేదా అడవుల లోపల వివాహాలు సాహసోపేతమైన ట్రెండ్ కూడా ప్రస్తుతం నడుస్తోంది. ఈ రకమైన వివాహాలకు అతిథులు చాలా తక్కువ మంది ఉంటారు. లేదా అసలు ఉండరు.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (నేపాల్)– ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన వివాహ వేదికలలో ఇదొకటి. ఇక్కడ చాలామంది యువత పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.అంటార్కిటిక్ క్రూయిజ్–భూమిపై అతి తక్కువ మంది అడుగుపెట్టిన ప్రదేశాలలో ఒకటి అంటార్కిటిక్ ఖండం. అయితే ఇప్పటి ట్రెండీ యూత్‌కి అటుగా ప్రయాణించే క్రూజ్ షిప్స్ కూడా వివాహ వేదికలే. పెంగ్విన్స్, మంచు దిబ్బల మధ్యలో తీరానికి దగ్గరల్లో క్రూయిజ్ నుంచి ఒక చిన్న పడవలోకి మారతారు. అందులో తీరానికి చేరుకుని అక్కడ వివాహం చేసుకుంటున్నారు.
ఎడారుల్లో..
ఎడారి పెళ్లిళ్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండీగా మారిన సాహసోపేతమైన వివాహ వేడుకల్లో ఒకరకం. కాలిఫోర్నియా, జోషువా ట్రీ, పామ్ స్ప్రింగ్స్ వంటి ప్రదేశాల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే అరిజోనా, దుబాయ్ ఎడారిలో లగ్జరీ రిసార్ట్‌లు లేదా ప్రైవేట్ క్యాంపుల్లో విలాసవంతమైన వివాహ వేడుకలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక భారత్‌లోని రాజస్థాన్‌లో జైసల్మేర్, జోధ్‌పూర్ వంటి నగరాల్లోని ప్యాలెస్‌లు, డెసర్ట్ క్యాంపులు వివాహవేదికలుగా నిలుస్తున్నాయి. ఇలాంటి చోట్ల పగటిపూట వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సూర్యాస్తమయం సమయంలో లేదా నక్షత్రాల కింద రాత్రిపూట ఈ వివాహాలు ఎక్కువగా జరుగుతుంటాయి.
‘హడలెత్తించే’ పెళ్లిళ్లు
ప్రస్తుత పెళ్లిళ్ల నిర్వహణలో సంప్రదాయాలకు ఆధునికత, వ్యక్తిగత ఆశలు తోడై– కొత్త ధోరణులు పుట్టుకొస్తున్నాయి. సాంప్రదాయ వివాహ వేదికలకు బదులుగా, కొంతమంది జంటలు తమ వైవాహిక జీవితంలో కొత్త సాహసాన్ని కోరుకుంటూ అసాధారణమైన ప్రదేశాలను ఎంచుకుంటున్నారు.
వనాల మధ్యలో..
దట్టమైన అడవిలో లేదా పచ్చని చెట్ల తోటల్లో వివాహం చేసుకోవడం ఇప్పుడు యువత మెచ్చిన ట్రెండ్‌లో ఒకటి. ఈ ఫారెస్ట్ వెడ్డింగ్స్ కాలిఫోర్నియా, యోసెమిటీ నేషనల్ పార్క్‌లో పొడవాటి చెట్లు, గ్రానైట్ కొండల మధ్య పెళ్లి చేసుకోవడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కెనడాలోని కొలంబియా కూడా ఇలాంటి పెళ్లిళ్లకు పందిళ్లు వేస్తోంది. ప్రపంచ యువతను ఆకర్షిస్తోంది. ఇక భారత్‌లో ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్, కర్ణాటకలోని కూర్గ్, కబిని వంటి ప్రాంతాల్లో ఈ పెళ్లిళ్లు అధికంగా జరుగుతున్నాయి.
హాంటెడ్ వెడ్డింగ్స్
కొన్ని దేశాల్లో, ముఖ్యంగా హాలీవుడ్ థీమ్‌ల ప్రభావంతో, దయ్యాల కోటలు, పాత జైళ్లు, పాడుబడిన పట్టణాలు లేదా చారిత్రక శ్మశానవాటికల పక్కన వివాహాలు చేసుకుంటున్నారు. సంప్రదాయ వివాహాలకు భిన్నంగా, తమ ప్రత్యేకతను చాటుకోవాలనుకునే జంటలు ఇలాంటి ప్రత్యేక వేదికలను ఎంచుకుంటున్నారు. హారర్ సినిమాలు, హడలెత్తించే నవలలు, హాలోవీన్ థీమ్‌ల పట్ల ఆసక్తి పెరగడంతో ఈ రకమైన వివాహాలు ప్రాచుర్యం పొందాయి. పాత కోటలు, పాడుబడిన భవనాలు వేదికలుగా మారి, దయ్యాల కథలు జతచేర్చి చిత్రవిచిత్రమైన అనుభవాన్నిస్తాయి. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఇతర యూరోపియన్ దేశాల్లో ఈ ధోరణి
ఎక్కువగా కనిపిస్తుంది.
కొలరాడోలోని ‘ది స్టాన్లీ హోటల్’– ‘ది షైనింగ్’ నవలకు స్ఫూర్తినిచ్చిన ప్రదేశం, ఇక్కడ దయ్యాలు తిరుగుతాయని చాలామంది నమ్ముతారు. ఈ ప్రాంతాన్నే వివాహ వేదికగా మార్చుకుంటున్నారు చాలామంది వధూవరులు.
కాలిఫోర్నియాలో పర్మనెంట్‌గా డాక్ చేసిన ‘ది క్వీన్ మేరీ’ అనే లగ్జరీ నౌకలో ఒకప్పటి సిబ్బంది, ప్రయాణికులంతా దయ్యాలుగా మారారని, అక్కడే సంచరిస్తున్నారని స్థానికుల నమ్మకం. హడలెత్తించే ఈ ప్రాంతం కూడా వివాహ వేదికే. ఇక కాలిఫోర్నియాలో చారిత్రక గోస్ట్ టౌన్ లోని పాత చర్చిలు లేదా ఆయా పరిసరప్రాంతాలు యువతను పెళ్లి చేసుకోమని ఆహ్వానం పలుకుతున్నాయి. ఇలాంటి ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి.
భారతదేశంలో పాత మిల్లులు/పాత భవనాలు
కొన్ని ఈవెంట్ సంస్థలు పాత మిల్లులు లేదా పాడుబడిన భవనాలను థీమ్‌డ్ డెకరేషన్‌తో వివాహ వేదికలుగా మారుస్తున్నాయి. అందులోనే వివాహాలు చేసుకోవడానికి యువత ఇష్టపడుతున్నారు.
‘సోలో వెడ్డింగ్స్’
తమ సంతోషానికి మరొకరిపై ఆధారపడకుండా, తమ జీవితాన్ని తామే నియంత్రించుకుంటామని ప్రకటిస్తూ.. చాలామంది యువత– సోలో వెడ్డింగ్స్‌కి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది అన్నింటికంటే ప్రత్యేకమైన ట్రెండ్. పెళ్లి చేసుకోమని ఇతరులు ఒత్తిడి చేస్తున్నప్పుడు, తమ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి తామేనని చెప్పుకోవడానికి కొందరు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ సోలో పెళ్లిళ్లు కూడా సంప్రదాయ పెళ్లిళ్లకు మాదిరిగానే అంగరంగ వైభవంగా, అతిథులతో, కేక్‌తో, రిసెప్షన్ తో జరుగుతాయి. కాని, పార్టనర్ మాత్రమే ఉండరు. ఈ వివాహాలు ప్రస్తుతం జపాన్‌లో ఎక్కువగా జరుగుతున్నాయి.
పెళ్లి అనేది ట్రెడిషనల్ ట్రాక్ నుంచి ట్రెండీ ట్రాక్ ఎక్కి చాలాకాలమే అయింది. కొన్ని వెడ్డింగ్స్ ‘అరే భలే జరిగాయి కదా!’ అనిపిస్తుంటే, కొన్ని వెడ్డింగ్స్ మాత్రం ‘అరే పాపం, ఎందుకురా ఇంత కష్టం.. ఏంట్రా ఈ పిచ్చి?’ అనిపించక మానడం లేదు!
చైనా వినూత్న ప్రయత్నం..
చైనా ప్రభుత్వం తగ్గుతున్న జననాల రేటును అరికట్టడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. అక్కడి పెళ్లి నిబంధనలను సరళతరం చేసింది. పలు సంప్రదాయేతర ప్రదేశాలలో పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలను, వివాహ వేదికలను ఏర్పాటు చేసింది. సబ్‌వే స్టేషన్ దగ్గర నుంచి నైట్ క్లబ్స్ వరకూ జనసంచారం ఉన్న ప్రతిచోట పెళ్లి బూత్‌లను ప్రారంభించింది. దాంతో అక్కడ పెళ్లి చేసుకునే ట్రెండ్ క్రమంగా మారుతోంది. సంప్రదాయ పద్ధతుల్లో కాకుండా ట్రెండ్‌ని కోరుకునే యువత ఈ విధానానికి అట్రాక్ట్ అవుతోంది.
సంహిత నిమ్మన


