డా. ప్రభాకర్ జైని
ఈ మధ్య రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నిద్రమాత్ర కూడా పని చేయడం లేదు. ఏదైనా నవలో, కథో చదువుకుందామంటే కుదరదు. లైట్ వేస్తే, మా ఆవిడ చిరాకు పడుతుంది. పాపం తనకు కూడా నాలాగే వార్ధక్యం ముంచుకొచ్చింది. ఎప్పుడో గాని ఆమెకు నిద్ర పట్టదు. ఆ సమయంలో నేనే డిస్టర్బ్ చేయకూడదు. ఈ రోజు కూడా అంతే!
మెల్లిగా లేచి బాల్కనీలోకి నడిచాను. నగర సుందరికి కూడా నాలాగే నిద్ర పట్టడం లేదేమో! రోడ్లన్నీ కదులుతున్న వాహనాల లైట్ల వల్ల దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. చిన్నప్పుడు మా నాన్న చిటికెన వేలు పట్టుకుని వచ్చినప్పుడు విస్తుపోయి చూశాను, నగర సౌందర్యాన్ని. అప్పటి నుండి చూస్తున్నాను నగరం ఎప్పుడూ యవ్వనంలోనే ఉంది. ఏ నగరానికీ ఎప్పుడూ వార్ధక్యం రాదు, మనుషుల్లాగా, నాలాగా! నేను వార్ధక్యంలోకి వచ్చాను గాని, తరతరాలుగా నగరాలు యౌవ్వనంగానే ఉంటాయి.
నాకైతే శరీరానికి వచ్చిన ఈ ముసలితనం అస్సలు నచ్చడం లేదు. ఇవ్వాళ మరీ ఘోరం! మంచినీళ్ళు తాగుదామని, మంచం పక్కనే ఉన్న నీళ్ళ సీసాను చేతుల్లోకి తీసుకుని, ఎంత ప్రయత్నించినా, దాని మూత తీయలేకపోయాను. చేతులు వణుకుతున్నాయి. చేతుల్లో బలం లేకుండా పోతుందేమో? నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నాను, మరీ ఇవ్వాళే ఎందుకిలా? రోజురోజుకి... మొన్నటికి మొన్న టాబ్లెట్ షీటు నుండి, అల్యూమినియం ఫాయిల్ తుంచి టాబ్లెట్ తీసుకోవడానికి, కత్తెరను ఉపయోగించాల్సి వచ్చింది. నా చేతులు నాకు అన్యాయం చేస్తున్నాయా? నా చేతులను చూసుకున్నాను. నాకేం తేడా కనిపించడం లేదు. కాని, ఎందుకిలా?... నా కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు తెలుసు చేతులు వణుకుతున్నాయంటే అది పార్కిన్‌సన్ వ్యాధి లక్షణమని. అప్రయత్నంగానే, నా చేతుల్లో ముఖాన్ని దాచుకుని భోరున ఏడ్చాను. వృద్ధాప్యం మనిషిని ఇంత డొల్లగా మార్చేస్తుందా?
నా రెండు చేతులు, నా వేళ్ళు మామూలివి కాదు. అందరూ కాళ్ళ మీద పరిగెడితే, నేను నా చేతి వేళ్ళ మీద పరిగెత్తాను. అటువంటి నా చేతులు బలహీనంగా, దీనంగా మారుతున్నాయా? నా చేతులూ, వేళ్ళూ నన్నింత మోసం చేస్తాయనుకోలేదు.
ఆ చేతులను చూస్తూ ఉంటే, మనసు ఒక దృశ్యం వైపు పరిగెత్తుతుంది.
నా చదువు మధ్యలో ఉండగానే, మా నాన్న చనిపోయాడు. నడి సముద్రంలో, లంగరు లేని పడవలా, మా బతుకులు అల్లకల్లోలం అయిపోయాయి. కారుణ్య నియామకం కింద దిగువ శ్రేణి గుమాస్తాగా ప్రభుత్వం నన్ను నియమించింది. నేను ఏప్రిల్ 1975 లో ఉద్యోగంలో చేరాను. తినడానికి తిండి దొరికింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ సంతోషంగా ఉన్నారు. నాన్న లేడన్న మాటే గాని, రోజులు యథావిధిగా నడుస్తున్నాయి.
ఒక్క రెండు నెలలు గడిస్తే నా బీయస్సీ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయ్యేవి. కాని, ఎవరికీ దాని గురించి, నా గురించి పట్టింపే లేదు. నన్ను నరకకూపంలోకి తోసి, వాళ్ళంతా హాయిగా ఉన్నారు. కాని, మా నాన్న మరణించిన ఆఫీసులో, ఆయన కూర్చుని ప్రాణం వదిలిన కుర్చీలోనే కూర్చొని, పని చేయడం నాకు మాత్రం ప్రతి దినం ప్రాణగండంగా ఉండేది.
అలా, పంతొమ్మిదేళ్ళ వయసులో ఉన్న నేను మాత్రం లోలోపలే దహించుకు పోయేవాడిని. భవిష్యత్తు గురించి నేను కన్న కలలన్నీ దగ్ధమయిపోయాయి. నాకు మెడిసిన్‌లో సీటు వచ్చినా, నన్ను చదివించలేనని మా నాన్న బాధపడుతుంటే, నేనే ‘ఫర్వాలేదు నాన్నా! బీయస్సీలో చేరుతాను.’ అని ఓదార్చాను. బీయస్సీ తర్వాత యమ్మెస్సీ, అటు తర్వాత కెమిస్ట్రీలో రీసెర్చి చేయాలనీ, లేదా యంబీఏ చేయాలనీ ఎన్నో ఆశలుండేవి. అవన్నీ ఇప్పుడు అందని ద్రాక్షలే! కనీసం బీయస్సీ అయినా పూర్తి చేయగలనా లేదా అన్నదే, ప్రస్తుతం నన్ను పీడిస్తున్న సమస్య.
నేను రెండు నెలలు సెలవు పెట్టి బీయస్సీ పరీక్షలు రాస్తానంటే ఇంట్లో, బయటా, ఆఫీసులో ఎవ్వరూ ఒప్పుకోలేదు. ఎందుకంటే, నేను సెలవు పెట్టినన్ని రోజులకు జీతం రాదు, అదీ వాళ్ళ బాధ. అలా అందరూ కట్టకట్టుకుని వద్దనే సరికి నాలో మరింత పట్టుదల పెరిగింది. నేను సెలవు పెట్టే తీరుతాననుకున్నాను. అలాగే చేసి, బీయస్సీ పరీక్షలు రాశాను.
మొదటి నుంచీ మా నాన్న చెప్పిన ఒక్క సూత్రాన్నే నేను పాటించే వాడిని. పదిసార్లు చదివిన దాని కన్నా ఒకసారి రాయడం వల్ల విషయం గుర్తుంటుందనే వాడు. అందుకే పరీక్ష సమయానికి గంట ముందు వరకు నేను సమాధానాలు రాస్తూ ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే, ఈ పరీక్షలు నాకు జీవన్మరణ సమస్య. ఇప్పుడు బీయస్సీ పాస్ కాకపోతే మళ్ళీ రాసే ఓపికా ఉండదు, వీలు కలగదని నాకు తెలుసు. అందుకే, నా మెదడును నా వేళ్ళల్లో నింపి, ప్రాక్టీసు చేశాను. ఎందుకంటే నాకు ప్రిపరేషన్‌కు ఉన్న సమయం చాలా తక్కువ. మిగిలిన సహాధ్యాయులకున్న ప్రిపరేషన్ లగ్జరీ నాకు లేదు. ఉద్యోగం చేస్తూనే చదువుకోవాలి. రాసుకోవాలి. పరీక్షలు రాయాలి.
ఆరు పేపర్లకు ఉన్న మూడు గంటల పరీక్షలను అలవోకగా రాశాను. బీయస్సీ మంచి మార్కులతో పాసయ్యాను. అతి సులభంగా లభించవలసిన విజయం, నాకు అతి కష్టం మీద లభించింది. అయినా కష్టానికి తగిన ఫలితం దక్కింది. నాన్న మరణంతో నేను చాలా కృంగిపోయాను. గుండు చేయించుకోవడంతో న్యూనతభావం నన్ను మరింత దిగజార్చింది. అంతకు ముందు వరకు కాలేజీలో యాక్టివ్‌గా ఉండే నేను, ఒక శిక్ష పడ్డ దోషిలా తలవంచుకుని ఒక మూలలో నిలబడేవాణ్ణి.
అటువంటిది నేను బీయస్సీ పాస్ కావడం, కెమిస్ట్రీలో యూనివర్సిటీ రాంక్ రావడంతో నా మీద నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. మా కెమిస్ట్రీ లెక్చరర్లు నన్ను యంయస్సీ చేయమనీ, లెక్చరర్లంతా కలిసి ఫీజులు కడతామని ఎంతగానో చెప్పారు. కాని, నేను ఆల్రెడీ ఒక భారాన్ని, అవమానాన్ని మోస్తూ బతుకునీడుస్తున్నాను. దానికి అదనంగా మరొకరి దయాదాక్షిణ్యాలను భరించే శక్తి లేదు నాకు. లెక్చరర్లు, యూనివర్సిటీ ఖర్చులు భరించినా, నా మీద ఆధారపడిన నా కుటుంబ సభ్యుల కడుపులు నింపవలసిన బాధ్యతను నేను మరవలేను కదా? అయితే, ఆ పరీక్షలతోనే నా చేతులకు, నా చేతి వేళ్ళకు ఉన్న శక్తి తెలిసింది.
అంతకంటే, ముఖ్యంగా నా శక్తి మీద నాకు నమ్మకం కలిగింది. ఎన్ని సమస్యలున్నా, ప్రతికూల పరిస్థితులు ఉన్నా పరీక్షా సమయంలో అవేవీ నా ఏకాగ్రతను భంగం చేయలేకపోయాయి. నా చేతి వేళ్ళే నా ఆయుధాలుగా మార్చుకుని, జీవితంలో మరో పోరాటానికి సమాయత్తమయ్యాను.
1970, 80 దశకాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కువగా ఎంప్లాయిమెంట్ ఎక్సే్ఛంజ్‌ల ద్వారానే జరిగేవి. నేను కూడా నా పేరు నమోదు చేసుకున్నాను. బీయస్సీ గ్రాడ్యుయేట్ అంటే అప్పట్లో కొంత గౌరవం ఉండేది. కాని, మామూలు క్లరికల్ ఉద్యోగాలకు, పదవ తరగతి మాత్రమే విద్యార్హత కాబట్టి, విపరీతమైన పోటీ ఉండేది. అది కూడా సీనియారిటీని బట్టే పిలుపు వస్తుంది. ఎక్సే్ఛంజ్ ముందు నోటీసు బోర్డులో, ఏయే ఆఫీసుల్లో ఏయే ఖాళీలు ఉన్నాయో లిస్టులు పెట్టేవారు. అలా చాలా రోజుల నుంచి ఆ బోర్డులో పెట్టి ఉన్న ఒక నోటీసు నన్ను ఆకర్షించింది. అది కలెక్టర్ కార్యాలయంలో, స్టెనోగ్రాఫర్ పోస్టుకు సంబంధించిన నోటీసు. ఎంక్వైరీ చేస్తే అది నిజమేనని డిగ్రీ, టైప్ హయ్యర్, షార్టుహ్యాండ్ లోయర్ పాస్ ఉంటే అర్హత లభిస్తుందని చెప్పారు. ‘మరి ఇన్ని నెలల నుంచి నోటీసు బోర్డులో ఉంది. అభ్యర్థులు రావడం లేదా?’ అన్న నా ప్రశ్నకు ‘ఈ రోజుల్లో షార్టుహ్యాండ్ పాసయిన వాళ్ళు ఖాళీగా ఉంటారా ఏంటీ? షార్టుహ్యాండ్ పరీక్ష పాస్ కాగానే వారి కోసం ఉద్యోగాలు రెడీగా ఉంటాయి. వాళ్ళు అక్కడ చేరిన తర్వాత, ఆ సర్వీస్ వదులుకుని కొత్త పోస్టులోకి ఎందుకు వస్తారు?’ అని చెప్పారు.
నేను ఆలోచనల్లో పడ్డాను. మా నాన్న బతికున్న రోజుల్లో బలవంతాన టైపురైటింగులో చేర్పించడంతో, నేను టైప్ హయ్యర్ పాసయ్యాను. అలాగే, ఎక్కడో ఉచిత షార్టుహ్యాండ్ కోచింగ్ అంటే అందులో చేరి అరవయ్యవ ఎక్సర్ సైజు వరకు నేర్చుకున్నాను. కాని, టెక్నికల్ బోర్డు పరీక్షలు రాయలేకపోయాను.
స్టెనో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న విషయం తెలిసినప్పటి నుండి నాలో ఒక నూతనోత్సాహం పెరిగింది. స్టెనో ఉద్యోగం పెద్దదేమీ కాకపోవచ్చు. కానీ, ఈ కారుణ్య నియామకం అన్న పదమే నచ్చడం లేదు. నాన్న చనిపోయిన సీట్లో కూర్చుని, ఆయన డీల్ చేసిన ఫైళ్ళలో నోట్ రాయడమంటే, నాకు నరకం కనిపిస్తుంది. ఇటువంటి సున్నితమైన విషయాలను ఎవ్వరూ అంత సులభంగా అర్థం చేసుకోరు. కాని, నా భార్య మాత్రం నన్ను ప్రోత్సహించింది. రోజువారీ కుటుంబ బాధ్యతలను చేపట్టడానికి మా ఇంటికి కోడలు కావలసి వచ్చింది. అలా ఇంటికి పెద్దవాడిగా నా పెళ్ళైంది. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒక అనంత సాగరంలో, కాగితపు పడవ మీద, సంసారాన్ని నెట్టుకొస్తున్నాను.
షార్టుహ్యాండ్ పరీక్ష వివరాలు తెలుసుకున్నాను. కాని, ఇన్‌స్టిట్యూట్లలో చేరి పరీక్ష రాయడానికి సంవత్సరం పడుతుందన్నారు. కాని, నా కంత టైము లేదు.
నాకు ఆల్రెడీ అరవై ఎక్సర్ సైజు వరకు నేర్చుకున్న అనుభవం ఉంది. దేవుణ్ణి తలచుకుని, ప్రాక్టీస్ మొదలు పెట్టాను.
షార్టుహ్యాండ్ ప్రాక్టీసు కోసం ముఖ్యంగా కావలసినవి ప్రశాంతమైన, నిశ్శబ్దంగా ఉండే రూము, డబుల్ లైనులో ఉండే ప్రత్యేకమైన నోట్ బుక్స్, పెన్సిళ్ళు. ఒకటి, రెండున్నరేళ్ళ వయసున్న మా అమ్మాయిలను, నా భార్య గొడవ చేయకుండా చూడడం వలన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. నేను షాపుల్లో దొరికే ఖరీదైన షార్టుహ్యాండ్ నోటు బుక్కులు కొనలేని పరిస్థితి. కాబట్టి, తెల్ల కాగితాలు, అర ఠావు, పావు ఠావు అని అప్పట్లో హోల్ సేల్‌గా దొరికేవి. అవి తెచ్చి కట్ చేసి, నోటు బుక్కులుగా కుట్టించేది నా భార్య. పెన్సిళ్ళు మాత్రం కొనాల్సిందే. ఎందుకంటే, షార్టుహ్యాండులో రాసే స్ట్రోక్స్ కొన్ని లైట్ కలరులో కొన్ని చిక్కటి కలరులో రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, గీత మీద లైటు కలరులో ఏటవాలుగా ఒక పావు ఇంచు గీత లైట్ కలరులో రాస్తే ‘పి’ అనీ, దాన్నే ‘పే’ గా కూడా చదువుకోవచ్చు. అదే ఒత్తుగా రాస్తే ‘బి’ అనీ; అదే ‘బే’ కూడా అవుతుంది. అందుకని మంచి పెన్సిళ్ళు ముఖ్యం.
ఆయుధాలన్నీ సర్దుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాను. అది మామూలు ప్రాక్టీసు కాదు. ఒక మహా యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టుగా ప్రాక్టీస్ మొదలయింది. లక్ష్యం తొంభై రోజుల్లో జరిగే షార్టుహ్యాండ్ లోయర్ స్పీడ్ ఎగ్జామ్. నిముషానికి 80 పదాల డిక్టేషన్ తీసుకుని, ఆ వ్యాసాన్ని ఇంగ్లీషులోకి లిపిబద్ధం చేసి, రాసి చూపించాలి.
నేను ప్రభుత్వ ఉద్యోగంలో ఐదారేళ్ళు క్లర్కుగా పనిచేశాను కాబట్టి, నాకు డ్రాఫ్టింగ్ పట్ల అవగాహన ఉంది. ఇంగ్లీష్ భాషలో వాక్య నిర్మాణం, వ్యాకరణం, పంక్చుయేషన్ మార్కుల గురించిన పరిజ్ఞానం, నాకు షార్టుహ్యాండ్ పరీక్షకు బాగా ఉపయోగపడింది.
నేను ప్రాక్టీస్ మొదలు పెట్టిన పది రోజులకు నాకు ఒక విషయం అవగతమయింది. షార్టుహ్యాండులో, అవతలి వ్యక్తి ఇచ్చిన డిక్టేషన్ ను రాసుకుని, ఇంగ్లీషులోకి ట్రాన్‌స్క్రైబ్ చేయడమే ముఖ్యం. అందుకోసం షార్టుహ్యాండ్ స్ట్రోక్సే అవసరం లేదు. ఉదాహరణకు, ఒక డిక్టేషన్‌లో ’హైదరాబాద్’ అనే పదాన్ని స్ట్రోక్‌లో రాయడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఆ స్ట్రోక్ రాసే బదులు ’ఏ’ అని రాసుకుంటే సరిపోతుందని నాకనిపించింది. అట్లాగే చెబుతున్న డిక్టేషన్‌లోని సబ్జెక్టును బట్టి, ‘పార్లమెంట్’ అని వస్తే, ‘పీ’ అని రాసుకుంటే, తర్వాతి పదాలను సులువుగా రాసుకోవచ్చని నాకర్థమయింది. అయితే అందుకు ఇంగ్లీషు భాష మీద కొంచెం అవగాహన ఉండాలి. ఇంగ్లీషు వార్తాపత్రికలు చదివితే, ఆ పరిఙ్ఞానం వస్తుంది.
నేను రోజుకు ఇరవై గంటలు ప్రాక్టీస్ చేసేవాణ్ణి. తిండీ తిప్పలు పట్టించుకోలేదు. బాత్రూములో ఉన్నా పదాలను షార్టుహ్యాండులో వేళ్ళ మీద ప్రాక్టీస్ చేసేవాణ్ణి. బొటన వేలితో మిగిలిన వేళ్ళ మీద స్ట్రోక్స్ రాసేవాణ్ణి. కళ్ళ ముందు ఏ వస్తువు కనబడ్డా, ఏ మనిషి కనబడ్డా ఆ పేర్లను వేళ్ళ మీద షార్టుహ్యాండులో రాసే ప్రయత్నం చేసేవాణ్ణి. ‘చెంబు’ కనపడితే, చెంబుని స్ట్రోక్సులో బొటన వేలుతో, చూపుడు వేలు మీద రాసేవాణ్ణి. నడుస్తున్నప్పుడూ, భోంచేస్తున్నప్పుడూ, పిల్లలను ఎత్తుకున్నప్పుడూ, ఆఫీసులో పనిచేస్తున్నప్పుడూ, బొటన వేలు, చూపుడు వేలు మీద చకచకా స్ట్రోక్స్ రాస్తూనే ఉండేవాణ్ణి. విశ్రాంతిగా ప్రాక్టీస్ మీద కూర్చున్నప్పుడు, మా ఆవిడ కుట్టిన పుస్తకాల మీద ప్రాక్టీస్ చేసేవాణ్ణి. నేను ప్రాక్టీస్ చేసిన పుస్తకాలు మా చిన్న ఇంట్లో గుట్టలు గుట్టలుగా దర్శనమిచ్చేవి. కొన్ని పుస్తకాల్లోని రాతలను రబ్బరుతో తుడిచేసి మళ్ళీ ప్రాక్టీసుకు సిద్ధం చేసేవారు.
షార్టుహ్యాండు పరీక్షలో స్పీడ్ ముఖ్యం. అందుకని, చిన్న టేప్ రికార్డర్ కొనుక్కుని, ఆంగ్ల పత్రికలలో వచ్చే సంపాదకీయాలను, నిమిషానికి వంద పదాలు వచ్చే విధంగా నేనే రికార్డ్ చేసుకుని, వాటిని షార్టుహ్యాండ్‌లో రాసేవాణ్ణి. కాని, దాని వల్ల నేనే డిక్టేషన్ చెప్పి, నేనే ట్రాన్సై్కబ్ చేయడంతో కొన్ని పదాలు నాకు ముందే తెలిసిపోవడం వలన, నేను సులువుగా రాయగలుగుతున్నానేమోనని నాకే అనిపించింది. దాంతో తెలిసిన వాళ్ళతో డిక్టేషన్ రికార్డు చేయించేవాణ్ణి. ఇన్‌స్టిట్యూటులో రిక్వెస్టు చేసి, అక్కడి స్పీడ్ డిక్టేషన్లను, రికార్డింగ్ చేసుకుని ఇంట్లో ప్రాక్టీస్ చేసేవాణ్ణి.
ఒకసారి, మా పొరుగున ఉన్న అంకుల్ వచ్చి, ‘అర్ధరాత్రి మీ ఇంట్లో నుండి ఇంగ్లీష్ వార్తలు వస్తున్నాయి. ఆ టైములో ఎవరు వింటున్నారు?’ అని అడిగాడు. నేను నా షార్టుహ్యాండ్ పరీక్ష గురించి చెప్పాను.
ఆయన చాలా సంతోషపడి, ‘బెస్టాఫ్ లక్’ అని చెప్పాడు. మూడు నెలల్లో నేను ఆరు కిలోల బరువు తగ్గాను. బట్టలు లూజు అయిపోయాయి. కళ్ళు గుంటలు పడి, ముఖం పీక్కు పోయింది. గడ్డం పెరిగి, ఒక పిచ్చోడిలా తయారయ్యాను.
కాని, నా ప్రయత్నంలో విజయం సాధిస్తానన్న నమ్మకం కలిగింది. నిమిషానికి వంద పదాలు సులభంగా రాయగలుగుతున్నాను. ఆత్మవిశ్వాసం నా ముఖంలో తొణికిసలాడుతున్నట్టుగా నాకే తోచింది. పరీక్ష రోజున, పెన్సిల్ ముట్టుకోలేదు. ప్రశాంతంగా ఉన్నాను. దేవుడికి నమస్కరించి, పరీక్ష హాలుకు బయల్దేరాను.
షార్టుహ్యాండ్ పరీక్షలో, అభ్యర్థులు కంగారు పడడం సహజం. కాని, నేను ఎటువంటి ఆందోళన లేకుండా, రిలాక్స్‌డ్‌గా కూర్చున్నాను.
పరీక్ష మొదలయింది. కంచుకంఠంతో డిక్టేషన్ మొదలయింది. ఎగ్జామినర్ నోటి నుండి దొర్లుతున్న పదాలను చెవులు నిక్కించి స్పష్టంగా విని వాటికి స్ట్రోక్స్ రాయడం ప్రారంభించాను. నా చెవుల్లోకి వేరే శబ్దమే వినిపించడం లేదు. షార్టుహ్యాండ్ పరీక్ష మిగతా పరీక్షల్లా కాదు. ఒక్క పదం వినడం మిస్ అయితే కంగారు మొదలై తరువాత అనేక పదాలతో లంకె కుదరదు. అందుకని ఒక పక్కన ప్రపంచం బద్దలైపోతున్నా, పట్టించుకోకూడదు.
అందుకే, చాలామంది, ఐదారు సార్లు షార్టుహ్యాండ్ ‘లోయర్’ పరీక్ష రాస్తే గానీ ఉత్తీర్ణత సంపాదించరు. ఆ ఎగ్జామ్ హాల్ వాతావరణం, ఆ హడావుడి, ఆ సందడి, ఆందోళన అనుభవంలోకి రావాలి. అప్పుడు గాని, డిక్టేషన్ మీద ఏకాగ్రత కుదరదు.
నేను చకచకా ట్రాన్‌స్క్రైబ్æ చేసి పేపరు ఇచ్చేసి, ఇంటికి వచ్చి, అన్నం తిని, రెండు రోజుల పాటు పడుకున్నాను.
నా చేతులూ, వేళ్ళూ ఎంత అలసిపోయాయో నాకే తెలుసు. ఆ మూడు నెలల్లో కొన్ని లక్షల పదాలు రాశాయి నా వేళ్ళు. కొన్ని వేల పుస్తకాలను నా చేతులు పట్టుకున్నాయి. ఒక మహా మరయంత్రంలా, చక్కటి ప్రిసిషన్‌తో మెదడు, చెవులు, చేతులు, వేళ్ళు పనిచేశాయి.
రిజల్ట్స్ వచ్చాయి. నేను రాష్ట్రంలో ప్రప్రథముడిగా పాసయి, గోల్డ్ మెడల్ సాధించాను. ఆ క్షణంలో, నా భార్య నా చేతి వేళ్ళను ముద్దు పెట్టుకుంది.
అది ఒక ప్రారంభం మాత్రమే. షార్టుహ్యాండులో నా ప్రజæ్ఞ వల్ల ఆ తర్వాత అనేక విజయాలు సాధించాను. బ్యాంకులో స్టెనోగ్రాఫర్, ఐఏయస్ ఇంటర్వ్యూ, గ్రూప్ పరీక్షల్లో ప్రప్రథముడిగా ఉద్యోగం రావడం జరిగిపోయాయి.
ఇప్పటికీ, కొత్త పదం కనిపిస్తే నా బొటన వేలు, చూపుడు వేలు మీద రాయడానికి ప్రయత్నిస్తుంది. కాని, ఏం లాభం. ఆ స్వర్ణయుగం ముగిసిపోయింది. నన్ను జీవితంలో విజేతగా నిలబెట్టిన నా చేతులు – నా మెదడు విన్న ప్రతి మాటను అక్షర రూపంలోకి లిపిబద్ధం చేసిన నా వేళ్ళు– ఇప్పుడు నా మాట వినడం లేదు. రాయడం అటుంచి, పెన్సిల్ కూడా పట్టుకోలేనంతగా వణుకుతున్నాయి.
రుజాగ్రస్తుణ్ణయ్యాను అనుకునే సరికి కన్నీరు ఉబికి వచ్చింది. సన్నటి వాన మొదలయింది. బాల్కనీలో నుండి లోపలికి నడిచాను. వర్షానికి తడిస్తే ఆస్త్మా పెరుగుతుంది. అందుకే ఇన్‌హేలర్ పీల్చి, మంచం మీద కూర్చున్నాను.
పక్కనే నా భార్య పడుకుని ఉంది. నాలాగా కాకండా తనెప్పుడూ మంచానికి ఎడమ వైపు పొందికగా పడుకుంటుంది. టైం ఎంతయిందో తెలియదు కాని, అది కచ్చితంగా బ్రాహ్మీముహుర్తమే. నా భార్య అలా ప్రశాంతంగా పడుకుని ఉండడం చూస్తే, మనసు ఆనందంతో నిండిపోయింది. కారణం తెలియదు. కొన్ని సంతోషాలకు కారణం ఉండదు. భగవంతుని దయ వలన ఇన్నేళ్ళూ ఒకరికొకరంగా బతికి సంసారాన్ని నడిపాము. పిల్లలు ప్రయోజకులయ్యారు. నా భార్య జుట్టును ప్రేమగా నిమిరాను. తను నిద్రలోనే, ‘ఏమైనా కావాలా?’ అని అడిగింది. నేను తన చెంప మీద సుతారంగా ముద్దు పెట్టుకుని ‘ఏమొద్దు, పడుకో!’ అని నా ఆఫీసు రూములోకి నడిచాను.
చాలాసేపు మది నిండా ఒక సంతృప్త భావనతో చీకట్లో మౌనంగా కూర్చుండిపోయాను. ‘నాకేం తక్కువ? జీవితంలో అన్నీ అనుభవించాను. కీర్తి ప్రతిష్ఠలు సంపాదించాను. ఏవో కొన్ని పుస్తకాలు రాశాను. మనిషి జీవితానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? నాకు ఈ జీవితం పట్ల ఎటువంటి అసంతృప్తి లేదు. పండిన ఆకు రాలిపోవడం అత్యంత సహజం. ఆ ప్రక్రియలో ఎన్నో పరిణామాలు జరుగుతుంటాయి. వాటిల్లో అనారోగ్యం కూడా ఒకటి. డెబ్భై ఏళ్ళ వయసులో శరీరం, యౌవ్వనంలో ఉన్నట్టుగా, హుషారుగా ఎలా ఉంటుంది? డెబ్భై ఏళ్ళ తర్వాత లభించిన ప్రతి రోజూ బోనస్ జీవితంగానే భావించాలి.’
నా ఆలోచనల్లో నేనుండగానే, లైటు వెలిగింది. నేను తలెత్తి చూశాను. మా ఆవిడ కాఫీ కప్పుతో నిలబడింది.
‘వద్దన్నానుగా?’ అని అన్నాను. తను నవ్వుతూ, ‘మీకు కావాలని నాకు తెలుసుగా?’ అంది నవ్వుతూ. వర్షం వెలిసిన తర్వాత విరిసిన హరివిల్లులా ఉంది, నిద్రమత్తులో ఉన్న తన ముఖంలోని ఆ నవ్వు. తనలో గొప్పతనం ఏమిటంటే, పడుకుని లేచినా ముఖం తాజాగా ఉంటుంది. జుట్టు చెదరదు. ఆమె ముఖాన్నే చూస్తూ, కాఫీ కప్పు అందుకున్నాను.
నేను తన కష్టాన్ని సరిగా గుర్తించలేదేమోనని, ఒక్కోసారి నాకు అనిపిస్తుంది. సుమారు యాభై ఏళ్ళ మా సంసారంలో నాకు ఎన్నడూ ఏ లోటూ రాకుండా చూసుకుంది. పేరుప్రఖ్యాతులు నాకు వచ్చినా తనకొచ్చినంతగా సంబరపడేది. కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి తన చేతిని స్పృశించాను. ఆ స్పర్శ నాకు వేయి ఏనుగుల బలాన్నిచ్చింది.
‘కాఫీ తాగండి!’ అని వెళ్ళబోతూ,
‘ఏంటి, ఆఫీసు రూములో కూర్చున్నారు? మళ్ళీ ఏమైనా రాయబోతున్నారా?’ అంటూ తలుపు దగ్గరకు వేసి బయటకు నడిచింది.
ఆమె మాటలు నన్ను ఆలోచనల్లో పడేశాయి, ‘అవును ఎందుకు రాయగూడదు?’ అన్న సందేహం నాలో ఉత్పన్నమయింది.
మీరు గమనించారా? నేనైతే ఇప్పుడే గమనించాను. కాఫీ కప్పు తీసుకున్నప్పుడు నా చేతి వేళ్ళు మునుపటంతగా వణక లేదు. నా వేళ్ళను చూశాను. ఏదో కొత్త ఉత్తేజంతో తొణికిసలాడుతున్నట్టుగా, నవనవలాడుతూ కనిపించాయి. ‘ప్లేసిబో ఎఫెక్ట్’ గురించి నేనే ఎన్నోసార్లు రాశాను. ఇప్పుడు ఆ ప్రయోజనం నాకే అనుభవంలోకి వస్తున్నట్టుగా అనిపించింది.
కంప్యూటర్ తెరిచి, స్పీకరులో కథ ‘డిక్టేషన్’ చెపుతుంటే, వాయిస్ రికార్డర్ ద్వారా, కంప్యూటర్ తెర మీద, అక్షరాల రూపంలో కథ పురుడుపోసుకుంటుంది.
ఇప్పుడు కూడా షార్టుహ్యాండే, డిక్టేషన్ ఇవ్వాల్సిందే. కాని, ఇప్పుడు చేతివేళ్ళ పనిని కంప్యూటర్ చేసేస్తోంది.


