ముఖం మనదే, స్వరం మనదే, శరీరం మనదే. కాని, అది మనం కాదు! డీప్‌ఫేక్ తెరలో మనం ఎవరో మనకు కూడా తెలియని మాయాజాలం నడుస్తోంది. ఇక్కడ మన గుర్తింపును ఎవరైనా కొనవచ్చు, అమ్మవచ్చు, దొంగిలించవచ్చు. అవసరమైతే ఆయుధంలా కూడా ఉపయోగించవచ్చు. అందుకే, నిజమైన గెలుపు ఇప్పుడు అంతా మన నమ్మకంలోనే! - దీపిక కొండి
ఇప్పుడు ఉదయం లేచి ఫోన్ ఓపెన్ చేస్తే మనకు ఎదురయ్యేది అద్దంలో కనిపించే మన ముఖం కాదు, స్క్రీన్ మీద తిరుగుతున్న మన డూప్లికేట్. అదే మనల్ని చూసి నవ్వుతుంది, మాట్లాడుతుంది, మనం ఎప్పుడూ చేయని పనులు కూడా చేసినట్టు చూపిస్తుంది. దీంతో, ఇప్పుడు మనుషుల అసలైన గుర్తింపు సంక్షోభం ఏర్పడుతోంది. ఒకప్పుడు ‘నువ్వు ఎవరు?’ అనే ప్రశ్నకు పేరు చెబితే సరిపోయేది. ఇప్పుడు మాత్రం ‘నువ్వు నిజంగా నువ్వేనా?’ అని అడగాల్సిన పరిస్థితి దాపురించింది.
ముఖం మనదే, స్వరం మనదే, కాని, మాటలు మనవి కావు. వీడియోలో కనిపించేది మనమే, కాని, ఆ వీడియోలోని మనిషి మనం కాదు. దీనిని సింపుల్‌గా చెప్పాలంటే మీ ఫొటోను తీసుకుని, మీ వాయిస్‌ను జత చేసి, మీ స్థానంలో ఎవరో మాట్లాడించి నట్లుగా ఏఐ తయారు చేసే డీప్ ఫేక్ డిజిటల్ డ్రామా! ఈ నాటకం అంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది. కాబట్టి, మీ అమ్మ చూసినా ‘అయ్యో, నువ్వే కదా!’ అంటుంది. ‘అది నేను కాదు’ అని మీరు ఎంత చెప్పినా ‘అబద్ధం చెప్పొద్దు’ అని గద్దిస్తుంది. ఇంత పవర్ ఉన్న టెక్నాలజీ సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడితే, మన గుర్తింపు ఒక ఫైల్‌లా మారిపోతుంది.
అప్పుడు వారు ఆ ఫైల్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే వైరల్ కూడా చేయవచ్చు. ఇదే అసలు సమస్య మన ముఖం మన దగ్గరే ఉంటుంది, కాని, వాడకం మాత్రం వేరేవాళ్ల చేతుల్లో ఉంటుంది. ఇంతకుముందు సోషల్ మీడియాలో భయం ఏంటంటే ఫొటో బాగా రాలేదేమో, ట్రోల్ అవుతామేమో.
ఇప్పుడు ఆ భయం వేరే లెవల్‌కు చేరింది. ‘నేను చేయని పనికి నన్ను ఎందుకు తిడుతున్నారు?’, ‘నేను చెప్పని మాటలకు నేను ఎందుకు వివరణ ఇవ్వాలి?’ అనే ప్రశ్నలు మనల్ని వెంటాడుతున్నాయి. ఇక్కడే గుర్తింపు సంక్షోభం మొదలవుతుంది. నిజంగా నేను ఎవరు? నేను చేసిన పనులా? లేక నా ముఖంతో ఏఐ చేసిన పనులా? అనే ఎవరి వారు ఒక్కసారి చెక్ చేసుకొని మరీ పోరాటం చేస్తున్నారు.
సెలబ్రిటీ కావడమే సమస్య!
ఒకప్పుడు ఫ్యాన్ ్స అభిమానమే సెలబ్రిటీలకు బలం. ఇప్పుడు అదే అభిమానం ఏఐ చేతుల్లో పడి ఒక పెద్ద డిజిటల్ బాంబులా మారుతోంది! భారతదేశంలో నటులు, రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలకు ఉన్న అపారమైన అభిమాన బలం ఇప్పుడు డీప్‌ఫేక్ మోసాలకు ఇంధనంగా మారిపోయింది. ఒక వీడియో చూసి ‘అరే, నిజంగానే ఆయనే చెప్పాడు!’ అనిపించిందా? ఒక వాయిస్ విని ‘ఇది కచ్చితంగా ఆయన స్వరమే!’ అని నమ్మేశామా? అంతే, ఆ నమ్మకమే మోసగాళ్లకు పెద్ద ఆయుధం. డీప్‌ఫేక్ వీడియోలు, ఏఐ వాయిస్ క్లిప్‌లు ఇక కేవలం టెక్నాలజీ అద్భుతాలు మాత్రమే కాదు.
అవి ప్రజల అమాయకత్వాన్ని టార్గెట్ చేసే ప్రమాదకరమైన ట్రిక్కులు. అందుకే కరణ్ జోహార్ నుంచి ఐశ్వర్యరాయ్ బచ్చన్ వరకూ, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, అరిజిత్ సింగ్ లాంటి స్టార్‌లు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ‘నా ముఖం నాది, నా గొంతు నాది, అనుమతి లేకుండా వాడొద్దు!’ అని చట్ట రక్షణ కోసం వేడుకోవాల్సిన పరిస్థితి. ఒకప్పుడు ఆటోగ్రాఫ్ కోసం అభిమానులు ఎదురుచూస్తే, ఇప్పుడు అదే ఫేస్‌తో నకిలీ వెబ్‌సైట్లు, అనధికార మెర్చండైజ్, ఏఐతో తయారైన అసభ్య కంటెంట్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
స్టార్‌డమ్ అంటే స్పాట్‌లైట్ మాత్రమే కాదు, సైబర్ ప్రమాదాల ప్యాకేజీ కూడా! ఇక్కడితో ఆగిపోతే బాగుండేది. నిపుణుల హెచ్చరిక ఏమిటంటే ప్రమాదం ఇంకా పెద్దదే. ముఖ్యంగా ప్రజా నాయకులు, కార్పొరేట్ లీడర్లు మరింత రిస్క్‌లో ఉన్నారు. ఎందుకంటే వారి ప్రసంగాలు, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అన్నీ యూట్యూబ్‌లో ఫ్రీగా దొరుకుతాయి. అదే డేటా పట్టుకుని ఏఐ వాయిస్ క్లోనింగ్ చేస్తే చాలు బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేయడం, తప్పుడు ప్రచారాలు చేయడం పిల్లల ఆటగా మారుతోంది. మొత్తానికి ఒకప్పుడు సెలబ్రిటీ కావడం గ్లామర్ అయితే, ఇప్పుడు అది ‘హై రిస్క్ ప్రొఫెషన్’గా మారింది.
సామాన్యులకు కూడా సమస్యే!
ఇది కేవలం స్టార్‌ల సమస్యే కాదు. ‘వాళ్లకు కోర్టులు, లాయర్లు ఉంటారు మనకేముంది?’ అనుకునే లోపే ఏఐ మోసాలు నేరుగా సామాన్యుడి ఇంటి తలుపు తడుతున్నాయి. సెలబ్రిటీ ముఖాలతో మొదలైన డీప్‌ఫేక్ తంతు ఇప్పుడు మీ అమ్మ, నాన్న, బాస్, పిల్లలు అందరి ముఖాలు, గొంతుల వరకు వచ్చేసింది. మీ తల్లిదండ్రుల స్వరంతో ఫోన్ చేసి ‘అర్జెంటుగా డబ్బు కావాలి’ అని అడిగే కాల్స్; స్కూల్ పిల్లల ఫొటోలు తీసుకుని ఫేక్ వీడియోలు తయారు చేయడం; ఉద్యోగుల ముఖాలతో నకిలీ వీడియో కాల్స్ చేసి ‘మీ మేనేజర్ మాట్లాడుతున్నాడు’ అని నమ్మించడం; మహిళలపై ఏఐ ఆధారిత డిజిటల్ వేధింపులు ఇవన్నీ ఇక అరుదైన వార్తలు కాదు, రోజూ జరుగుతున్న డిజిటల్ డ్రామాలు.
ఇలా డీప్‌ఫేక్స్ ఇప్పుడు ప్రజాస్వామ్యం, భద్రత, గౌరవం అన్నింటినీ ఒకేసారి పరీక్షిస్తున్నాయి. ఐశ్వర్యరాయ్, కరణ్ జోహార్‌లాంటి ప్రముఖులే తమ గుర్తింపును కాపాడుకోవడానికి కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తే, సామాన్యుల పరిస్థితి ఏంటి? వాళ్లకు లాయర్లు ఉంటారు, తీర్పులు వస్తాయి. మనకు మాత్రం ఎవరికీ చెప్పుకోలేని బాధ. చెప్పినా నమ్మేవారు ఉండరు. ఇలా మొత్తానికి ఈ డిజిటల్ యుగంలో ‘చూశాం కదా విన్నాం కదా’ అనేది ఇక సాక్ష్యం కాదు. నమ్మకం కూడా ఒక రిస్క్ అయిపోయింది. సెలబ్రిటీ అయినా, సామాన్యుడైనా ఏఐ ముందు అందరం సమానమే! తేడా ఒక్కటే వాళ్లకు పేరు పోతుంది, మనకు డబ్బు, పరువు, మనశ్శాంతి అన్నీ పోతాయి.
ఏం చేస్తుందంటే?
ఈ రోజుల్లో గుర్తింపు అంటే పేరు, ఊరు, ఆధార్ నంబర్ కాదు. అది ఒక ఫోల్డర్‌లో దాచిన డేటా. అందులో ఒక ఫొటో, రెండు వీడియోలు, ‘హలో ఎలా ఉన్నారు?’ అన్నంత వాయిస్ ఉంటే చాలు. మిగతా పనంతా ఏఐ చూసుకుంటుంది. మీ ముఖం తీసుకుంటుంది. వేరే మనసు పెడుతుంది. వేరే మాటలు మాట్లాడిస్తుంది. అలా మనం ఎప్పుడూ కలలో కూడా ఊహించని స్థితిలోకి మనల్ని నెడుతుంది, మన గొంతుతోనే మనం ఎప్పుడూ మాట్లాడని మాటలు మాట్లాడిస్తుంది. ఫలితం? ఆ వీడియో చూసినవాళ్లు ‘ఇది ఫేక్ అయి ఉండదులే, మనవాడే’ అంటూ షేర్ బటన్ కొడతారు.
ఎందుకంటే డీప్‌ఫేక్‌లో ఉన్న ముఖం, మాస్క్ కాదు, అసలైన మన ముఖమే! అది నిజమైనదే కాబట్టి, ప్రేక్షకులు కూడా నిజమే అనుకుంటారు. ఇక్కడే అసలు ట్విస్ట్. సమస్య ఏఐ ఎంత తెలివైనదో కాదు, మనం ఎంత అమాయకులమో. ఒకప్పుడు ‘చూశాను కాబట్టి నిజం’ అనేవాళ్లం. ఇప్పుడు కళ్లతో చూసే వాటిని కూడా నమ్మకూడదు. ఫిల్టర్ లేకుండా కనిపించిన ముఖం నిజమా? లేక ఏఐ సాఫ్ట్‌వేర్‌లో పుట్టిన పర్ఫెక్ట్ సినిమా సీనా? తెలియదు. మన మెదడే కన్‌ఫ్యూజ్ అవుతోంది. అందుకే, మనమే స్క్రీన్ పై ఉన్నా, మనమేనా కాదా అన్న డౌట్ మనకే క్రియేట్ చేస్తుంది. అందుకే, ఏఐని పూర్తిగా ఆపడం అంటే సముద్రానికి స్టాప్ బోర్డ్ పెట్టినట్టే. మన వివేచన, జాగ్రత్త, చట్టాలు కలిసి పనిచేయకపోతే, రేపు మన ముఖం మనదేనా అనే ప్రశ్నకే సమాధానం చెప్పలేని రోజులు రావచ్చు.
న్యాయస్థానం!
ఏఐ డిజిటల్ దొంగలా రోజుకో కొత్త వేషం మార్చుకుంటూ పరుగెడుతుంటే, కోర్టు మాత్రం ‘ఒక్క నిమిషం’ అంటూ స్టే ఆర్డర్లు ఇస్తూ హ్యామర్ ఎత్తుతోంది. అయితే, ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే కొన్ని కేసుల్లో కఠిన ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా ఏఐతో తయారైన వీడియోలు, వాయిస్ క్లిప్‌లు ఇకపై సరదా ఆటలు కాదు; అవి నేరాలే! అలాంటి కంటెంట్‌ను ఆపేయాలి, తొలగించాలి, అవసరమైతే తయారుచేసిన వాళ్లను కూడా లాక్కొచ్చి ప్రశ్నించాలి అని న్యాయస్థానం క్లియర్ సిగ్నల్ ఇచ్చింది. ఒకప్పుడు ‘వైరల్ అవుతుంది’ అనుకున్న వీడియో ఇప్పుడు ‘వారంట్ వచ్చే చాన్స్ ఉంది’ అనే స్థాయికి చేరింది.
కాని, చట్టం ఇంకా అలర్ట్ మోడ్‌లోకి పూర్తిగా రాలేదు. ఐటీ చట్టంలోని కొన్ని నిబంధనలు అసభ్య కంటెంట్‌ను నిర్ణీత సమయంలో తొలగించాలంటున్నప్పటికీ, అమలు బలహీనంగా ఉంది. ఏఐ వేగానికి చట్టం వెనుకబడుతోంది. ఆ సమయంలో ఏఐ మాత్రం ఇంకో ఐదు కొత్త వీడియోలు, పది కొత్త ఫేక్ అకౌంట్లు తయారు చేసేస్తుంది. టెక్నాలజీ రాకెట్ స్పీడ్‌లో దూసుకెళ్తుంటే, చట్టం మాత్రం ఫైల్ పట్టుకుని, నోటీసు రాసుకుంటూ ఉంటోంది. ఇలా ఒక వైపు ఏఐ అప్‌డేట్ నోటిఫికేషన్, ఇంకో వైపు కోర్ట్ హియరింగ్ డేట్ ఇద్దరి మధ్య స్పీడ్ మ్యాచ్ అసలు జరగట్లేదు. అందుకే చట్టాలు మరింత కఠినంగా మారాలి, అమలు బలపడాలి, ఎందుకంటే రేపు కోర్టులు తీర్పులు ఇస్తుండే సమయానికి, ఏఐ మాత్రం ఇంకో కొత్త వేషంలో నవ్వుతూ ముందుకెళ్లిపోతుంది.
అసలైన యజమాని ఎవరు?
ఈ డీప్‌ఫేక్ గందరగోళం మధ్యలో ఇంకొక పెద్ద ప్రశ్న నిశ్శబ్దంగా నిలబడి చూస్తోంది. ఏఐ యుగంలో ఒక మనిషి వ్యక్తిత్వానికి నిజమైన యజమాని ఎవరు? మనమా, టెక్నాలజీనా, లేక ‘డౌన్ లోడ్ చేసుకున్నాడు కాబట్టి వాడేసుకున్న వాడా?’ న్యాయ నిపుణుల మాటల్లో చెప్పాలంటే, భారతదేశానికి ఇప్పుడిప్పుడే సరిపడే చట్టాలు కాకుండా, ప్రత్యేకంగా ఏఐ కోసం తయారైన స్పష్టమైన చట్టం అవసరం. అనుమతి అంటే ఏంటి? ఒకసారి ఇచ్చిన అనుమతి జీవితాంతం చెల్లుతుందా, లేక ఒక ప్రాజెక్ట్ వరకేనా? వాణిజ్య వినియోగం ఎక్కడి వరకు సరైనది, ఎక్కడి నుంచి దోపిడీగా మారుతుంది? వ్యక్తి స్వేచ్ఛను కాపాడుతూనే, అతని ముఖం, స్వరం, గుర్తింపును ఎలా రక్షించాలి? ఇవన్నీ ‘కేసు వచ్చినప్పుడు చూస్తాం’ అనే విధంగా కాకుండా, ముందే కచ్చితంగా నిర్వచించాల్సిన ప్రశ్నలు.
ఇక్కడే మరో బలమైన ట్విస్ట్. అధిక నియంత్రణ పెడితే సృజనాత్మకత ఊపిరాడకుండా పోతుందా? నియంత్రణ లేకపోతే అసురక్షితంగా మారుతుందా? ఇలా ఇది బ్రేక్–యాక్సిలరేటర్‌లాగా రెండూ ఒకేసారి బ్యాలెన్ ్స చేయాల్సిన డ్రైవింగ్. అంతే కాదు, మరణానంతర హక్కులు అనే కొత్త అధ్యాయం కూడా తెరమీదకి వస్తోంది.
ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని రూపం, స్వరం రక్షణలో ఉండాలా? లేక అతను చరిత్రలోకి వెళ్లగానే ఎవరికైనా వాడుకునే ఫ్రీ డేటాగా మారాలా? డిజిటల్ పునర్జన్మ సాధ్యమైన ఈ కాలంలో, చనిపోయిన తర్వాత కూడా మాట్లాడే ముఖాలు, పాడే గొంతులు కనిపిస్తున్నప్పుడు, ఇది కేవలం న్యాయపరమైన సమస్య కాదు, నైతిక సరిహద్దులపై జరుగుతున్న పెద్ద చర్చ. చివరికి సమాధానం ఒక్కటే కావాలి: ఏఐ ఎంత తెలివైనదైనా, వ్యక్తిత్వానికి అసలైన యజమాని మనిషే అని చట్టం కూడా, సమాజం కూడా స్పష్టంగా చెప్పాల్సిన సమయం వచ్చేసింది.
ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న పోరాటం!
డీప్‌ఫేక్ అనే వైరస్ నేడు పాస్‌పోర్ట్ లేకుండానే ప్రపంచమంతా తిరుగుతోంది. హాలీవుడ్ నుంచి హైకోర్టుల వరకూ అందరికీ ఇదే ప్రశ్న ‘ఇది నా గొంతేనా, నా ముఖమేనా?’ అమెరికాలో స్కార్లెట్ జోహాన్సన్, టామ్ హ్యాంక్స్, స్టీఫెన్ ఫ్రై లాంటి స్టార్‌లు తమ వాయిస్, ఇమేజ్‌ను అనధికారంగా వాడుతున్నారని గట్టిగా గళమెత్తారు. స్టార్ పవర్ ఉన్నవాళ్లే ఇలా మాట్లాడాల్సి వస్తే, సామాన్యుల పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు, 2025 నాటికి 400 మందికి పైగా అంతర్జాతీయ కళాకారులు ఏఐ కంపెనీలపై నియంత్రణలు తీసుకురావాలని ప్రభుత్వాలను కోరారు.
ప్రస్తుతం ఇదే ఒక గ్లోబల్ అలారంలా మారుమోగుతోంది. కాని, కథ అంతా పోరాటమే కాదు. కొందరు కళాకారులు ఏఐని శత్రువుగా కాకుండా, సరిగ్గా వాడితే శక్తిమంతమైన భాగస్వామిగా చూస్తున్నారు. పాప్ సింగర్ గ్రైమ్స్ తన అధికారిక ఏఐ వాయిస్ మోడల్‌ను విడుదల చేసి ‘ఇది నా గొంతు, నా షరతులపై’ అని స్పష్టం చేసింది. జాన్ లెనన్ పాత రికార్డింగ్‌ను ఏఐ సహాయంతో పాటగా మార్చినప్పుడు కూడా అదే సందేశం కనిపించింది. ఇలా సరైన అనుమతి, సరైన గడులు ఉంటే ఏఐ ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో! సమస్య టెక్నాలజీలో కాదు; దాన్ని ఎవరు, ఎలా వాడుతున్నారన్న దానిపైనే ఉంటుందని మరికొందరి వాదన.
నిపుణుల మాటల్లో...
న్యాయ నిపుణులు ఈ మొత్తం ఏఐ గందరగోళాన్ని చూసి చెప్తున్న మాటలేంటంటే, ప్రస్తుతం భారతదేశంలో ఏఐకి సంబంధించిన అసలు లోపం చట్టాల్లో స్పష్టత లేకపోవడమే. ‘ఏఐ వ్యక్తిత్వ హక్కులు’ కోసం ప్రత్యేక చట్టం లేదు. ఐటీ యాక్ట్ ఉన్నా, అది ఏఐ చేసిన నష్టం తర్వాత మాత్రమే ‘ఈ కంటెంట్ తీసేయండి’ అని చెప్పగలదు. కాని, అది జరగకముందే ఆపే ప్రయత్నాలు చేయలేదు. అంటే ఇది తలుపు పగిలిన తర్వాత తాళం వేసినట్టే! అందుకే, ఇందుకోసం, ప్రత్యేక పర్సనాలిటీ రైట్స్ చట్టం రావాలి. అనుమతులు, వాణిజ్య వినియోగం, శిక్షలు స్పష్టంగా ఉండాలి.
ప్యాచ్‌లతో పని జరగదు. ప్రశ్నలు మాత్రం ఇంకా ఉన్నాయి. అనుమతి ఒకసారి ఇచ్చితే జీవితాంతం వర్తించేదా? వాణిజ్య వినియోగం ఎక్కడి వరకే సరైనది, ఎక్కడ దోపిడీగా మారుతుంది? ఉల్లంఘన జరిగితే శిక్షలు నిజంగా భయపడేలా ఉండాలా? ఇవన్నీ కేసు వచ్చినప్పుడు కాకుండా, ముందే స్పష్టంగా రాయాలని సూచిస్తున్నారు. ఏఐ మన భవిష్యత్తు అని చెప్పడం సరైనది, కాని, సరైన దారిలో పెట్టకపోతే, అదే ఏఐ మన అసలైన గుర్తింపునే మెల్లగా మాయ చేసే శక్తిగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఏఐ ఎన్ని వేషాలు వేసినా, ఈ డీప్‌ఫేక్ ప్రపంచంలో చివరి గెలుపు మనదే! ఎందుకంటే ముఖం, స్వరం కాదు, అసలు హీరో మన నమ్మకం, మన పరిధి, మన నియంత్రణ.
రష్మిక మందన్న
‘‘ఇది భయంకరం. ఇది కేవలం నా గురించి మాత్రమే కాదు. ప్రతి మహిళ గురించి.’’ అని డీప్‌ఫేక్ వీడియోలపై ఆమె బహిరంగంగా స్పందించడంతో, కేంద్ర ఐటీ శాఖ జోక్యం చేసుకుని ప్లాట్‌ఫామ్‌లకు కంటెంట్ తొలగింపు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఏఐ దుర్వినియోగంపై చర్చకు దారి తీసింది.
సమంత రూత్ ప్రభు
‘‘ఆన్ లైన్ లో మహిళలపై జరిగే డిజిటల్ వేధింపులు సాధారణం కాకూడదు.’’ తన పేరుతో ఫేక్ కంటెంట్, మార్ఫ్ చేసిన చిత్రాలపై ఆమె స్పందించడంతో, సైబర్ క్రైమ్ ఫిర్యాదుల ప్రాముఖ్యతపై అవగాహన పెరిగింది.
కీర్తి సురేష్
‘‘డిజిటల్ ప్రపంచంలో గౌరవానికి కూడా రక్షణ అవసరం.’’ మార్ఫ్ చేసిన ఫోటోలు, ఫేక్ అకౌంట్లపై ఆమె స్పందనతో ప్లాట్‌ఫామ్‌లు కంటెంట్ తొలగింపు చర్యలు వేగవంతం చేశాయి.
పూజా హెగ్డే
‘‘ఇది సరదా కాదు, దుర్వినియోగం.’’ ఫేక్ ప్రొఫైల్స్, మార్ఫ్ చేసిన కంటెంట్‌పై ఆమె జారీ చేసిన హెచ్చరికలతో, సైబర్ ఫిర్యాదులపై చర్చ మొదలైంది. అలా తనతో పాటు చాలామంది తమకు జరిగిన సైబర్ నేరాలను బహిరంగంగా ఫిర్యాదులు చేశారు.
నయనతార
‘‘నా వ్యక్తిగత జీవితం కంటెంట్ కాదు.’’ అనుమతి లేకుండా తన చిత్రాలు, వీడియోలు వినియోగించిన సందర్భాల్లో ఆమె లీగల్ నోటీసుల ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశారు.
నాగార్జున అక్కినేని
‘‘నా పేరు, నా ఫోటో పెట్టి ఎలాంటి పెట్టుబడి స్కీమ్స్‌ను నేను ప్రచారం చేయడంలేదు.’’ తన పేరుతో ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటనలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. అనంతరం సైబర్ క్రైమ్ విభాగాలు అలాంటి కంటెంట్‌ను తొలగించాయి.
విజయ్
‘‘నా పేరు పెట్టి ఆర్థిక స్కీమ్స్ ప్రచారం చేయడం మోసం.’’ ఫేక్ క్రిప్టో, ఇన్వెస్ట్‌మెంట్ యాడ్స్‌పై ఆయన హెచ్చరికలు జారీ చేయడంతో, తమిళనాడులో సైబర్ మోసాలపై అవగాహన పెరిగింది.
మహేష్ బాబు
‘‘నా పేరు, నా ముఖం పెట్టి పెట్టుబడులు కోరితే నమ్మకండి.’’ ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్, క్రిప్టో ప్రకటనలు వైరల్ కావడంతో ఆయన అభిమానులను అప్రమత్తం చేశారు.
అజిత్ కుమార్
‘‘నేను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండను. ఫేక్ అకౌంట్లను నమ్మవద్దు.’’ అంటూ అభిమానులను ఆయన హెచ్చరిస్తూ వస్తున్నారు.
అల్లు అర్జున్
‘‘నేను ఎలాంటి ఆన్ లైన్ స్కీమ్స్‌ను ప్రమోట్ చేయడం లేదు.’’ ఫేక్ యాడ్స్, మార్ఫ్ చేసిన వీడియోలపై ఆయన స్పందించడంతో, ఆ ఫేక్ కంటెంట్‌ను
తొలగించారు.
రజినీకాంత్
‘‘నా పేరు వాడుకుని ఎవరైనా డబ్బులు అడిగితే అది మోసమే.’’ ఫేక్ యాడ్స్, రాజకీయ–ఆర్థిక ప్రచారాలపై ఆయన స్పష్టత ఇవ్వడంతో, కంటెంట్ తొలగింపులు జరిగాయి.
ప్రభాస్
‘‘నా పేరుతో వస్తున్న ప్రకటనలు నావి కావు.’’ ఫేక్ సోషల్ మీడియా పోస్టులు, యాడ్స్‌లో తన ముఖం వాడిన ఘటనల తర్వాత ఆయన అభిమానులకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
మోహన్ లాల్
‘‘నా పేరు, నా ముఖం వాడిన ఆన్ లైన్ ప్రకటనలు నావి కావు.’’ ఫేక్ యాడ్స్‌పై ఆయన ఫిర్యాదు చేయడంతో, కేరళలో సైబర్ మోసాలపై చర్చ ఊపందుకుంది.
యశ్
‘‘నా పేరు పెట్టి జరిగే ఆన్ లైన్ ప్రమోషన్లు నావి కావు.’’ ఫేక్ యాడ్స్‌పై ఆయన హెచ్చరికలతో, కన్నడ ప్రేక్షకుల్లో సైబర్ అవగాహన పెరిగింది.
అభిషేక్ బచ్చన్ (2025)
‘‘ఆటోగ్రాఫ్ అనేది నా అభిమానులతో నా అనుబంధం. కాని, నకిలీ సంతకాలు, డీప్‌ఫేక్ వీడియోలు ఆ నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి.’’ ఈ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కేసును స్వీకరించి, ఆయన గుర్తింపును దుర్వినియోగం చేసిన అంశంపై విచారణ చేపట్టింది.
ఐశ్వర్యరాయ్ బచ్చన్ (2025)
‘‘ఇది నా ముఖం. నా పేరు. నా గుర్తింపు. కాని, ఏఐ దాన్ని తీసుకుని అసభ్య వీడియోలు చేసింది, అనుమతి లేకుండా టీషర్టులు, మగ్స్‌పై వాడింది. నేను నటిని కావచ్చు, కాని, నా గౌరవం సినిమా సీన్ కాదు’’ అంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు అనుమతి లేకుండా ఏఐ ద్వారా తయారైన కంటెంట్‌ను తక్షణమే నిలిపివేయాలని, తొలగించాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది.
అరిజిత్ సింగ్ (2024)
‘‘నా స్వరం నా సాధన. అనుమతి లేకుండా దాన్ని వాడటం సంగీతం కాదు.’’ ఢిల్లీ హైకోర్టు ఆయన పేరు, స్వరాన్ని అనధికారంగా వినియోగించ కుండా స్టే ఆర్డర్ జారీ చేసింది.
అనిల్ కపూర్ (2023)
‘‘నా డైలాగ్‌లు, నా ముఖం ఏఐ యాప్స్‌లో వాడాలంటే నా అనుమతి కావాలి.’’ ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఆయన పేరు, రూపం, స్వరం వ్యక్తిగత హక్కులేనని స్పష్టం చేస్తూ చారిత్రక తీర్పు ఇచ్చింది.
కరణ్ జోహార్ (2025)
‘‘నా పేరు పెట్టి, నా ముఖం పెట్టి అసభ్య కంటెంట్ ప్రచారం చేస్తున్నారు. ఇది నా కథ కాదు, నా సినిమా కాదు.’’ అంటూ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
‘‘నా స్వరం నా సంతకం. దాన్ని పోలిన ఏఐ వాయిస్‌ను నేను అంగీకరించను.’’ ఈ వివాదం తర్వాత సంబంధిత ఏఐ కంపెనీ ఆ వాయిస్ మోడల్‌ను తొలగించింది. – స్కార్లెట్ జోహాన్సన్
‘‘ఆ డెంటల్ యాడ్‌లో నేను లేను. అది నా ముఖం వేసుకున్న ఏఐ మాత్రమే.’’ ఈ ఘటనపై ఆయన బహిరంగంగా హెచ్చరిక జారీ చేయడంతో, న్యాయ చర్యలపై విస్తృత చర్చ మొదలైంది. – టామ్ హ్యాంక్స్
‘‘నా తండ్రి స్వరాన్ని తిరిగి సృష్టించడం భావోద్వేగ దోపిడీ.’’ ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో న్యాయ నైతిక చర్చకు దారి తీశాయి. – జెల్డా విలియమ్స్
‘‘నా గొంతు నా జీవితం. అనుమతి లేకుండా వాడటం తప్పు.’’ ఈ వ్యవహారంలో ఆయన యుకే కోర్టులో సంబంధిత ఏఐ కంపెనీపై కేసు వేశారు. – స్టీఫెన్ ఫ్రై


