అయ్యో... అత్తరికం! | Suryakantamma Aces Mother-in-Law Training Center To Navigate Daughter-in-Law Challenges With Confidence | Sakshi
Sakshi News home page

అయ్యో... అత్తరికం!

Mar 1 2026 11:28 AM | Updated on Mar 1 2026 11:42 AM

evaram katha funday

ఉదయం 5 గంటలు.. పేపర్‌ బాయ్‌ ప్రతి ఇంటి గుమ్మానికి పేపర్‌ వేసుకుంటూ సైకిల్‌ మీద వెళ్తుంటే, మరోపక్క ఒక ఫేమస్‌ కోచింగ్‌ సెంటర్‌ బయట పెద్ద లైన్స్‌ . ఆ లైన్స్‌ లో వయసుపైబడిన వందలాది మంది ఆడవాళ్లు.తలపై బట్టలు కట్టుకుని, చేతిలో ఫైళ్లు పట్టుకుని, కళ్లల్లో పిల్లలు పరీక్ష రాసేటప్పుడు ఉండే టెన్షన్స్‌ తో నిల్చున్నారు! ఆ లైన్స్‌  మధ్యలో యాభై ఐదేళ్ల ఇన్నోసెంట్‌ మామ్‌ టైప్‌ మహిళ లలిత. మిగతా వాళ్లంతా భయంతో, టెన్షన్స్‌ తో ఉంటే, ఆమె మాత్రం కూల్‌గా, ఎగ్జామ్‌ పేపర్‌ ముందే తెలిసిన స్టూడెంట్‌లా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. ఆ నవ్వులు చిందిస్తున్న ముఖాన్ని గమనించిన వెనుక నిల్చున్న మహిళ ఓపిక పట్టలేక అడిగింది: ‘‘నువ్వెన్నిసార్లు ఈ ఎగ్జామ్‌ రాశావు?’’లలిత నవ్వుతూ ‘‘ఇదే ఫస్ట్‌ టైమ్‌!’’ అంటే, వెంటనే ఆమె వంకరగా నవ్వుతూ ‘‘ఓహో! అందుకేనా, ఇంత కాన్ఫిడెన్స్‌.

నాకిది పదోసారి!’’లలిత ఆశ్చర్యంగా ‘‘ఏమయ్యింది? ఎందుకు అన్నిసార్లు ఫెయిల్‌ అయ్యావు?’’అంటే ఆమె ‘‘నా పేరు సూర్యకాంతం.’’లలిత ఒక్కసారిగా ‘‘అయ్యో! అందుకేనా పాస్‌ కాకుండా ఉన్నావు? నా పేరు లలిత. నేను చాలా మంచి అత్తను అబ్బా! అందుకే నాకు ఇంత కాన్ఫిడెన్స్‌. పైగా మా మేనకోడలు కూడా నన్ను మెచ్చుకుంది. ఈ కోచింగ్‌ సెంటర్‌లో ట్రైనింగ్‌ తీసుకుని సర్టిఫికెట్‌ తీసుకుంటే, ఇక పెళ్లికి ఏ అభ్యంతరం లేదని చెప్పింది!’’సూర్యకాంతం బాధగా ‘‘నా పేరు చెప్పగానే, నన్ను ‘గయ్యాళి అత్త’ లిస్ట్‌లో పెడతారు. వచ్చిన సంబంధాల్లో సగం ఇంటివరకు కూడా రాకుండానే ఆగిపోతుంటాయి. వచ్చినవి కూడా నేను సమాధానం సరిగా చెప్పలేదని పోతున్నాయి.’’లలిత నవ్వుతూ ‘‘ఏం చేస్తాం! ఇంతకాలం పెళ్లి చూపుల్లో అత్తలే ప్రశ్నలు అడిగేవారు. ఇప్పుడు కోడళ్ల రాజ్యం కదా! అందుకే కోడళ్లే అత్తలను ప్రశ్నలు అడుగుతున్నారు!’’అది విని సూర్యకాంతం తన గోడు చెప్పుకోవడం మొదలుపెట్టింది. 

‘‘ఇప్పుడున్న కోడళ్లు ప్రతి ఒక్కరు పరీక్షలు, షరతులు, రౌండ్స్‌. ఇలా వచ్చిన సంబంధాలన్నింట్లోనూ నేను ఫెయిల్‌. అందుకే మా వాడు ఈ ‘ఉత్తమ అత్త ట్రైనింగ్‌ సెంటర్‌’లో చేర్పించాడు. ఇక్కడ పెళ్లి చూపుల్లో పాస్‌ అయ్యేలా ట్రైనింగ్‌ ఇస్తారట!’’లలిత ‘‘అంటే ఇప్పటివరకు ఎంతమంది కోడళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పావ్‌?’’సూర్యకాంతం తల పట్టుకుని ‘‘మొదట సైలెంట్‌ కోడలు. ఆ అమ్మాయికి మాట్లాడటం ఇష్టం లేదు. నన్ను ఐదు నిమిషాలు నోరు మూసుకోమంది. నేను కిచెన్స్‌ లో మాడు వాసన వచ్చిందని, ‘పొయ్యి మీద ఏదో పెట్టి మర్చిపోయావమ్మా?’ అన్నా. అంతే, ఆ సంబంధం క్యాన్సిల్‌!’’లలిత ‘‘ఆహా! రెండోసారి?’’‘‘రెండోసారి మోడ్రన్స్‌  కోడలు. ‘నా పుట్టినరోజుకి ఏఐ యానిమేటెడ్‌ వీడియో చేసి రీల్‌ పెడతావా?’ అంది. నాకు అవి రాదనగానే ఆ సంబంధం కూడా ఫెయిల్‌.’’ఇంతలో లైన్‌ ముందుకు కదిలింది. ఇద్దరూ కూడా నడుస్తూనే మాటలు. 

సూర్యకాంతం ఎమోషనల్‌ ఫ్లోలో చెప్తూ.. ‘‘మూడోసారి వచ్చిన కోడలైతే వరుస ప్రశ్నలు:మీకు కొడుకు, కోడలును విడదీసే ప్లాన్స్‌ ్స ఏమైనా ఉన్నాయా?మీకు కాళ్లు చేతులు బాగానే పనిచేస్తున్నాయా? లేదా కోడలు వచ్చాక మంచాన పడతారా?మీకు చాడీలు చెప్పే అలవాటు ఉందా? మీ కూతురుతో నన్ను కంపేర్‌ చేస్తారా?నేను సంతోషంగా ఉంటే మీ మూతి వంకరపోతుందా?  మీకు పెళ్లి అయిన రెండో నెలలోనే కోడలికి కడుపు రావాలని కోరుకుంటారా? మీ పని మీరు చూసుకుంటారా? లేదా అన్ని పనులూ మీరు చెప్పినట్లే చేయాలని అంటారా? మీ కోడలు బంగారం, కారు లేదా ఖరీదైన వస్తువులు ఏమైనా కొంటే, మీ బీపీ పెరిగిపోతుందా?మీ కూతురుకి పుట్టిన పిల్లలు అబ్దుల్‌ కలాంలానూ, కోడలికి పుట్టిన పిల్లలు ఆవారాగానూ కావాలనే కోరికలు ఏమైనా ఉన్నాయా? అని వరుస ప్రశ్నలతో నన్ను ఆసుపత్రికి పంపించింది!’’సూర్యకాంతం ఇవన్నీ  చెప్తుంటే, లలిత ముఖం చిన్నబోయింది.

‘‘ఇన్ని అడుగుతారా?’’ అంటూ ఆశ్చర్యంగా అడిగింది.సూర్యకాంతం ‘‘ఇంకా ఏం! ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ కూడా చెక్‌ చేస్తారు! అత్తమామలకు షుగర్, బీపీ ఉంటే ముందే రిజెక్ట్‌ చేస్తారు. నాకు షుగర్‌ లేదు కానీ బీపీ ఉంది!’’ అనగానే లలిత నవ్వు ఆపుకోలేకపోయింది.వెంటనే, సూర్యకాంతం ‘‘ఇప్పుడు వచ్చిన సంబంధం చాలా బాగుంది. మా వాడు ఎలాగైనా పాస్‌ అవ్వమ్మా అని రోజూ బతిమాలుతున్నాడు. ఆ సంబంధానికి మూడు రౌండ్ల పరీక్ష మెయిన్స్‌ ్స, ఇంటర్వ్యూ, ప్రాక్టికల్స్‌ అంట!’’లలిత ‘‘ఏంటీ ప్రాక్టికల్స్‌?’’సూర్యకాంతం ‘‘పెళ్లికూతురు రెండు రోజులు మా ఇంటికి వచ్చి నన్ను గమనిస్తుందట!’’పక్కనే మరో మహిళ వచ్చి ‘‘అప్పుడు నువ్వు ఉదయం లేవగానే ‘గుడ్‌ మార్నింగ్‌’ అంటూ టీ ఇచ్చేసి మచ్చిక చేసుకో! సెట్టయిపోతుంది!’’ వారిద్దరూ నవ్వుకున్నారు.

సూర్యకాంతం మరోసారి విషయానికి వచ్చి ‘‘పాతకాలంలో అత్తలు చేసిన పెత్తనం ఫలితమే ఇదంతా, ఇప్పుడది తిరిగి మనకు శాపంగా మారి కోడళ్ల రాజ్యం వచ్చేలా చేసింది. వాళ్లే బాగుండి ఉంటే మనకు ఈ బాధ ఉండేదే కాదు.’’వెంటనే, వెనుక నిల్చున్న రాధ స్పందిస్తూ, ‘‘అవునమ్మా! మా అత్త నన్ను పెళ్లి చూపుల్లోనే నడవమని చెప్పి, ఇంట్లో పనులకు బాగా పనికి వస్తానా లేదా చెక్‌ చేసుకుంది! ఇక పెళ్లి తర్వాత అయితే, కూర్చోవడం నుంచి ఎలా నవ్వాలో, ఏడ్వాలో కూడా డైరెక్షన్స్‌ ఇచ్చేది!’’వెంటనే మరో మహిళ ‘‘ఇక ఏ రోజు అయినా, నేను కాస్త ఆరోగ్యం బాగోలేక మంచం మీద వాలితే చాలు, మా అత్త ఆసుపత్రిలో అడ్మిట్‌ అవుతుండేది. ‘ఈ కోడల్ని నేనే చూసుకోవాలేమో!’ అన్న భయంతో!’’మళ్లీ మరో మహిళ వాయిస్‌– ‘‘మా అత్త అయితే, మా ఆడపడుచుతో ఫోన్స్‌  మాట్లాడేటప్పుడు సిగ్నల్‌ బాగోలేదంటే నా దగ్గరే అన్స్‌ లిమిటెడ్‌ కాల్‌ రీచార్జ్‌ చేయించుకునేది!’’సూర్యకాంతం నవ్వుతూ ‘‘అదేమిటి! సీరియల్స్‌ చూసి స్ట్రాటజీలు నేర్చుకోవడానికి అన్స్‌ లిమిటెడ్‌ నెట్, డిష్‌ రీచార్జ్‌లు కూడా నీతోనే చేయించుకునేదని మర్చిపోయావా?’’వెంటనే అందరి దగ్గర నవ్వులు ‘‘అవునవునూ’’ అని అందరూ ఒకటేసారి రెచ్చిపోయారు.

మరొక మహిళ ‘‘ఇంతకు ముందు అత్తలు కట్నాల కోసం మాత్రమే కష్టపెట్టేవారు. మన అత్తలు కట్నాలతో పాటు కోడళ్ల జీతాలు అడిగితే లోకం మారదూ!’’సూర్యకాంతం కాస్త ఊపిరి వదిలి ‘‘అందుకే పాత అత్తల వేషాలు చూసి అప్పటి కోడళ్లు అమ్మాయిలనే కనేసి ఈ బాధను రివర్స్‌ చేశారు.’’లలిత ‘‘కాని, ఇప్పుడు కూడా బాధితులం మనమే అయ్యాం కదా!’’సూర్యకాంతం పెదవి తిప్పేస్తూ, ‘‘అవును, కాని, మేం కూడా బాధితులమే. అయినా మేం మా అత్తల్లాగా చేయం. కావాలంటే ఏ వృద్ధాశ్రమంలో అయినా చేరుతాం. కావాలంటే సపరేట్‌గానైనా ఉంటామని చెప్పినా కూడా ‘పరీక్ష పాస్‌ అయితేనే పెళ్లి!’ అని పెళ్లికూతుళ్లు, వాళ్ల తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చెప్తున్నారు.’’లలిత ‘‘అంటే అప్పుడు, ఇప్పుడు కూడా కష్టాలు పడాల్సింది మనమేనా?’’సూర్యకాంతం ‘‘అవునమ్మా, నాకు అబ్బాయి పుట్టిన రోజు.. ఎంత ఊపిరి పీల్చుకున్నానో! నాకు కూతురు పుట్టలేదు, హమ్మయ్య అని. పైగా అబ్బాయి పుట్టినందుకు శివయ్యకు వెయ్యి టెంకాయలు కొట్టి, మొక్కు చెల్లించుకున్నా.’’వెంటనే వెనక ఉన్న మరో ఫెమినిస్ట్‌ బామ్మ యాంగ్రీ బర్డ్‌ ఫేస్‌ పెట్టి.. ‘‘అదేంటీ? అమ్మాయి పుట్టకూడదని అనుకున్నావా? ’’ అని కాస్త గట్టిగానే అడిగింది. 

పాత కాలంలో అత్తలు చేసిన పెత్తనం ఫలితమే ఇదంతా, ఇప్పుడది తిరిగి మనకు శాపంగా మారి కోడళ్ల రాజ్యం వచ్చేలా చేసింది. వాళ్లే బాగుండి ఉంటే మనకు ఈ బాధ ఉండేదే కాదు. 

అందరూ ఒక క్షణం అయిష్టంగా చూడగా.. సూర్యకాంతం చాలా శాంతంగా ‘‘నువ్వు కాస్త ఆగుతావా.. మొదట మా అత్త వేసే వేషాలు చూసి, నా మాదిరే మా కూతురు కూడా కష్టపడి చదువుకొని, సంపాదించి చివరికి ఇంట్లో ఇలా ప్రతిక్షణం పరీక్షలు రాసుకుంటూ బతకాలి అనిపించి. అలా అనుకున్నానమ్మా!’’ అదంటూనే క్యూలో ఉన్న అత్తలందరూ సేమ్‌ ఫీలింగ్‌తో తల ఊపారు.‘‘ఇప్పుడిలా అమ్మాయిల జీవితాలు స్మార్ట్‌గా, స్వేచ్ఛగా మారి, అబ్బాయిల తల్లులకే ఇలాంటి శిక్షలు వస్తాయని తెలిసుంటే, అప్పుడే ఆ టెంకాయలన్నీ నా తల మీదే కొట్టుకునేదాన్ని!’’అని సూర్యకాంతం ముఖం చిట్లించగానే, మొత్తం క్యూలో నిల్చున్న అత్తలందరూ, ‘సాడ్‌ ఫేస్‌’ పెట్టుకున్నారు. అప్పుడే పక్కన ‘‘సమోసాలమ్మా! సమోసాలు!’’ అని ఓ అబ్బాయి అటుగా వెళ్తుంటే, సూర్యకాంతం అతన్ని ఆపి, ‘‘ఓ బాబు, నాలుగు సమోసాలు పెట్టమ్మా. కాస్త కడుపు నింపుకుందాం.’’ అని డబ్బు అతని చేతికి ఇచ్చింది. అతను కూడా ఓ పేపర్‌లో సమోసాలు ఇచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

సూర్యకాంతం ఒకటి గబగబా కొరికేసి, పేపర్‌ వైపు చూసింది.‘‘అయ్యో! ఇది ఇవాళ్టి పేపరే కదా? అప్పుడే ఉదయం పేపర్, బజ్జీల బండికి  వచ్చేసిందా?’’ అని తలపైకెత్తి చూస్తూ, ‘‘ఏంటీ? నా బాధ చెప్పేలోపే సాయంత్రం అయిపోయిందా?’’ అని కోచింగ్‌ సెంటర్‌ గేట్‌ దగ్గరకు పరుగులు తీసింది. ఇంతలో ఒక సెక్యూరిటీ గార్డు క్లోజింగ్‌ బోర్డ్‌ గేటుకు తగిలిస్తూ.. ‘‘ఇవాళ్టి అడ్మిషన్స్‌ అయిపోయాయి! రేపు ఉదయం మళ్లీ ట్రై చేయండి! ’’ అని చెప్పి, సూర్యకాంతం బ్యాచ్‌ను అక్కడి నుంచి పంపించేశాడు. సూర్యకాంతం మూడు సమోసాలు చేతిలో, నాల్గోది నోట్లో పెట్టుకుని నడుస్తూ ‘‘అమ్మో! ఈ కోచింగ్‌ సెంటర్‌ అడ్మిషన్స్‌  దక్కలేదంటే నా కొడుకు ఎంత ఫీల్‌ అవుతాడో! పాపం!’’అంటూ కాస్త భయంగా, ఇంకాస్త సంతోషంగా ఇంటికి బయలుదేరింది. ఇంటికి చేరుకున్న వెంటనే, సూర్యకాంతం ఎదుట అప్పటికే ఒక గ్లాస్‌ ‘ఎమోషనల్‌ జ్యూస్‌’ను కళ్లల్లోంచే కార్చేసిన కొడుకు కనిపించాడు. కొడుకు చేతులు జోడించి ‘‘అమ్మా, ప్లీజ్‌! పెళ్లికూతురి తల్లి సర్టిఫికేట్‌ తప్పకుండా కావాలంది. లేకపోతే పెళ్లి కాదు!’’ అన్నాక, సూర్యకాంతం ఏం మాట్లాడకుండా, కళ్లతోనే ‘‘రేపు తప్పకుండా సాధిస్తా’’అనే భరోసా ఇచ్చి, నిద్రపోవడానికి గదిలోకి వెళ్లిపోయింది.

కోడళ్ల పుట్టింటి ఇష్యూస్‌ చాలా సెన్సిటివ్‌.. పుట్టింటిపై అమ్మాయికి విపరీతమైన ప్రేమ ఉంటే, వెంటనే ‘తిరిగి రమ్మని’ చెప్పకూడదు.  

అమ్మను తిట్టలేక, మరీ మరీ బతిమాలలేక, కొడుకు కూడా గదిలోకి వెళ్లిపోయాడు.తర్వాతి రోజు ఉదయం 5 గంటలు.. ఈసారీ అందరికంటే ముందే సూర్యకాంతంతో పాటు లలిత, రాధ, జానకి, విశాలాక్షి అలా ఆమె మొత్తం ‘అత్తల బ్యాచ్‌’ క్యూలో ఫస్ట్‌లోనే నిలబడ్డారు.ఉదయం ఎనిమిది గంటలకు అడ్మిషన్స్‌  తీసుకుని, తొమ్మిదికల్లా క్లాస్‌లోకి బ్లాక్‌బస్టర్‌ ఎంట్రీ ఇచ్చేశారు!తర్వాత ఫుల్‌ జోష్‌తో ఆ ఒక నెల కోర్సు: కోడళ్ల సైకాలజీ,ఫ్యామిలీ రిలేషన్స్‌  మేనేజ్‌మెంట్,కోడళ్ల మూడ్‌ స్వింగ్స్‌ డీకోడ్‌ టెక్నాలజీ,అత్తగా నడుచుకోవాల్సిన విధానాలు, అత్త ఎప్పుడెప్పడు మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడకూడదు?ఏ పనులు మాత్రమే అత్త చేయాలి, ఏ పనులు అసలు చేయకూడదు! ఇలాంటివన్నీ బాగా నేర్చుకుని, ప్రాక్టీస్‌ చేసి, చివరికి మొత్తం బ్యాచ్‌ ‘సర్టిఫైయిడ్‌ అత్తగార్లుగా’ బయటికి వచ్చేశారు.

సరిగ్గా ఒక నెల తర్వాత సూర్యకాంతం ఎగ్జామ్‌ డే వచ్చేసింది. ఆ రోజు సూర్యకాంతం అలారం పెట్టుకుని, ఉదయం త్వరగా లేచింది. కోచింగ్‌లో నేర్పించిన పాఠాలన్నీ రివైజ్‌ చేసి, ‘ముఖ్యమైన ప్రశ్నల’ సమాధానాలను బట్టీకొట్టి రెడీ అయింది. ‘‘పట్టుచీర కట్టుకుంటే, పెళ్లికూతురు ఫీల్‌ అవుతుందేమో’’ అని అనుకుంటూ, తన ఫేవరెట్, అన్నయ్య కొనిచ్చిన సెంటిమెంట్‌ చీర కట్టుకుంది. దేవుడికి దండం పెట్టుకుని, ఫ్యామిలీతో కలిసి కొడుకు పెళ్లిచూపులకు బయలుదేరింది. సూర్యకాంతం మాత్రం టెన్షన్స్‌ తో వణుకుతుండగా, ఆమె కోచింగ్‌ బ్యాచ్‌ ఫ్రెండ్స్‌ సైలెంట్‌ సపోర్ట్‌గా పక్కనే కూర్చున్నారు. టేబుల్‌పై టీ గ్లాసులు, పూలదండలు, కొబ్బరికాయలు ఇలా సంప్రదాయ పెళ్లిచూపుల ఆంబియన్స్‌తో పెళ్లి సంబంధం వాళ్ల ఇల్లు ఉంది. పక్క గదిలోనే, అమ్మాయితో పాటు, ప్రశ్నపత్రం తీసుకొచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు కూడా సిద్ధంగా కూర్చున్నారు. 

అమ్మాయి నెమ్మదిగా హాల్లోకి వచ్చి కూర్చుంది.సూర్యకాంతాన్ని చూసి ‘‘మీరు సిద్ధంగా ఉన్నారా?’’ అని అడిగింది. సూర్యకాంతం భయంతో తల ఊపింది.అమ్మాయి చిన్నగా నవ్వుతూ, ఆమె తల్లి చేతిలోని పేపర్‌ తీసుకుని ప్రశ్నలు అడగటం మొదలుపెట్టింది. మొదటి ప్రశ్న: ‘‘ఉదయం మీ అబ్బాయి ఆఫీస్‌కి వెళ్లిన తర్వాత, మీరు ఎంతసేపు నాకు ‘తలనొప్పి ఉంది’ అని చెప్పి, గదిలోకి వెళ్లకుండా ఉండగలరు?’’సూర్యకాంతం కంగారు పడుతూ ‘‘చాలాసేపు ప్రయత్నిస్తా!’’ అని చెప్పింది.రెండో ప్రశ్న: ‘‘కోడలు చేసిన చపాతీ రౌండ్‌గా లేకపోతే ఏం చేస్తారు?’’ సూర్యకాంతం ‘‘వాట్‌ ఏన్‌ అమీబా చపాతీ! అనుకుంటూ తినేస్తా!’’ వెంటనే, సూర్యకాంతం ఫ్రెండ్స్‌ క్లాప్స్‌ కొట్టి ధైర్యం నింపారు. మూడో ప్రశ్న: ‘‘కోడలు పుట్టింటికి వెళ్తే ఎన్ని రోజులకు మీరు ఫోన్స్‌  చేస్తారు?’’ ఈ ప్రశ్నకు సూర్యకాంతం చాలాసేపు ఆలోచించింది.

ఇది ఒక ట్రికీ ప్రశ్న అని వెంటనే గ్రహించి, కోచింగ్‌ సెంటర్‌లో నేర్పిన ‘క్రిటికల్‌ థింకింగ్‌ మోడ్‌’ని యాక్టివేట్‌ చేసింది.అమ్మాయి ఇంటిని ఒక్కసారి పూర్తిగా గమనించింది. ‘కోడళ్ల పుట్టింటి ఇష్యూస్‌ చాలా సెన్సిటివ్‌... పుట్టింటిపై అమ్మాయికి విపరీతమైన ప్రేమ ఉంటే, వెంటనే ‘తిరిగి రమ్మని’ చెప్పకూడదు. ‘అదే పుట్టింటి కంటే అత్తింట్లోనే ఆ అమ్మాయికి బాగుంటే వెంటనే పిలవాలి.’ అని తనలో తాను అనుకుంది. అలా కోచింగ్‌లో నేర్పినట్లే సిచ్యుయేషన్స్‌ ను అంచనా వేసి, చాలా తెలివిగా ‘‘ఒక గంటకే ఫోన్స్‌  చేస్తా. జాగ్రత్తగా చేరావా? అని తెలుసుకుంటా. తర్వాత తీరిక దొరికినప్పుడు నిన్నే తిరిగి కాల్‌ చేయమని చెప్తా.’’ అని సమాధానం చెప్పింది.
అది విన్న వెంటనే సూర్యకాంతం ఫ్రెండ్స్‌ కళ్లతోనే ‘‘అద్భుతం! టాప్‌ ఆన్సర్‌!’’ అని అభినందనలు కురిపించారు.అప్పుడే అమ్మాయి లేచి, అత్తగారిని హత్తుకుంది. అబ్బాయి సగం ఆనందంతో ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే, అందరూ చప్పట్లతో పెళ్లి గంటలు  మోగించారు.

సూర్యకాంతం పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నానని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నెల తిరగకముందే నిశ్చితార్థం, పెళ్లి, అన్ని పనులూ చకచకా పూర్తి చేసి, వారిద్దరినీ హనీమూన్స్‌ కి పంపించేసింది. నూతన దంపతులను హనీమూన్స్‌ కి పంపిన వెంటనే, సూర్యకాంతం కూడా ‘‘నాకు కూడా కాస్త బ్రేక్‌ కావాలి!’’ అంటూ, తన ఫ్రెండ్స్‌ అందరితో కలిసి తీర్థయాత్రలకు వెళ్లిపోయింది.అలా దేవుడిని దర్శించుకుంటూ, కొంచెం మానసిక ప్రశాంతత, కొంచెం స్వేచ్ఛ, కొంచెం ఆనందం ఇవన్నీ ఆస్వాదిస్తూ, రెండు నెలల తర్వాత  తిరిగి ఇంటికి చేరుకుంది.ఇంటికి వచ్చిన వెంటనే కోడలు ఆప్యాయంగా పలకరిస్తూ ‘‘అత్తగారూ, ఒక గుడ్‌ న్యూస్‌! మీరు వెంటనే ‘ఉత్తమ నాన్నమ్మగా మార్చే కోచింగ్‌ సెంటర్‌’లో జాయిన్స్‌  కావాలి. నేను తల్లి కాబోతున్నా!’’ అని చెప్పగానే, సూర్యకాంతం అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.‘‘అయ్యో దేవుడా! ఇప్పుడే అత్త పరీక్ష పాస్‌ అయ్యా, ఇప్పుడు మళ్లీ నాన్నమ్మ పరీక్షా?!’’ అని ఏడుస్తూ దేవుడిని ప్రశ్నించింది. ఆమె వెనకనే వచ్చిన కోడలి తల్లి సత్య, సూర్యకాంతాన్ని చూస్తూ, ‘‘నీకు బాగా అయ్యింది!’’ అంటూ పకపకా నవ్వుతూనే ఉంది.

ఇంతలో ఒక మహిళ వాయిస్, ‘‘అమ్మాయి సత్యా, సత్యా.. నిద్ర లేయ్‌! ఎందుకలా నిద్రలోనే నవ్వుకుంటున్నావ్‌?’’ అని గట్టిగా పిలిచింది.సత్యా ఒక్కసారిగా నిద్రలేచి చూసింది. ఎదురుగా ఆమె అత్తగారు. ఆమె చేతులు నడుముపై పెట్టుకుని ‘‘అమ్మాయి సత్యా! నీకు ఆఫీస్‌కి టైమ్‌ అవుతోంది. వెళ్లి త్వరగా నాకు టీ పెట్టి, లంచ్‌ చేసుకుని, ఆఫీస్‌కి రెడీ అవ్వు!’’ అంటూ సత్యను కిచెన్‌ వైపు పంపింది. సత్యా మనసులో ‘‘అయ్యో! ఇదంతా కలా?’’ అనుకుంటూనే, తన స్నేహితురాలు సూర్యకు ఫోన్స్‌  చేసింది. ‘‘ఓసేయ్‌ సూర్య! నిన్న నన్ను ‘నీకు ఇద్దరూ ఆడపిల్లలేనా?’ నేను ఎంత అదృష్టవంతురాలినో! నాకు అబ్బాయి పుట్టాడు! అని నన్ను అవమానించావుగా.. ఒక ఇరవై ఏళ్లు ఆగు. ఎవరి అదృష్టం ఏంటో అప్పుడు తెలుస్తుంది!’’ అని చెప్పి ఫోన్స్‌  కట్‌ చేసింది.ఫోన్స్‌  అవతల సూర్యా ఇంకా అయోమయంలో ఉండగా, ఇవతల సత్య మాత్రం శ్రీకృష్ణుడి భార్య సత్యభామ కంటే ఎక్కువ గర్వంతో, చిన్న చిరునవ్వుతో తన రోజును ప్రారంభించింది.  

-దీపిక కొండి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement