చిత్రకూట పర్వతానికి సమీపంలో కామదారణ్యం ఉంది. అపారమైన వృక్షసంపదతో, వనచరాలతో, పక్షుల కిలకిలరావాలతో అలరారే కామదారణ్యం పరమ పవిత్రమైన తపోభూమి.
తపోధనులకు పెన్నిధిలాంటి కామదారణ్యంలో బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షి తన భార్య అనసూయతో కలసి ఆశ్రమం ఏర్పరచుకుని, తపోనిష్ఠతో ఉండేవాడు.
కొంతకాలానికి కామదారణ్యంలో అనావృష్టి ఏర్పడింది. చెట్లు చేమలు ఎండిపోయాయి. మహావృక్షాలు సైతం మోడువారిపోయాయి. అరణ్యంలోని వాపీ కూప తటాకాది జలవనరులన్నీ ఎండిపోయాయి. ఆహారం దొరకక పశు పక్ష్యాదులు అల్లాడిపోయాయి. మోడువారిన వృక్షాలను ఆశ్రయించుకుని ఉన్న పక్షులు ఎండుటాకుల్లా నేలరాలాయి. కనుచూపు మేరలో పచ్చదనం కనిపించని పరిస్థితులు దాపురించాయి. నేల బిరుసెక్కి బీటలువారింది.
పచ్చని అరణ్యం ఎండిపోవడంతో పశుపక్ష్యాదులు కళ్ల ముందే నశించిపోతుండటం చూసి, భూతదయ గల అనసూయ అమితంగా కలత చెందింది.
‘స్వామీ! అనావృష్టి వల్ల పచ్చని అడవి ఎండిపోయింది. ఆకలి దప్పికలను తీర్చుకోలేక వన్యప్రాణులన్నీ కళ్లముందే నశిస్తున్నాయి. ఈ ప్రాణి వినాశనాన్ని చూడలేకున్నాను. ప్రాణులను రక్షించడానికి వర్షాగమనం కోసం వరుణదేవుడిని ప్రార్థించండి’ అని భర్తను కోరింది.
అనావృష్టి కారణంగా జరుగుతున్న ప్రాణినష్టానికి అత్రి మహర్షి కూడా ఆవేదన చెంది, గంగాధరుడైన పరమశివుడిని ధ్యానిస్తూ తపస్సు ప్రారంభించాడు. రోజుల తరబడి ఆయన తపస్సు కొనసాగుతున్నా, కామదారణ్యంలో చినుకు జాడ లేదు. అనసూయ తపోనిష్ఠలో ఉన్న భర్తను సేవించుకుంటూనే, ఆశ్రమంలో మట్టితో ఒక పార్థివ శివలింగాన్ని ప్రతిష్ఠించి, నిత్యం పూజించసాగింది.
అనసూయ నియమనిష్ఠలకు, అత్రి మహర్షి తపస్సుకు పరవశుడైన పరమశివుడు గంగా పార్వతీ సమేతంగా కామ్యదారణ్యానికి అరుదెంచాడు. తగిన తరుణం కోసం అక్కడే వేచి ఉండసాగాడు.
ఒకనాడు అత్రిమహర్షి ధ్యానసమాధి నుంచి బయటకు వచ్చాడు.
‘దాహంగా ఉంది. మంచినీళ్లు తీసుకురా’ అని భార్యను కోరాడు.
ఆ సమయానికి ఆశ్రమంలో చుక్కనీరైనా లేకపోవడంతో అనసూయ కలశాన్ని తీసుకుని, అడవిలోకి వెళ్లింది. ఎక్కడైనా నీటిజాడ కనిపిస్తుందేమోనని వెదుకుతూ ముందుకు సాగింది. ఎంత దూరం వెళ్లినా ఆమెకు ఎక్కడా నీటి జాడ కనిపించలేదు.
అనసూయ నీటి కోసం వెదుకుతూ అలా ముందుకు వెళుతుండగా, ఒకచోట గంగాదేవి ఒక గిరిజన వనిత రూపంలో కనిపించింది.
‘ఎవరమ్మా నువ్వు! ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు?’ అని ఆమె అనసూయను ప్రశ్నించింది.
‘చిరకాలం తపస్సమాధిలో ఉన్న నా భర్త ఇందాకే తపో విరమణ చేశాడు. ఆయన దాహార్తితో నీళ్లు తెమ్మన్నాడు. అందుకే నీటి కోసం వెదుకుతున్నాను. దగ్గరలో నీరు దొరికే చోటు నీకేమైనా తెలిస్తే చెప్పవా?’ అభ్యర్థించింది అనసూయ.
‘ఇక్కడే నువ్వు నిలుచున్న తావునే చేయిలోతు గోతిని తవ్వు. నీళ్లు దొరుకుతాయి’ అని చెప్పిందామె.
అనసూయ ఆమె చెప్పినట్లే అక్కడ గొయ్యి తవ్వింది. చేయిలోతు తవ్వగానే స్వచ్ఛమైన నీరు ఉబికి వచ్చింది. ఆ నీటితో అనసూయ కలశాన్ని నింపుకుంది. చూస్తుండగానే అక్కడ స్వచ్ఛజలంతో నిండిన చక్కని తటాకం ఏర్పడింది.
‘కరుణామయీ! నువ్వు దేవతాస్త్రీలా ఉన్నావు. దయచేసి నేను నా భర్తతో కలసి తిరిగి వచ్చే వరకు ఇక్కడ ఉండవూ! ఇప్పుడే మేమిద్దరం వచ్చి నీ దర్శనం చేసుకుంటాము’ అని అభ్యర్థించింది అనసూయ.
ఆమె సరేనని పలికింది.
అనసూయ ఆశ్రమానికి చేరుకుని, భర్తకు మంచినీరు ఇచ్చింది. ఆయన తృప్తిగా నీరుతాగి, ‘ఎక్కడా చినుకు జాడ లేకున్నా, ఇంత స్వచ్ఛమైన నీరు ఎక్కడ దొరికింది?’ అని ఆశ్చర్యంగా అడిగాడు.
అనసూయ భర్తకు జరిగినదంతా చెప్పింది. వెంటనే ఇద్దరూ కలసి అడవిలో జలతటాకం ఏర్పడిన చోటుకు వెళ్లారు. అప్పటి వరకు గిరిజన వనిత రూపంలో ఉన్న గంగాదేవి వారికి నిజరూపంలో దర్శనమిచ్చింది. ‘ఏ వరం కావాలో కోరుకోండి’ అని ఆ దంపతులను అడిగింది.
‘తల్లీ! ఈ తపోవనంలో నువ్వు నిత్యనివాసం ఉండాలి’ అని వారు ప్రార్థించారు.
‘మీ దంపతులు ఏడాదికాలం శివార్చన ఫలాన్ని ధారపోస్తే ఇక్కడే శాశ్వతంగా ఉంటాను’ అని పలికింది గంగ.
వెంటనే అత్రి మహర్షి, అనసూయ దంపతులు తమ శివార్చన ఫలాన్ని ధారపోశారు. వారి దీక్షకు మెచ్చిన పరమశివుడు పార్వతీసమేతంగా ప్రత్యక్షమయ్యాడు. ముని దంపతుల కోరికపై అనసూయ అర్చిస్తూ వచ్చిన పార్థివలింగంలోకి తేజోరూపంలో లీనమయ్యాడు. అనసూయ అర్చించిన ఆ శివలింగమే అత్రీశ్వర లింగంగా పురాణ ప్రసిద్ధి పొందింది.
∙సాంఖ్యాయన


