కథల కళల బండిలో బడిబాటకు... | Rouble Nagi wins Global Teacher Prize 2026 | Sakshi
Sakshi News home page

కథల కళల బండిలో బడిబాటకు...

Feb 22 2026 5:42 AM | Updated on Feb 22 2026 5:42 AM

Rouble Nagi wins Global Teacher Prize 2026

పురస్కారం

‘పిల్లలందరూ ఆర్టిస్ట్‌లే. ఆర్టిస్ట్‌లందరూ పిల్లలే’ అనే మాట ఉంది. రూబుల్‌ నాగి ప్రసిద్ధ మ్యూరల్‌ ఆర్టిస్ట్‌ మాత్రమే కాదు. పిల్లల మనసు చిత్రం తెలిసిన మనసెరిగిన మహిళ. ‘రూబుల్‌ నాగి ఫౌండేషన్‌’ ద్వారా దేశవ్యాప్తంగా వందలాది మంది పేదింటి పిల్లలకు విద్య అందిస్తోంది. తన కృషికి గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌–2026’ అందుకుంది. ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’ అనేది యునెస్కో సహకారంతో యూకేలోని వర్కీ ఫౌండేషన్‌ ఇచ్చే వన్‌ మిలియన్‌ డాలర్‌ల అవార్డ్‌...

‘రూబుల్‌ నాగి విద్యావేత్త. అణగారిన వర్గాల పిల్లలకు అక్షరాన్ని చేరువ చేసిన మార్గదర్శి’ అని ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’ అవార్డు కమిటీ అభివర్ణించింది. 130 దేశాల నుండి వచ్చిన 5,000 నామినేషన్‌ల నుండి నాగిని అవార్డు కోసం ఎంపిక చేశారు. జమ్మూకశ్మీర్‌లో పుట్టిన నాగి రాజకీయ శాస్త్రంలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది. తరువాత లండన్‌లోని స్లేడ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌లో చదువుకుంది. సోథెబీస్‌ లండన్‌లో యూరోపియన్‌ ఆర్ట్‌ను అభ్యసించింది.

చదువు పూర్తయిన తరువాత ‘న్యూ డిజైన్‌ స్టూడియో’ ప్రారంభించి ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుంది. 800 మ్యూరల్స్‌ వేసింది. 150పైగా ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌లు నిర్వహించింది. రాష్ట్రపతి భవన్‌ మ్యూజియంలో నాగి కళాకృతులను ప్రదర్శించారు. వీటిని రాష్ట్రపతి స్వయంగా ఎంపిక చేయడం విశేషం.

కళ పేదల కోసం
‘కళ కళ కోసమే’ అనేది ఒక వాదం. ‘కళ ప్రజల కోసం’ అనేది మరో వాదం. నాగి రెండో మార్గాన్ని ఎంచుకుంది. ఆర్టిస్ట్‌గా ఏకాంత దీవిలో, ఊహల మధ్య మాత్రమే ఉండిపోలేదు ఆమె.  సామాన్య ప్రజల మధ్యకు వచ్చింది. ‘సమాజం కోసం ఏం చేయగలను?’ అని ఆలోచించింది. తన దగ్గర ‘కళ’ అనే శక్తి ఉంది. ఆ శక్తిని ఉపయోగించి చదువుకు దూరం అయిన పేదపిల్లలకు చదువును దగ్గర చేయాలని నిర్ణయించుకుంది.

లెర్నింగ్‌ సెంటర్‌లతో...
దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో, ఎన్నో గ్రామాల్లో 800 లెర్నింగ్‌ సెంటర్‌లను ప్రారంభించింది. ‘కళ’ అనే మాధ్యమంతో వందలాది మంది పేద పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించింది. ఈ విద్యాకేంద్రాలకు ముందు పిల్లలెవరూ బడి ముఖం చూడలేదు. అక్షరం ముక్క రాదు. అలాంటి పిల్లలు కూడా లెర్నింగ్‌ సెంటర్‌లో చేరిన తరువాత చదువులో అద్భుత ప్రతిభ చూపుతున్నారు. పెద్ద స్కూల్స్‌లో చదివేవారితో సమానంగా పోటీ పడుతున్నారు. 

లెర్నింగ్‌ సెంటర్‌లు ప్రారంభించడానికి ముందు ‘పిల్లలు బడికి ఎందుకు దూరం అవుతున్నారు?’ అనే కోణంలో అధ్యయనం చేసింది నాగి. పేదరికం, ఇంటిపనులు, పొలం పనులు, బాల కార్మిక వ్యవస్థ... ఇలా ఎన్నో కారణాలు కనిపించాయి.  ఈ కారణాలను అడ్డంకులుగా భావించలేదు. ప్రత్యామ్నాయ మార్గాలు, స్ఫూర్తిదాయకమైన మాటలతో ఎంతోమంది పేదపిల్లలు బడి బాట పట్టేలా చేసింది. విద్యారంగంలో నాగి చేసిన రెండు దశాబ్దాల కృషికి గుర్తింపుగా ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’ దక్కింది.

పిల్లలతో కలిసిపోయి...
రూబుల్‌ నాగి దేశమంతటా విస్తృతంగా ప్రయాణిస్తుంటుంది. విద్యాకేంద్రాలలో పిల్లలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటుంది. ఆరువందల మందికి పైగా స్వచ్ఛంద సేవకులు ఆమె సైన్యం. విద్యాకేంద్రాల ద్వారా ఎంతోమంది ఉపాధ్యాయులకు ఉపాధి కల్పిస్తోంది.

ఆ మాటే మంత్రంగా...
కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలోని నాగి ఆర్ట్‌ స్టూడియోకు దగ్గరలోని మురికివాడ నుంచి ఒక పిల్లాడు వచ్చి ఆర్ట్‌వర్క్స్‌ను ఆసక్తిగా చూస్తున్నాడు. ‘ఏ క్లాసు చదువుతున్నావు?’ అని అడిగింది నాగి. ‘చదవడం లేదు’ అన్నాడు. 

‘ఎందుకు?’ అని అడిగితే ‘మా దగ్గర డబ్బులు లేవు’ అన్నాడు. ఆ మాట నాగిని బాగా ఆలోచించేలా చేసింది. స్టూడియో అనే నాలుగు గోడలకే పరిమితం కావద్దు అని నిర్ణయించుకుంది. మరుసటి రోజే మురికి వాడకు వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకుంది. తన ఆర్ట్‌తో మురికివాడలలోని గోడలను అందంగా కనిపించేలా చేసింది. రెండో అడుగుగా లెర్నింగ్‌ సెంటర్‌లను ప్రారంభించింది.  ‘క్లాస్‌రూమ్‌లో మాత్రమే పాఠాలు’ అని కాకుండా చెట్ల కింద, ప్రకృతి మధ్య పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.
‘విద్యా కార్యక్రమాలు మరింతగా విస్తరించడానికి, నైపుణ్య ఆధారిత, డిజిటల్‌ అభ్యాస కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి ఈ ప్రైజ్‌మనీ వినియోగిస్తాను’ అని చెప్పింది రూబుల్‌ నాగి.          

సవాళ్లు ఉన్నాసరే...
మురికివాడల్లో మేము గోడలపై పెయింటింగ్‌ వేస్తున్నప్పుడు పిల్లలు గుమిగూడేవారు. ‘మీలో ఎవరికైనా కథ వినాలని ఉందా?’ అని అడిగితే ‘నేను వింటాను’ అంటూ అందరూ ఉత్సాహంగా స్పందించేవారు. అలా కథలు, బొమ్మల ద్వారా వారు బడిలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేశాం. మా ప్రయత్నం విజయవంతం అయింది. ఆర్ట్‌–బేస్డ్‌ లెర్నింగ్‌ ప్రక్రియ ద్వారా పిల్లలు పాఠాలను సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నాలుగు గోడల మధ్యే పాఠాలు చెప్పాలనుకోలేదు. ఆసక్తిగా చెబితే పిల్లలు ఆరుబయట కూర్చోనైనా వింటారు. రెండు మూడు రోజులు లెర్నింగ్‌ సెంటర్‌కు వచ్చిన విద్యార్థి మరుసటి రోజు రాకపోతే మా వాలెంటీర్‌లు ఆ విద్యార్థి ఇంటికి వెళతారు. కారణం ఏమిటో తెలుసుకుంటారు. ఆ విద్యార్థి రోజూ స్కూల్‌కు వచ్చేలా చేస్తారు. లెర్నింగ్‌ సెంటర్‌ల నిర్వహణ అనేది సులువైన విషయమేమీ కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ వాటిని నిర్వహిస్తున్నాం.
– రూబుల్‌ నాగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement