
ప్రపంచవ్యాప్తంగా పాఠశాల విద్యకు దూరమైన 13 కోట్ల మంది బాలికలు
బీజింగ్ డిక్లరేషన్ చేసి 3 దశాబ్దాలు గడచినా నెరవేరని లక్ష్యం
యునెస్కో పరిశోధనలో వెల్లడైన చేదు నిజాలు
న్యూఢిల్లీ: అమ్మాయిలకు అన్యాయం జరిగినప్పుడల్లా వినిపించే ఒకే ఒక మాట లింగసమానత్వం. దశాబ్దాలుగా లింగసమానత్వం కోసం ప్రపంచదేశాలు పోరాడుతున్నా ఏదో ఒక రంగంలో లింగఅసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. వీటికితోడు అమ్మాయిలు పాఠశాల విద్యకు దూరమవుతున్న ధోరణిలో ఏమాత్రం మార్పురావట్లేదని తాజాగా యునెస్కో ప్రపంచ విద్యా పర్యవేక్షణ(జెమ్) బృంద పరిశోధనలో తేలింది. విద్యసహా అన్ని రంగాల్లో లింగసమానత్వ సాధనే ధ్యేయంగా 1995లో చేసిన బీజింగ్ డిక్లరేషన్ ఇంకా లక్ష్యాన్ని చేరుకోలేదని యునెస్కో ఆవేదన వ్యక్తంచేసింది. దశాబ్దాలుగా కోట్లాది మంది అమ్మాయిలు ఇంకా కనీసం పాఠశాల విద్యకు కూడా నోచుకోవట్లేదని యునెస్కో జెమ్ బృందం వెల్లడించింది.
మారని పరిస్థితి
‘‘1995 ఏడాది నుంచి చూస్తే నేటి ఆధునిక ప్రపంచంలో విద్యావ్యవస్థలో లింగసమానత్వ సాధనకు కృషి అధికమైంది. ఇప్పుడు ప్రాథమిక, దిగువ, ఎగువ మాధ్యమిక పాఠశాలల్లో బాలురతో సమానంగా బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. మూడు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు అన్ని దేశాల్లో 9.1 కోట్ల మంది అమ్మాయిలు ప్రాథమిక విద్య చదువుతున్నారు. కానీ మాధ్యమిక విద్య విషయానికి వచ్చేసరికి ఏకంగా 13.3 కోట్ల మంది అమ్మాయిలు పాఠశాలకు దూరంగా ఉండిపోతున్నారు. ఈ వైరుధ్యం అంతటా ఒకేలా లేదు. ప్రాంతాల వారీగా చూస్తే మధ్యాసియా, దక్షిణాసియా దేశాల్లో బాలికలు విద్యలో రాణిస్తుండగా సహారా ఆఫ్రికా ప్రాంతంలో బాలికలకు పాఠశాల విద్య అనేది అందని ద్రాక్షలా మిగిలిపోతోంది’’అని జెమ్ బృంద సభ్యులు ఒకరు మీడియాతో చెప్పారు.
లాటిన్ అమెరికాలో మరోలా..
‘‘ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, వేలాది పాలినేసియా, మైక్రోనేసియా, మెలనేసియా దీవుల సమాహారమైన ‘ఓషేనియా’లో గతంలో విద్యలో లింగసమానత్వం ఉండేది. ఇప్పుడది కరువైంది. ఇక లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో మాధ్యమిక విద్యలో అబ్బాయిల కంటే అమ్మాయిలే అధికంగా రాణిస్తుండటం విశేషం. అయితే గినియా, మాలీ లాంటి దేశాల్లో పరిస్థితి అమ్మాయిల విషయంలో అధ్వాన్నంగా ఉంది. కొన్ని పాఠశాలల్లో అసలు విద్యారి్థనులే లేరు. కడు పేదరికం, బాల్య వివాహాలు, సౌకర్యాల లేమి, అనారోగ్యం వంటి కారణాలతో అమ్మాయిలకు పాఠశాల విద్య అనేది సుదూర స్వప్నంగా మారింది’’అని జెమ్ బృందసభ్యుడు వెల్లడించారు.
మహిళా టీచర్ల ప్రాతినిథ్యం పెరగాలి
విద్యలో నాయకత్వ స్థాయిలో మహిళల ప్రాతినిథ్యం సైతం తక్కువగా ఉంటోంది. పురుష టీచర్లతో పోలిస్తే మహిళా టీచర్ల సంఖ్య సైతం చాలా తక్కువగా ఉంది. ఉన్నత విద్యలో ఇంకా మహిళా టీచర్ల సంఖ్య 30 శాతమే. ఇలాంటి వ్యవస్థాగత అసమానతలు సైతం విద్యలో సమానత్వ సాధనకు ప్రతిబంధకాలుగా పరిణమిస్తున్నాయి. బాలికలు, అమ్మాయిల విద్యావకాశాలు మెరుగుపడేలా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తూ ప్రపంచం సంస్కరణపథంలో దూసుకుపోవాలని బీజింగ్ డిక్లరేషన్ చాటుతోంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్,మ్యాథమేటిక్స్(స్టెమ్) కోర్సు ల్లో అమ్మాయిల ప్రాతినిథ్యం పెరగాలని ఆనాడు ప్రపంచదేశాలు ఆకాంక్షించాయి. బాలికావిద్య అనేది కేవలం వాళ్ల హక్కు కాదు. అది మహిళల, చిన్నారుల, సమాజ భవిష్యత్తు. నాటి బాసలను నిలబెట్టుకున్ననాడే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది’’అని నివేదిక హెచ్చరించింది.
నెరవేరని ఆశయాలు, ఆకాంక్షలు
‘‘ప్రపంచవ్యాప్తంగా పాఠశాల్లో అమ్మాయిల చేరికలు అధికంగా ఉండాలని, ఆమేరకు అన్ని దేశప్రభుత్వాలు కృషిచేయాలని బీజింగ్ డిక్లరేషన్ ఉద్ఘాటించింది. కానీ ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. పాఠశాలల్లో లైంగిక విద్య సైతం ఖచి్చతంగా బోధించాలి. లేదంటే అదే లైంగిక అంశాలను చిన్నారులు పాఠశాల విద్యకు ఆవల తప్పుడు కోణంలో తెల్సుకుంటారు. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ వంటి అంశాలను చిన్నారులకు ప్రపంచంలో మూడింట రెండొంతుల దేశాల్లో ప్రాథమిక స్థాయిలోనే నేర్పించాలి. మాధ్యమిక విద్య స్థాయిలో నాలుగింట మూడొంతుల దేశాల్లో నేర్పించాలి’’అని నివేదిక అభిప్రాయపడింది.