టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వన్డే పునరాగమనంలో వరుస మ్యాచ్‌లలో దుమ్ములేపుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద భారీ అర్ధ శతకం (74 నాటౌట్) బాది ఫామ్‌లోకి వచ్చిన కోహ్లి.. సొంతగడ్డపై అదే జోరును కొనసాగిస్తున్నాడు.
సౌతాఫ్రికాతో రాంచి వేదికగా తొలి వన్డేలో కోహ్లి (Virat Kohli) శతక్కొట్టిన విషయం తెలిసిందే. కేవలం 120 బంతుల్లోనే 135 పరుగులతో సత్తా చాటి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు వన్డేల్లో 52వ, అంతర్జాతీయ కెరీర్‌లో ఓవరాల్‌గా 83వ శతకం నమోదు చేసి.. శతక శతకాలకు మరింత చేరువయ్యాడు.
రెండో వన్డేలోనూ దూకుడు
ఇక తాజాగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలోనూ కోహ్లి దంచికొట్టాడు. రాయ్‌పూర్ వేదికగా 47 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా వన్డేల్లో వరుసగా మూడోసారి యాభై పరుగుల మార్కును దాటేశాడు. ఈ క్రమంలోనే కోహ్లి సరికొత్త చరిత్ర లిఖించాడు.
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధికంగా13 వేర్వేరు సందర్భాల్లో (13 Streaks) వరుసగా మూడు లేదంటే అంతకంటే ఎక్కువసార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. అతడి నిలకడైన ఆటకు ఇదే నిదర్శనం.
గతంలో భారత దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ 11 సందర్భాల్లో ఈ ఫీట్ నమోదు చేయగా.. సచిన్ టెండుల్కర్ పది సందర్భాల్లో ఈ ఘనత సాధించాడు.
కోహ్లి- రుతు ధనాధన్
మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో గెలిచిన టీమిండియా.. 1-0తో ఆధిక్యంలో ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య రాయ్‌పూర్ వేదికగా బుధవారం నాటి రెండో వన్డేలో టాస్ గెలిచిన ప్రొటిస్ జట్టు.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు ఎంచుకున్న టీమిండియా 31వ ఓవర్లు ముగిసేసరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 212 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి, నాలుగో నంబర్ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అర్ధ శతకాలు పూర్తి చేసుకుని నూటా యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (22), రోహిత్ శర్మ (14) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.
చదవండి: అదే జరిగితే నీపై వేటు వేస్తారు: గంభీర్‌పై రవిశాస్త్రి వ్యాఖ్యలు వైరల్


