సౌతాఫ్రికాతో తొలి వన్డేలో విఫలమైన టీమిండియా స్టార్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ తిరిగి పుంజుకున్నాడు. రాయ్‌పూర్ వేదికగా సఫారీలతో జరుగుతున్న రెండో వన్డేలో రుతురాజ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 77 బంతుల్లోనే తన తొలి వన్డే సెంచరీ మార్క్‌ను ఈ మహారాష్ట్ర బ్యాటర్ అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 12 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి.
జైశ్వాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రుతురాజ్.. తన ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. కోహ్లితో కలిపి 150కి పైగా పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
గౌతీ నమ్మాడు.. రుతు అదరగొట్టాడు
రుతురాజ్ గైక్వాడ్ దాదాపు రెండేళ్ల తర్వాత భారత వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తుండడంతో సెలక్టర్లు పిలుపునిచ్చారు. అయితే ప్రోటీస్‌తో తొలి వన్డేలో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
దీంతో అతడిని రెండో వన్డేకు పక్కన పెట్టాలని చాలా మంది మాజీలు సూచించారు. కానీ భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం రుతుపై నమ్మకం ఉంచాడు. రెండో వన్డేలో కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కింది. ఈసారి మాత్రం తనకు దక్కిన అవకాశాన్ని గైక్వాడ్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.
భారీ స్కోర్ దిశగా భారత్..
రాయ్‌పూర్ వన్డేలో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. 35 ఓవర్లు ముగిసే సరికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. క్రీజులో గైక్వాడ్(104), విరాట్ కోహ్లి(95) ఉన్నారు.
చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి


