టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ మిశ్రమ ఫలితాలు చవిచూస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫర్వాలేదనిపించినా.. టెస్టుల్లో అతడికి ఇప్పటికే రెండు చేదు అనుభవాలు చవిచూశాడు. గంభీర్ మార్గదర్శనంలో గతేడాది న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 3-0తో వైట్‌వాష్‌కు గురైంది.
గంభీర్ టెస్టు కోచ్‌గా పనికిరాడంటూ..
భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇలా ఓ విదేశీ జట్టు చేతిలో మన జట్టు మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో క్లీన్‌స్వీప్ కావడం ఇదే తొలిసారి. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా దాదాపు దశాబ్దం తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (BGT)ని కోల్పోయింది. ఆసీస్ చేతిలో 3-1తో ఓడి ఇంటిబాట పట్టింది.
ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో 2-2తో టెస్టు సిరీస్‌ను సమం చేసిన టీమిండియా.. తాజాగా స్వదేశంలో సౌతాఫ్రికా చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్ టెస్టు కోచ్‌గా పనికిరాడని.. అతడిని వెంటనే తొలగించాలంటూ డిమాండ్లు పెరిగాయి.
బీసీసీఐదే నిర్ణయం
ఈ విషయంపై గంభీర్ (Gautam Gambhir) స్వయంగా స్పందిస్తూ.. తన హయాంలోనే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే)-2025, ఆసియా టీ20 కప్-2025లో జట్టు గెలిచిందని పేర్కొన్నాడు. తనను కోచ్‌గా కొనసాగించాలా? లేదా? అనే నిర్ణయం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీసుకుంటుందని స్పష్టం చేశాడు.
అదే జరిగితే నీపై వేటు వేస్తారు
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. ప్రభాత్ ఖబర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ భవితవ్యం గురించి ప్రశ్న ఎదురుకాగా.. ‘‘మన ప్రదర్శన బాగా లేకుంటే.. కచ్చితంగా మనపై వేటు వేస్తారు. పదవి నుంచి తొలగిస్తారు.
పరస్పర సమన్వయం, ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్ ఇక్కడ అత్యంత ముఖ్యం. మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉంటేనే అంతా సాఫీగా సాగిపోతుంది. గెలిచేలా ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాలి. కోచ్‌లుగా మా పని అదే. అయితే, మనం చేసే పని పట్ల ఇష్టం ఉండాలి. దానిని ఆస్వాదించాలి. అంతేగానీ ఒత్తిడిగా ఫీలవ్వకూడదు’’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
కాగా టీమిండియా మాజీ క్రికెటర్ అయిన రవిశాస్త్రి.. 2017- 2021 వరకు భారత జట్టు హెడ్‌కోచ్‌గా వ్యవహరించాడు. అతడి మార్గదర్శనంలోనే తొలిసారి టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండుసార్లు బోర్డర్- గావస్కర్ ట్రోఫీలు గెలిచింది. అంతేకాదు.. సౌతాఫ్రికాలో తొలిసారి వన్డే సిరీస్‌ను కూడా టీమిండియా కైవసం చేసుకుంది. రవిశాస్త్రి- నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి కాంబినేషన్‌లో టెస్టుల్లో టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా అగ్రపీఠానికి చేరుకుంది.
చదవండి: హర్షిత్ రాణాకు బిగ్ షాక్


