రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 అధిక్యంలో భారత్ దూసుకెళ్లింది. అయితే తొలి మ్యాచ్‌లో గెలుపొందినప్పటికి జట్టు ఎంపికపై మాత్రం స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
రాంచీ వన్డేలో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కించుకోకపోవడాన్ని అశ్విన్ తప్పు బట్టాడు. ఆసియాకప్‌లో గాయపడ్డ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో సౌతాఫ్రికాతో వన్డేలకు నితీశ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
అయితే తొలి వన్డే తుది జట్టులో నితీశ్ ఉంటాడని అంతా భావించారు. కానీ టీమ్ మెనెజెమెంట్ మాత్రం ప్లేయింగ్ ఎలెవన్‌లో నితీశ్ బదులుగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశమిచ్చింది. కానీ సుందర్ మాత్రం తీవ్ర నిరాశపరిచాడు. ఈ క్రమంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. రెండో వన్డేలోనైనా నితీశ్‌ను ఆడించాలని పలువురు సూచిస్తున్నారు.
"జట్టులో హార్దిక్ పాండ్యా లేనప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి కచ్చితంగా చోటు ఇవ్వాలి. ఒకవేళ నితీశ్ జట్టులో ఉన్నప్పటికి అతడిని బెంచ్‌కే పరిమితం చేస్తే కచ్చితంగా టీమ్ సెలక్షన్‌లో తప్పుందనే చెప్పాలి. తుది జట్టులో ఆడించినప్పుడు నితీశ్‌ను ఎందుకు ఎంపిక చేశారు? హార్దిక్ ఏమి చేయగలడో నితీశ్ కూడా అదే చేయగలడు. అతడికి అవకాశాలు ఇస్తే మరింత రాటుదేలుతాడు.
కానీ అతడు ఎక్కువ శాతం బెంచ్‌కే పరిమితం చేస్తున్నారు. అటువంటి అప్పుడు అతడి ప్రధాన జట్టుకే ఎంపిక చేయడం మానేయండి" అని తన యూట్యూబ్ ఛానల్‌లో అశూ పేర్కొన్నాడు.


