ఇంగ్లండ్‌తో రెండో యాషెస్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. గురువారం నుంచి ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్టుకు ఆసీస్ స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా దూరమయ్యాడు. ఖవాజా ప్రస్తుతం వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.
ఈ కారణం చేతనే పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అతడు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. అయితే రెండో టెస్టుకు దాదాపు పది రోజుల విశ్రాంతి లభించడంతో అతడు కోలుకుంటాడని క్రికెట్ ఆస్ట్రేలియా భావించింది. కానీ ఉస్మాన్ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోయాడు.
మంగళవారం 30 నిమిషాల పాటు ప్రాక్టీస్ సెషన్‌లో ఖవాజా పాల్గోన్నాడు. కానీ అతడు అసౌకర్యంగా కనిపించాడు. దీంతో ఖవాజాను రెండో టెస్టు జట్టు నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించింది. అతడి స్ధానంలో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్న విషయాన్ని మాత్రం సీఎ వెల్లడించలేదు.
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విధ్వంసకర సెంచరీతో చెలరేగిన హెడ్.. సెకెండ్ టెస్టులో కూడా ఓపెనర్‌గా వచ్చే అవకాశముంది. అదే విధంగా ఖవాజా స్ధానంలో తుది జట్టులోకి ఆల్‌రౌండర్ వెబ్‌స్టర్ రానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. కాగా ఈ టెస్టుకు కూడా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, పేసర్ జోష్ హాజిల్‌వుడ్ దూరమయ్యాడు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్ వరుసగా రెండో మ్యాచ్‌లను కంగారుల జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, బ్రెండన్ డాగెట్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నేజర్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్.
చదవండి: మరోసారి పేట్రేగిపోయిన వైభవ్ సూర్యవంశీ


