ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌కు ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. డిసెంబర్ 2025 నెలకు గాను 'ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా స్టార్క్ ఎంపికయ్యాడు. ఇటీవల ముగిసిన యాషెస్ సిరీస్‌లో స్టార్క్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. యాషెస్‌ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో సొంతం చేసుకోవడంలో స్టార్క్‌ది కీలక పాత్ర.
ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో స్టార్క్ ఏకంగా 31 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్ రెగ్యూలర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్, హాజిల్‌వుడ్ గాయాల కారణంగా దూరం కవడంతో.. పేస్ దళాన్ని స్టార్క్ ముందుండి నడిపించాడు. కేవలం బౌలింగ్‌లోనే కాకుండా, బ్యాటింగ్‌లోనూ అతడు సత్తాచాటాడు.
బ్రిస్బేన్, ఆడిలైడ్ టెస్టుల్లో అతడు హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఈ కారణంగానే అతడికి ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం వెస్టిండీస్‌కు ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్, న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ పోటీపడ్డారు. కానీ వారిద్దరికంటే స్టార్క్ ప్రదర్శనలు మెరుగ్గా ఉండడంతో అవార్డును సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు దక్కడంపై స్టార్క్ స్పందించాడు.
"ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికవ్వడం చాలా గర్వంగా ఉంది. సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ విజయంలో భాగం కావడం మరింత సంతోషాన్ని ఇచ్చింది. మా దృష్టి ఇప్పుడు 'ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్' ఫైనల్‌పై ఉంది" అని స్టార్క్ పేర్కొన్నాడు. కాగా ఈ అవార్డును ఓ ఆస్ట్రేలియా ప్లేయర్ గెలుచుకోవడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. చివరిసారిగా డిసెంబర్ 2023లో పాట్ కమిన్స్ సొంతం చేసుకున్నాడు.
చదవండి: IND vs NZ: జడేజా కథ ముగిసినట్లేనా? అతడే సరైన ప్రత్యామ్నాయం


