ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ అలిసా హేలీ కీలక ప్రకటన చేసింది. స్వదేశంలో భారత్‌తో ఆడబోయే సిరీస్ తన కెరీర్‌లో చివరిదని పేర్కొంది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు స్పష్టం చేసింది.
నా కెరీర్‌లో చివరిది
ఈ మేరకు.. ‘‘మిశ్రమ భావోద్వేగాలు చుట్టుముడుతున్నాయి. ఆస్ట్రేలియా తరఫున భారత్‌తో ఆడబోయే సిరీస్ నా కెరీర్‌లో చివరిది. ఆసీస్ తరఫున ఇంకా ఇంకా ఆడాలనే ఉంది. అయితే, నాలో పోటీతత్వం కొరవడిందని అనిపిస్తోంది.
అందుకే రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఈసారి టీ20 ప్రపంచకప్ ఆడేందుకు నేను వెళ్లడం లేదని తెలుసు. ఈ మెగా టోర్నీ సన్నాహకాలకు చాలా తక్కువ సమయం ఉంది. టీమిండియాతో టీ20లలోనూ నేను ఆడలేను.
ఇండియాతో వీడ్కోలు మ్యాచ్ ప్రత్యేకం
అయితే, సొంతగడ్డపై భారత్‌తో మ్యాచ్‌లో వన్డే, టెస్టు కెప్టెన్‌గా కెరీర్ ముగించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. నాకు దక్కిన గొప్ప అవకాశం ఇది. మాకు క్యాలెండర్ ఇయర్‌లో వచ్చే అతిపెద్ద సిరీస్ ఇదే’’ అంటూ అలిసా హేలీ ‘ది విల్లో టాక్’ పాడ్‌కాస్ట్‌లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది.
దిగ్గజ క్రికెటర్‌గా
కాగా 2010లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసింది వికెట్ కీపర్ బ్యాటర్ అలిసా హేలీ. ఆమె నాయకత్వంలో అన్ని ఫార్మాట్లలోనూ ఆసీస్ మహిళా క్రికెట్ జట్టు పటిష్ట జట్టుగా మారింది. 2010, 2012, 2014, 2018, 2020, 2023 టీ20 టోర్నీ గెలిచిన జట్లలో అలిసా సభ్యురాలు. అంతేకాదు.. 2013, 2022లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులోనూ అలిసా ఉంది.

ఇక 2018, 2019 ఇయర్లకు గానూ ‘ఐసీసీ టీ20 క్రికెర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును 35 ఏళ్ల అలిసా హేలీ అందుకుంది. కాగా అలిసా నిష్క్రమణ తర్వాత తహీలా మెగ్రాత్ ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది. భారత్‌తో, టీ20 ప్రపంచకప్-2026లో ఆసీస్‌ను ఆమె ముందుకు నడుపనున్నట్లు తెలుస్తోంది.
స్టార్క్ జీవిత భాగస్వామి
కాగా ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ మిచెల్ స్టార్క్- అలిసా హేలీ భార్యాభర్తలు అన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 6 వరకు భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఒక టెస్టు ఆడనుంది.
చదవండి: T20 WC 2026: నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు!


