ఆసీస్‌తో రెండో వన్డే.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ | India women set 252 runs target to australia in second ODI | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో రెండో వన్డే.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌

Feb 27 2026 12:59 PM | Updated on Feb 27 2026 1:14 PM

India women set 252 runs target to australia in second ODI

ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. హోబర్ట్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 

తొలి వన్డేలో డకౌటైన ఓపెనర్‌ ప్రతీక రావల్‌ (52) ఈ మ్యాచ్‌లో అర్ద సెంచరీతో రాణించింది. మరో ఓపెనర్‌ స్మృతి మంధన (31) ఓ మోస్తరు స్కోర్‌తో పర్వాలేదనిపించింది. ఆతర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్‌ 11 పరుగులకే ఔటై నిరాశపర్చగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (54) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్‌ సెంచరీతో మెరిసింది. 

దీప్తి శర్మ (1) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలం కాగా.. ఆఖర్లో అమన్‌జోత్‌ కౌర్‌ (13), రిచా ఘోష్‌ (22), కశ్వీ గౌతమ్‌ (25), క్రాంతి గౌడ్‌ (19), వైష్ణవి శర్మ (10 నాటౌట్‌) నామమాత్రపు స్కోర్లు చేసి 250 పరుగుల మార్కు దాటించారు. ఆసీస్‌ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్‌, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌, అలానా కింగ్‌ తలో 2 వికెట్లు తీయగా.. మెగాన్‌ షట్‌, నికోలా క్యారీ చెరో వికెట్‌ పడగొట్టాడు.

కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. బ్రిస్బేన్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్‌, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో చివరి వన్డే హోబర్ట్‌ వేదికగానే మార్చి 1న జరుగుతుంది. అనంతరం మార్చి 6న టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement