3 టీ20లు, 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా జరిగిన టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతుంది.
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన సౌతాఫ్రికా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది (2-0). తొలి వన్డేలో 37 పరుగుల తేడాతో విజయం సాధించిన ప్రొటిస్ జట్టు.. సెంచూరియన్ వేదికగా నిన్న (ఫిబ్రవరి 25) జరిగిన రెండో మ్యాచ్‌లో 16 పరుగుల స్వల్ప తేడాతో బయటపడింది.
భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ల నష్టానికి ఏకంగా 361 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్ చివరి వరకు పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు 49.5 ఓవర్లలో 345 పరుగులకు ఆలౌటై పరాజయంపాలైంది.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెర్క్‌సన్ (90) సెంచరీ మిస్ చేసుకోగా.. తజ్మిన్ బ్రిట్స్ (77), సూన్ లస్ (57) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో క్లో ట్రయాన్ (37), డి క్లెర్క్ (49) బ్యాట్ ఝులిపించారు. ఫలితంగా సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా, సదియా ఇక్బల్, సయ్యెదా అరూబ్ షా తలో 2 వికెట్లు పడగొట్టగా...డయానా బేగ్, నష్రా సంధు చెరో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆదిలో వికెట్లు కోల్పోయినప్పటికీ ఆతర్వాత కుదురుకుంది. షమాస్ (61), అయేషా జాఫర్ (75), ఫాతిమా సనా (52) అర్ద సెంచరీలు సాధించి పాక్‌ను విజయం దిశగా తీసుకెళ్లారు. ఆఖర్లో సయ్యేదా (40), డయానా బేగ్ (38 నాటౌట్) కూడా గెలుపు కోసం ప్రయత్నించినా కుదర్లేదు. ఫలితంగా పాక్ లక్ష్యానికి 17 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సౌతాఫ్రికా బౌలర్లలో డెర్క్‌సన్ 3, డి క్లెర్క్, మ్లాబా, షాంగేస్ తలో 2, సూన్ లస్ ఓ వికెట్ తీసి పాక్‌ను ఆలౌట్ చేశారు. నామమాత్రపు చివరి వన్డే మార్చి 1న కింగ్స్‌మీడ్ డర్బన్ వేదికగా జరుగుతుంది.


