భారీ విజయం కావాలి | Indias Super 8 match against Zimbabwe today | Sakshi
Sakshi News home page

భారీ విజయం కావాలి

Feb 26 2026 1:06 AM | Updated on Feb 26 2026 9:27 AM

Indias Super 8 match against Zimbabwe today

నేడు జింబాబ్వేతో భారత్‌ సూపర్‌–8 మ్యాచ్‌

కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో టీమిండియా

ఆత్మవిశ్వాసంతో జింబాబ్వే 

రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

టి20 ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌లో పరాజయం భారత్‌ పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవలి ఫామ్‌ను బట్టి చూస్తే దర్జాగా సెమీఫైనల్‌ చేరాల్సిన టీమ్‌ ఇప్పుడు ఒత్తిడిని అధిగమించి తప్పనిసరిగా వరుస రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు రన్‌రేట్‌పై కూడా ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేతో పోరుకు టీమిండియా సిద్ధమైంది. 

ఒకవైపు మన బ్యాటింగ్‌లో తడబాటు కనిపిస్తుండగా, మరోవైపు లీగ్‌ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంకలను ఓడించిన జింబాబ్వేను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో విజయం సాధిస్తేనే వెస్టిండీస్‌తో జరిగే తర్వాతి పోరులో వ్యూహాల గురించి చర్చించేందుకు భారత్‌కు ఇంకా అవకాశం మిగిలి ఉంటుంది!  

చెన్నై: వరల్డ్‌ కప్‌ ‘సూపర్‌ ఎయిట్స్‌’లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు టీమిండియా సన్నద్ధమైంది. నేడు జరిగే ‘గ్రూప్‌–1’ పోరులో జింబాబ్వేతో భారత్‌ తలపడుతుంది. ఇరు జట్లూ తమ తొలి మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడి రన్‌రేట్‌లో బాగా వెనుకబడిపోయాయి. ఓడిన జట్టు సెమీస్‌ ఆశలు ఇక్కడే ముగిసిపోతాయి. బలాబలాలపరంగా జింబాబ్వేకంటే భారత్‌ చాలా పెద్ద స్థాయిలో ఉంది. అయితే దక్షిణాఫ్రికా చేతిలో ఓటమితో టీమిండియా అజేయమేమీ కాదని తేలగా... పోరాడితే పోయేదేం లేదన్నట్లుగా ఆడే జింబాబ్వే మరో సంచలన ప్రదర్శనపై గురి పెట్టింది.  

సామ్సన్‌కు చాన్స్‌! 
గత మ్యాచ్‌ ఆడిన తుది జట్టు నుంచి కనీసం రెండు మార్పులతో భారత్‌ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. టోర్నీలో ఆడిన ఒకే ఒక మ్యాచ్‌లో విఫలమైన సంజు సామ్సన్‌ను ఇప్పుడు టీమ్‌ వ్యూహంలో భాగంగా మళ్లీ ఆడించాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. భారత్‌ టాప్‌–3 ఎడంచేతి వాటం బ్యాటర్లే కావడం, ప్రత్యర్థి జట్లు ఆరంభంలోనే ఆఫ్‌ స్పిన్నర్‌తో బౌలింగ్‌ చేయించి కట్టడి చేస్తుండటం జట్టును ఇబ్బంది పెట్టింది. 

మూడు డకౌట్‌ల తర్వాత గత మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ కొన్ని పరుగులు చేసినా అతని బ్యాటింగ్‌లో తడబాటు కనిపించింది. మరోవైపు ఇషాన్‌ కిషన్‌ కూడా ఆఫ్‌స్పిన్నర్‌కే అవుటయ్యాడు. దాంతో కుడిచేతి వాటం సామ్సన్‌ను టాపార్డర్‌లో ఆడించేందుకు టీమిండియా సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే సామ్సన్‌ను ఆడించేందుకు తిలక్‌ వర్మ లేదా రింకూ సింగ్‌లలో ఎవరిని తప్పిస్తారనేది చూడాలి. 

దక్షిణాఫ్రికాతో అక్షర్‌ పటేల్‌ను కాకుండా వాషింగ్టన్‌ సుందర్‌ను ఆడించి తీవ్ర విమర్శలపాలైన మేనేజ్‌మెంట్‌ ఇప్పుడు మళ్లీ అక్షర్‌ను టీమ్‌లోకి తీసుకోవచ్చు. జింబాబ్వే బ్యాటర్లలో ఎక్కువ మంది కుడిచేతి వాటంవారే కావడం అక్షర్‌ రాకకు మార్గం సుగమం చేసింది. మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు అభిషేక్‌కు ఇది సరైన సమయం కాగా... సూర్యకుమార్, శివమ్‌ దూబే, హార్దిక్‌ పాండ్యా ఎంత దూకుడుగా ఆడతారన్నది చూడాలి. 

బౌలింగ్‌ విషయంలో భారత్‌కు ఎలాంటి ఆందోళన లేదు. బుమ్రా, అర్‌‡్షదీప్‌లతో పాండ్యా పేస్‌ భారం మోస్తుండగా... ప్రధానాస్త్రం వరుణ్‌ జింబాబ్వేను బాగా ఇబ్బంది పెట్టగలడు. సొంతగడ్డపై ఇప్పుడు వరుణ్‌ వరల్డ్‌ నంబర్‌వన్‌ బౌలర్‌గా బరిలోకి దిగనున్నాడు.  

రజాపై భారం... 
జింబాబ్వే జట్టుపై ఈ మ్యాచ్‌కు సంబంధించి ఎలాంటి ఒత్తిడీ లేదు. లీగ్‌ దశలో ఆ్రస్టేలియాను, సొంతగడ్డపై శ్రీలంకను ఓడించిన సంతృప్తితో ఆ జట్టు స్వదేశానికి వెళ్లవచ్చు. అందువల్ల కూడా ఇప్పుడు జింబాబ్వే మరింత ప్రమాదకరం. పోరాడితే భారత్‌పై కూడా పైచేయి సాధించవచ్చనే ధైర్యం ఆ జట్టులో కనిపిస్తోంది. ప్రధాన పేసర్లయిన ఎన్‌గరవా, ముజరబాని పవర్‌ప్లేలో వికెట్లు తీసి శుభారంభం అందించగలరు. 

లెగ్‌ స్పిన్నర్‌ క్రీమర్‌ కూడా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సమర్థుడు. టోర్నీలో జట్టు తరఫున టాప్‌ స్కోరర్‌గా ఉన్న బెన్నెట్‌తో పాటు ర్యాన్‌ బర్ల్‌ కీలకం కానున్నారు. జట్టులో ఇద్దరు ఆల్‌రౌండర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. బ్రాడ్‌ ఇవాన్స్‌ తన మీడియం పేస్‌తో టోర్నీలో ప్రభావం చూపించగా, ప్రధాన గెలుపు భారం కెపె్టన్‌ సికందర్‌ రజాపైనే ఉంది. బ్యాటింగ్‌లో ముందుండి నడిపిస్తున్న రజా, తన ఆఫ్‌స్పిన్‌తో నిలకడగా రాణించాడు. విండీస్‌తో గత పోరులో భారీ తేడాతో ఓడినా... జింబాబ్వే పట్టుదలగా ఆడితే ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలదు.

పిచ్, వాతావరణం  
చిదంబరం స్టేడియంలోని పిచ్‌లు ఈ టోర్నీ మొత్తంలో బ్యాటింగ్‌కు బాగా అనుకూలించాయి. బౌలర్లకు ఏమాత్రం సహకరించలేదు. కాబట్టి భారీ స్కోరుకు అవకాశం ఉంది. మ్యాచ్‌ రోజు వర్షసూచన లేదు.

1 టి20 వరల్డ్‌ కప్‌లో భారత్, జింబాబ్వే మధ్య ఒకే ఒక మ్యాచ్‌ జరిగింది. 2022లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 71 పరుగులతో గెలిచింది.

1 భారత్‌లో భారత్‌తో టి20ల్లో జింబాబ్వే తలపడటం ఇదే తొలిసారి. గతంలో భారత గడ్డపై జింబాబ్వే 5 టెస్టులు, 19 వన్డేల్లో టీమిండియాను ఎదుర్కొంది.

భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్‌), అభిషేక్, సామ్సన్, ఇషాన్‌ కిషన్, దూబే, పాండ్యా, రింకూ/ తిలక్, అక్షర్, అర్ష్ దీప్, వరుణ్, బుమ్రా.  
జింబాబ్వే: రజా (కెప్టెన్‌), మరుమని, బెన్నెట్, మైర్స్, బర్ల్, మున్‌యోంగా, ముసెకివా, ఇవాన్స్, క్రీమర్, ముజరబాని, ఎన్‌గరవ 

Advertisement
 
Advertisement
Advertisement