ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 24) జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఆసీస్ బౌలర్ల ధాటికి 48.3 ఓవర్లలో 214 పరుగులకే ఆలౌటైంది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (53), వైస్ కెప్టెన్ స్మృతి మంధన (58) రాణించడంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో కశ్వీ గౌతమ్ (43), రిచా ఘోష్ (23) కూడా సహకరించడంతో భారత్ 200 పరుగుల మార్కును దాటగలిగింది.
వీరు మినహా భారత ఇన్నింగ్స్‌లో మరెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేదు. షఫాలీ వర్మ 4, జెమీమా రోడ్రిగ్స్ 8, దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీచరణి తలో 2, ఓపెనర్ ప్రతీక రావల్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్ (7-0-33-3) అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా పతనాన్ని శాశించింది.
మెగాన్ షట్ (9-1-42-2), సోఫీ మోలినెక్స్ (5-1-17-1), తహ్లియా మెక్‌గ్రాత్ (4-0-16-1), డార్సీ బ్రౌన్ (5-0-24-1) కూడా పర్వాలేదనిపించారు. అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (8.3-1-32-0) పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు దక్కలేదు.
కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, ఏకైక టెస్ట్ మ్యాచ్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. రెండు, మూడు వన్డేలు హోబర్ట్ వేదికగా ఫిబ్రవరి 27, మార్చి 1 తేదీల్లో జరుగనున్నాయి. అనంతరం మార్చి 6న టెస్ట్ మ్యాచ్ ప్రారంభమవుతుంది.


