అంతర్జాతీయ క్రికెట్‌లో క్వీన్ స్మృతి మంధన పరుగుల ప్రవాహం ఫార్మాట్లకతీతంగా కొనసాగుతోంది. ఈ టీమిండియా స్టార్ ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటింది. ఇవాళ (ఫిబ్రవరి) బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసిన మంధన.. దీనికి ముందు టీ20 సిరీస్ డిసైడర్ (మూడో టీ20)లో కూడా హాఫ్ సెంచరీతో మెరిసింది. తాజా హాఫ్ సెంచరీతో మంధన ఓ అరుదైన ఘనత సాధించింది.
ఆస్ట్రేలియాపై వన్డేల్లో 11 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేసిన అతికొద్ది మందిలో ఒకరిగా నిలిచింది. ఆసియా ప్లేయర్ల వరకు తీసుకుంటే మంధననే ఆసీస్‌పై అత్యధిక వన్డే హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో మంధన 68 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి ఔటైంది.
52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో కలిసి ఆదుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ ఇన్నింగ్స్ రెండో బంతికే ఓపెనర్ ప్రతీక రావల్ (0) వికెట్ కోల్పోయింది. ఈ దశలో మంధన.. షఫాలీ వర్మతో (4) రెండో వికెట్‌కు 25 పరుగులు.. జెమీమా రోడ్రిగ్స్‌తో (8) మూడో వికెట్‌కు 27 పరుగులు.. నాలుగో వికెట్‌కు హర్మన్‌తో కలిసి 48 పరుగులు జోడించింది.
33 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 140-5గా ఉంది. హర్మన్‌ప్రీత్ 32, రిచా ఘోష్ 23 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షట్, డార్సీ బ్రౌన్, ఆష్లే గార్డ్‌నర్, అలానా కింగ్, తహ్లియా మెక్‌గ్రాత్ తలో వికెట్ తీశారు. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే జరుగుతుంది.


