టీమిండియా ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 దశలో పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నై వేదికగా పసికూన జింబాబ్వేను 72 పరుగులతో చిత్తు చేసింది. తద్వారా రెండు పాయింట్లు సాధించడంతో పాటు.. నెట్‌రన్‌రేటును మెరుగుపరుచుకుంది. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది భారత్.
ఏకంగా 256 పరుగులు
ఇక గురువారం నాటి మ్యాచ్‌లో చెపాక్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించడంతో భారత బ్యాటర్లు చెలరేగిన విషయం తెలిసిందే. జింబాబ్వే బౌలింగ్‌ను చితక్కొడుతూ టీమిండియా ఏకంగా 256 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే సైతం ఈ బ్యాటింగ్ పిచ్‌పై 184 పరుగులు చేయగలిగింది.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ భారత బౌలింగ్ వ్యూహంపై పెదవి విరిచాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ శివం దూబే (Shivam Dube)తో ఎందుకు బౌలింగ్ చేయించారో అర్థం కాలేదన్నాడు. కాగా జింబాబ్వే (IND vs ZIM)తో మ్యాచ్‌లో దూబే రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 46 పరుగులు సమర్పించుకుని.. ఒకే ఒక్క వికెట్ తీశాడు. నోబాల్, వైడ్‌లతో ప్రత్యర్థికి అదనపు పరుగులు ఇచ్చుకున్నాడు.
ఇది బ్యాటింగ్ పిచ్
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అసలు ఈ మ్యాచ్‌లో బౌలింగ్ గురించి ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇది బ్యాటింగ్ పిచ్. అలాంటపుడు టీమిండియా ఆరో బౌలింగ్ ఆప్షన్ గురించి ఎందుకు ఆలోచించిందో అర్థం కాలేదు.
ఎక్కడ బౌలింగ్ చేస్తున్నాడో చూశారా?
అసలు దూబే ఎక్కడ బౌలింగ్ చేస్తున్నాడో చూశారా? అతడు సిక్స్త్ స్టంప్ మీదకు బాల్ వేస్తున్నాడు. ఇలాంటి బౌలింగ్ నేనెప్పుడూ చూడనేలేదు. టీమిండియా వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే బరిలోకి దిగింది. ఒకవేళ దూబే వంటి వాళ్లతో బౌలింగ్ చేయించాలనుకుంటే ముందుగా ప్రాక్టీస్ చేయించాలి.
ఇది కేవలం నెట్‌రన్‌రేటును మెరుగుపరచుకోవడం గురించి కాదు. ముందుగా మ్యాచ్ గెలవాలి. అప్పుడే పాయింట్లు వస్తాయి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు. ఏదేమైనా భారత జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంటుందని.. అప్పుడు అవసరమైతే ఆరో బౌలింగ్ ఆప్షన్‌ను వాడుకోవచ్చని చిక్కా సూచించాడు.
చదవండి: T20 WC 2026: భారత్-వెస్టిండీస్ మ్యాచ్ రోజు వర్షం పడితే..?


