భారత బ్యాటర్ల దూకుడైన ప్రదర్శన
72 పరుగులతో జింబాబ్వేపై ఘన విజయం
చెలరేగిన పాండ్యా, అభిషేక్, తిలక్
ఆదివారం వెస్టిండీస్‌పై గెలిస్తే సెమీఫైనల్‌కు
భారత జట్టు తమ కసినంతా జింబాబ్వేపై చూపించింది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన పరాజయంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన టీమిండియా తర్వాతి పోరులో విధ్వంసకర రీతిలో నష్టనివారణ చేసింది. సామ్సన్ శుభారంభం అందిస్తే, అభిషేక్ శర్మ ఫామ్‌లోకి వచ్చి దూకుడుగా ఆడాడు. మధ్యలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ తమదైన శైలిలో ధాటిని ప్రదర్శిస్తే చివర్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
ఇలా భారత బ్యాటర్లంతా ఒకరితో మరొకరు పోటీ పడి సిక్సర్లతో విరుచుకుపడటంతో జింబాబ్వే బెంబేలెత్తిపోయింది. ఆ జట్టు బౌలర్లంతా పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా రికార్డు స్కోరు సాధించిన టీమిండియా... ప్రత్యర్థికి ఛేదనలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా మ్యాచ్‌ను ముగించింది. ఇక నెట్‌రన్‌రేట్ వంటి గందరగోళపు లెక్కలు అవసరం లేకుండా నాకౌట్ పంచ్ మిగిలింది. ఆదివారం వెస్టిండీస్‌తో జరిగే చివరి పోరులో భారత్ గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుతుంది. ఓడిపోతే నిష్క్రమిస్తుంది.
చెన్నై: టి20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఎట్టకేలకు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చింది. ‘సూపర్ ఎయిట్స్’లో భాగంగా గురువారం జరిగిన ‘గ్రూప్–1’ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. తాజా ఫలితంతో జింబాబ్వే సెమీస్ చేరే అవకాశాలు ముగిసిపోయాయి. ఎంఎ చిదంబరం స్టేడియంలో టాస్ గెలిచిన జింబాబ్వే ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.
అభిషేక్ శర్మ (30 బంతుల్లో 55; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 50 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... తిలక్ వర్మ (16 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ (13 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) జట్టు భారీ స్కోరులో తలా ఓ చేయి వేశారు.
పాండ్యా, తిలక్ ఐదో వికెట్‌కు 31 బంతుల్లోనే అభేద్యంగా 84 పరుగులు జోడించడం విశేషం. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ బ్రయాన్ బెన్నెట్ (59 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఒంటరి పోరాటం మినహా అంతా విఫలమయ్యారు.
పోటీ పడి పరుగులు...
ఇన్నింగ్స్ రెండో బంతికే సంజు సామ్సన్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొట్టిన సిక్స్‌తో ఆరంభమైన భారత్ జోరు చివరి వరకు సాగింది. మపోసా వేసిన మూడో ఓవర్లోనే భారత్ 23 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాది అభిషేక్ కూడా ఫామ్‌లోకి వచ్చాడు. క్రీజ్‌లో ఉన్న కొద్దిసేపు సామ్సన్ ధాటిగా ఆడాడు. సామ్సన్ వెనుదిరిగిన తర్వాత ఇషాన్ అదే వేగాన్ని కొనసాగించాడు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 80 పరుగులు చేసింది.
26 పరుగుల వద్ద ఇషాన్‌కు లైఫ్ లభించగా, 26 బంతుల్లో అభిషేక్ అర్ధ సెంచరీ పూర్తయింది. రజా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన కిషన్ తర్వాతి బంతికి అవుటయ్యాడు. కొద్దిసేపటికి అభిషేక్ కూడా పెవిలియన్‌కు చేరాడు. 8 పరుగుల వద్ద ముజరబాని క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన సూర్యకుమార్ ఆ అవకాశాన్ని సమర్థంగా వాడుకుంటూ మపోసా ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. తర్వాతి ఓవర్లోనూ వేగంగా ఆడే క్రమంలో సూర్య ఇన్నింగ్స్ ముగిసింది.
4 ఓవర్లలో 69 పరుగులు...
16 ఓవర్లు ముగిసేసరికి నిస్సహాయంగా మారిపోయిన జింబాబ్వే బౌలర్లపై చివర్లో పాండ్యా, తిలక్ మరింత విరుచుకు పడ్డారు. 17–20 ఓవర్లలో భారత్ వరుసగా 14, 19, 21, 15 పరుగులు రాబట్టింది. ఇందులో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. ఎన్‌గరవా వేసిన 19వ ఓవర్లో తిలక్ వరుసగా 2 సిక్స్‌లు కొట్టగా, ఇవాన్స్ వేసిన ఆఖరి ఓవర్లో పాండ్యా వరుసగా రెండు భారీ సిక్స్‌లతో ముగించాడు.
ఈ క్రమంలో 23 బంతుల్లో పాండ్యా హాఫ్ సెంచరీని అందుకున్నాడు. బ్యాటింగ్‌కి దిగిన ఆరుగురు కనీసం ఒక సిక్స్ బాదగా భారత్ ఇన్నింగ్స్‌లో మొత్తం 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్ కోసం భారత్ తమ తుది జట్టులో రెండు మార్పులు చేసింది. వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్ స్థానాల్లో అక్షర్ పటేల్, సంజు సామ్సన్ జట్టులోకి వచ్చారు.
బెన్నెట్ పోరాటం వృథా...
భారీ ఛేదనను జింబాబ్వే ఓపెనర్లు బెన్నెట్, మరుమని (20) జాగ్రత్తగా ప్రారంభించారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 38 బంతుల్లో 44 పరుగులు జత చేశారు. మరుమని, మైయర్స్ (6) తక్కువ వ్యవధిలో వెనుదిరగ్గా... బెన్నెట్, సికందర్ రజా (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) భాగస్వామ్యంతో జట్టు ఇన్నింగ్స్ కాస్త సానుకూలంగా కదిలింది. అక్షర్ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టిన బెన్నెట్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు.
ఆ తర్వాత దూబే ఓవర్లో కూడా బెన్నెట్ 2 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అయితే మూడో వికెట్‌కు బెన్నెట్‌తో 42 బంతుల్లో 72 పరుగులు జత చేసిన అనంతరం రజా అవుట్ కావడంతో జింబాబ్వే ఆశలు పూర్తిగా కోల్పోయింది.
256/4 టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2007లో ఇంగ్లండ్‌పై టీమిండియా చేసిన 217 పరుగుల రికార్డు కనుమరుగైంది. ఓవరాల్‌గా శ్రీలంక 260/6 (కెన్యాపై 2007లో) తర్వాత వరల్డ్ కప్‌లో ఇది రెండో అత్యధిక స్కోరు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) బర్ల్ (బి) ముజరబాని 24; అభిషేక్ (సి) రజా (బి) మపోసా 55; ఇషాన్ కిషన్ (సి) ఎన్‌గరవా (బి) రజా 38; సూర్యకుమార్ (సి) ముసెకివా (బి) ఎన్‌గరవా 33; పాండ్యా (నాటౌట్) 50; తిలక్ (నాటౌట్) 44; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 256. వికెట్ల పతనం: 1–48, 2–120, 3–150, 4–172. బౌలింగ్: ఎన్‌గరవా 4–0–62–1, ముజరబాని 4–0–43–1, మపోసా 2–0–40–1, ఇవాన్స్ 4–0–52–0, రజా 3–0–29–1, బెన్నెట్ 2–0–16–0, బర్ల్ 1–0–10–0.
జింబాబ్వే ఇన్నింగ్స్: బెన్నెట్ (నాటౌట్) 97; మరుమని (సి) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 20; మైయర్స్ (సి) తిలక్ (బి) వరుణ్ 6; రజా (సి) అభిషేక్ (బి) అర్‡్షదీప్ 31; బర్ల్ (ఎల్బీ) (బి) అర్‡్షదీప్ 0; మున్‌యోంగా (బి) అర్‡్షదీప్ 11; ముసెకివా (సి) సామ్సన్ (బి) దూబే 7; ఇవాన్స్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–44, 2–72, 3–144, 4–144, 5–162, 6–173. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–24–3, పాండ్యా 3–0–21–0, బుమ్రా 3–0–21–0, వరుణ్ 4–0–35–1, అక్షర్ 4–0–35–1, దూబే 2–0–46–1.
గెలిచే జట్టు సెమీస్‌కు...
జింబాబ్వేపై భారత్ విజయంతో ‘గ్రూప్–1’ నుంచి సెమీఫైనల్ చేరే జట్ల విషయంలో స్పష్టత వచ్చింది. రెండు విజయాలతో దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ సెమీస్ స్థానం ఖాయం చేసుకోగా, జింబాబ్వేతో ఆ జట్టు ఆడే మ్యాచ్ నామమాత్రమే. మరోవైపు జింబాబ్వేపై నెగ్గి, దక్షిణాఫ్రికా చేతిలోనే ఓడిన భారత్, వెస్టిండీస్ ఒక్కో గెలుపుతో సమంగా ఉన్నాయి. కాబట్టి ఇరు జట్ల మధ్య ఆదివారం కోల్‌కతాలో జరిగే మ్యాచ్ క్వార్టర్ ఫైనల్‌లాంటిది.
ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే వారికి ఎలాంటి సమీకరణాలు, రన్‌రేట్‌లతో సంబంధం లేకుండా సెమీస్‌లో చోటు ఖాయమవుతుంది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో లీగ్ దశలో ఆ్రస్టేలియా, శ్రీలంకలను ఓడించి సంచలనం సృష్టించిన జింబాబ్వే ‘సూపర్ ఎయిట్స్’లో వెస్టిండీస్, భారత్‌లకు 254, 256 పరుగులు ఇచ్చి ఓటములను ఆహ్వానించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నిష్క్రమించింది.
టి20 ప్రపంచకప్‌లో నేడు
ఇంగ్లండ్ X న్యూజిలాండ్
వేదిక: కొలంబో, రాత్రి 7 గంటల నుంచి
స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం


